Nov 05,2023 09:44

సినిమా ... అదో రంగుల ప్రపంచం. సినిమాల్లో నటించాలనే కోరికతో మంచి ఉద్యోగాలను వదిలేసి చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన వారున్నారు. డాక్టర్‌ కావాలనుకొని యాక్టర్‌ అయ్యామని చెప్పేవాళ్లను కూడా మనం చూస్తుంటాం. అయితే నటనపై ఆసక్తితో ఏకంగా జాయింట్‌ కలెక్టర్‌ ఉద్యోగాన్నే వదిలేసిన వ్యక్తి వడ్లమాని సత్యసాయి శ్రీనివాస్‌. టాలీవుడ్‌లో విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ తన సహజమైన నటనతో ప్రశంసలు అందుకుంటున్నారు ఆయన. ఓ వైపు కామెడీ వేషాల్లో అలరిస్తూ, మరోవైపు విలనీ పాత్రల్లో మెప్పిస్తూ చిత్రసీమలో సరికొత్త గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లోకి రాకముందు ఆయన విశాఖపట్నం జాయింట్‌ కలెక్టర్‌ హోదాలో పనిచేశారనే సంగతి చాలా మందికి తెలియదు.

అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురానికి సమీపంలోని నందంపూడి గ్రామానికి చెందిన డాక్టర్‌ వడ్లమాని సత్యసాయి శ్రీనివాస్‌ సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఎంఎ, పిహెచ్‌డి పూర్తి చేశారు. 1994లో ఎపిపిఎస్‌సి గ్రూప్‌-1 అధికారిగా డిఎస్పీ హోదాలో ఉద్యోగంలో చేరారు. పంచాయతీ రాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో జాయింట్‌ కలెక్టర్‌ హోదాలో ఉద్యోగం చేశారు. ఆ తర్వాత డిపిఒ, డిఆర్‌డిఎ పిడి వంటి పలు బాధ్యతల్లో పనిచేశారు. దాదాపు 22 ఏళ్లపాటు విశాఖపట్నంలోనే పనిచేశారు. సమర్ధవంతమైన అధికారిగా గుర్తింపు పొందారు. అవార్డులను సైతం అందుకున్నారు.
 

                                                                చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం

వడ్లమాని శ్రీనివాస్‌కు చిన్నప్పటి నుంచి సినిమాలు చూడటం అంటే ఎంతో ఇష్టం. ఆయన చదువుకునే రోజుల్లో చిరంజీవి పాపులర్‌ హీరోగా ఉన్నారు. ఆయనకు సాహిత్యంపై కూడా మంచి ఆసక్తి ఉంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలను బాగా వినేవారు. పాడేవారు. సాహిత్యంపై మక్కువ కూడా ఎక్కువగా ఉండేది. గ్రూప్‌-1 అధికారిగా ఉన్న సమయంలో ఆయన కుటుంబ స్నేహితుడు, దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ 'రారండోరు వేడుక చూద్దాం' సినిమాలో చిన్న పాత్ర పోషించేందుకు ఆయన్ని ఒప్పించారు. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడే హీరో జగపతిబాబుతో పరిచయం ఏర్పడింది. గంగవరం పోర్టులో షూటింగ్‌ జరిగిన సమయంలో మరికొంతమంది ఆర్టిస్టులతో పరిచయం ఏర్పడింది. దర్శకుడు మారుతి 'మహానుభావుడు' సినిమాలో సత్య శ్రీనివాస్‌కు అవకాశం ఇచ్చారు. అందులో విలన్‌ వేషం కోసం ఆయన జుత్తు బాగా పెంచి సరికొత్తగా రూపం మార్చుకున్నారు. షూటింగ్‌ తర్వాత మారుతి ఆయన్ని హత్తుకుని చాలా బాగా చేశారని అభినందించారు.
 

                                                              కళారంగంపై మొదటి నుంచీ ఆసక్తి

విశాఖపట్టణంలో సినీ హీరోలు ఫంక్షన్లు, ఆడిటోరియాల్లో జరిగే కళా ఉత్సవాలకు శ్రీనివాస్‌ను అతిథిగా పిలిచేవారు. దర్శకులు, ప్రొడ్యూసర్లు, హీరోలు, ఇతర యాక్టర్లతో ఇలాగ కూడా ఆయనకు పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ పరిచయాలు కాస్త రెగ్యులర్‌ సంబంధాలుగా మారిపోయాయి. విశాఖపట్నంలో సినిమా ఫంక్షన్‌ ఏది జరిగినా దానికి ఏర్పాట్లు, అనుమతులు ఇవ్వటం వంటి వాటికి ఆయన్నే సంప్రదించేవారు. అల్లు అరవింద్‌, కె.విజరు భాస్కర్‌, త్రివిక్రమ్‌, పరశురామ్‌, మారుతి, అనిల్‌ రావిపూడి వంటి వారితో క్రమంగా పరిచయాలు పెరిగాయి. 2019లో వచ్చిన సినీ అవకాశాల మేరకు ఏడాది పాటు ఉద్యోగానికి సెలవు పెట్టి హైదరాబాద్‌కు మకాం మార్చారు. ఆ ఏడాది తొమ్మిది సినిమాల్లో నటించారు. కరోనా పరిస్థితుల నేపధ్యంలో 2020లో సినిమాలు తగ్గి, మూడింటిలో నటించారు. సినిమా అవకాశాలు పెరగసాగాయి. సంపాదన, గుర్తింపూ బాగానే ఉన్నాయి. ఈ క్రమంలో ఉద్యోగంలో కొనసాగాలా? మానేయాలా? అనే సందిగ్ధంలో పడ్డారు. అప్పుడు అల్లు అరవింద్‌, మారుతి, పరశురామ్‌ వంటి వారి సలహా కోరగా, మంచి అవకాశాలు ఇస్తాం.. వచ్చేయండి అని భరోసా ఇచ్చారు. దాంతో, తన భార్య, కుమార్తెతో సంప్రదించి ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. మూడేళ్లలో 100 సినిమాల్లో నటించారు. మంచి గుర్తింపూ, ప్రేక్షకాభిమానమూ పొందారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం తదితర భాషల సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్‌లోనూ ఆయన నటిస్తున్నారు.
 

                                                                             సరికొత్తగా గుర్తింపు

గీత గోవిందం, ప్రతిరోజూ పండుగే, ఎఫ్‌2 ... ఇలా ఆదరణ పొందిన సినిమాల్లో ఆయన మంచి పాత్రలు పోషించి, ఆదరణ పొందారు. వరుసగా సినిమాలు హిట్‌ కావటం, పాత్రలకు మంచి పేరు రావటంతో అవకాశాలు క్యూ కట్టాయి. ధమాకా సినిమాతో 50 పూర్తికాగా, ఇప్పుడు 100 సినిమాలు చేరుకున్నాయి. వచ్చే ఏడాది మే వరకూ ఆయన కొత్త సినిమాలకు షెడ్యూళ్లు సైతం ఖరారయ్యాయి. తాజాగా ఆయన నటించిన భగవంత్‌ కేసరి దసరా హిట్‌ మూవీగా నిలిచింది. ఎఫ్‌2, వకీల్‌సాబ్‌, డియర్‌ కామ్రేడ్‌, మంచి రోజులు వచ్చాయి, దమాకా, బేబీ సినిమాల్లో ఆయన పేరు మార్మోగిపోయింది.
                      - యడవల్లి శ్రీనివాసరావు

image


                                                                 ... మరింతగా పాపులర్‌ అయ్యా

ప్రభుత్వ ఉద్యోగిగా 23 ఏళ్ళు సర్వీస్‌ చేసినప్పుడు ఉన్న రెస్పెక్ట్‌, సినీ ఇండిస్టీలో ఉండదు. డిప్యూటీ కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ హోదా నాకు బాగా ఉపయోగపడింది. అందుకే అవమానకరమైన ఘటనలు ఎదురు కాలేదు. పరిశ్రమలో ఉత్సాహకరమైన వాతావరణం, సపోర్ట్‌ చేసే పరిస్థితులు ఉండటంతో నటుడిగా కొనసాగాలనే కోరిక పెరుగుతూ వచ్చింది. ఉద్యోగానికి రాజీనామా చేసే సమయానికి నాతోపాటుగా నా సతీమణి, కుమార్తెకు ప్రభుత్వ వాహనాలు ఉండేవి. ఇంట్లో పది మంది పనివారు ఉండేవారు. అలాంటి హోదాను వదులుకుని సినిమాల్లోకి రావటం కొంచెం ఇబ్బందే. అయినా ఇండిస్టీలో మంచి గుర్తింపు రావడంతో మెల్లగా ఈ ఇండిపెండెంట్‌ లైఫ్‌కి అలవాటు పడిపోయాను. 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమాకుగాను తొలిసారిగా రూ.10 వేలు రెమ్యునరేషన్‌ అందుకున్నా. 'శైలజా రెడ్డి అల్లుడు' అప్పుడు రోజుకు రూ.30 వేలు ఇచ్చారు. ఇప్పుడు రోజుకి రూ. 50 వేలు నుంచి రూ.60 వేలు వరకూ తీసుకుంటున్నాను. ప్రస్తుతం ప్రభాస్‌-మారుతి సినిమా, 'నా సామి రంగా'తో సహా పాతిక వరకూ ప్రాజెక్ట్స్‌ నా చేతిలో ఉన్నాయి. త్వరలోనే శత చిత్రాల నటుడు అనిపించుకొబోతున్నా. తాజాగా 'భగవంత్‌ కేసరి', 'పెదకాపు 1' చిత్రంలో నేను పోషించిన పాత్రలకు మంచి పేరు వచ్చింది.
                                   -వడ్లమాని సత్య సాయి శ్రీనివాస్‌,
                                       ప్రముఖ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌