టోక్యో : వచ్చే వారంలో రెండోవిడత అణు జలాలను పసిఫిక్ మహా సముద్రంలోకి విడుదల చేస్తామని జపాన్ ప్రకటించింది. ఆగస్టులో కొన్ని టన్నుల వ్యర్థాలను జపాన్ సముద్రంలోకి విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై చైనాతో సహా అనేక దేశాలకు ఆగ్రహం వ్యక్తం చేశాయి. 2011లో జపాన్‌లో సునామీ సంభవించిన సమయంలో ఫుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్‌లో అణు వ్యర్థాలను నిల్వచేసే రియాక్టర్ మరమ్మతులకు గురైంది. అప్పటి నుంచి వ్యర్థ జలాలను ట్యాంకుల్లో భద్రపరుస్తున్నారు. ప్రస్తుతం అవన్నీ నిండిపోవడం శుద్ధి చేసి ఆ జలాలను పసిఫిక్ సముద్రంలో కలిపేస్తున్నారు. ఆగస్టులో జపాన్ తొలి విడత కింద కొంత నీటిని పసిఫిక్ సముద్రంలోకి పంపించింది. 'తొలి విడతపై తనిఖీలు పూర్తయ్యాయి. అక్టోబరు 5న రెండో విడత అణు జలాల విడుదల ప్రారంభమవుతుందని' టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ (టెప్కో) తాజాగా తెలిపింది.
జపాన్ నిర్ణయంపై అనేక దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. జపాన్ సీ ఫుడ్‌పై నిషేధం విధించాయి. రష్యా వంటి దేశం కూడా ఈ నిషేధం అంశాన్ని పరిశీలిస్తోంది.
ఫుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్‌లో మొత్తం 1.34 మిలియన్ టన్నుల వ్యర్థ జలాలున్నాయి. వీటితో 500 ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్స్ నింపేయచ్చు. వీటిలో ఇప్పటిదాకా 7,800 టన్నుల నీరు మాత్రమే సముద్రంలో కలిసింది. దశల వారీగా ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కొన్ని దశాబ్దాలు పడుతుంది. ఆ తరువాత శిథిలమైన రియాక్టర్ నుంచి అత్యంత ప్రమాదకర రేడియోధార్మిక ఇంధనం, ఇతర వ్యర్థాలను తొలగిస్తే ప్లాంటులో మరింత స్థలం అందుబాటులోకి వస్తుందని జపాన్ భావిస్తోంది. రేడియో ధార్మిక పదార్థాలను వడపోసిన తరువాతే నీటిని సముద్రంలోకి వదిలిపెడుతున్నామని టెప్కో చెబుతోంది. ఆ నీటిలో ట్రీటియం సురక్షిత స్థాయిలో ఉందని, దానికి యూఎన్ అటామిక్ ఏజెన్సీ సైతం మద్దతిచ్చిందని ఆ సంస్థ చెబుతోంది. అయితే పపిఫిక్ మహా సముద్రాన్ని జపాన్ ఒక మురుగు కాలువలా వినియోగిస్తోందని కొన్ని దేశాలు మండిపడుతున్నాయి.