Jul 26,2023 22:01

ఎపి విద్యుత్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ స్ట్రగుల్‌ కమిటీ పిలుపు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 10 తరువాత సమ్మెలోకి వెళ్లేందుకు సిద్ధం కావాలని ఎపి విద్యుత్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ స్ట్రగుల్‌ కమిటీ పిలుపునిచ్చింది. ఆగస్టు 17న విజయవాడలోని విద్యుత్‌ సౌధ ముట్టడికి భారీగా తరలిరావాలని విద్యుత్‌ ఉద్యోగులను కోరింది. రాష్ట్రంలోని ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కమ్‌లలో పనిచేస్తున్న ఉద్యోగులు, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు అందరూ ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేసింది. విజయవాడలోని ఎంబివికెలో విద్యుత్‌రంగ ఉద్యోగుల సమస్యలపై ఎపి విద్యుత్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ స్ట్రగుల్‌ కమిటీ ఆధ్వర్యాన బుధవారం నిర్వహించిన భారీ సదస్సు ఈ మేరకు పిలుపునిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు వున్నా, విద్యుత్‌ అధికారులు బెదిరింపులకు పాల్పడ్డా ఏ మాత్రం ఖాతరు చేయకుండా ఈ సదస్సుకు ఉద్యోగులు, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు భారీగా తరలి వచ్చారు. ఎంబివికె పరిసర ప్రాంతం అంతా విద్యుత్‌ ఉద్యోగులతో కిక్కిరిసిపోయింది. ఎంబివికె వద్ద ప్రభుత్వం భారీగా పోలీసులను మోహరింపజేసినా ఏ మాత్రం ఖాతరు చేయకుండా ఉద్యోగులు సదస్సుకు హాజరయ్యారు. ఎపి విద్యుత్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ స్ట్రగుల్‌ కమిటీ నాయకులు సూరిబాబు, రాజశేఖర్‌, రామలింగారెడ్డి, గంగయ్య అధ్యక్షతన ఈ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు నేషనల్‌ కో ఆర్డినేషన్‌ కమిటి ఆఫ్‌ ఎలక్ట్రిసిటి ఇంజనీర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ప్రధాన కార్యదర్శి ప్రశాంత్‌ సంద చౌదరి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్‌ను మార్కెట్‌ సరుకుగా మార్చే ప్రయత్నాల పట్ల ఉద్యోగులు అప్రమత్తంగా వుండాలని ఆయన కోరారు. విద్యుత్‌ సంస్కరణలకు తీవ్ర ప్రతిఘటన రావడంతో దొడ్డిదారిన సంస్కరణలను అమలు చేసేందుకు స్మార్ట్‌ మీటర్లను ప్రవేశపెడుతోందని విమర్శించారు. స్మార్ట్‌ మీటర్లను ప్రవేశపెడితే విద్యుత్‌ రంగంలో మీటర్‌ రీడింగ్‌, బిల్లింగ్‌ చేసే ఉద్యోగులు వుండరని తెలిపారు. స్మార్ట్‌ మీటర్ల ద్వారా అదాని, అంబానీలకు రూ 2.06 లక్షల కాంట్రాక్టును కేంద్రం ఇస్తోందని విమర్శించారు. అలాగే రూ.700, రూ.800కు లభించే విద్యుత్‌మీటర్ల స్థానే ఏడెనిమిది వేలు ఖర్చు చేసి స్మార్ట్‌ మీటర్లు ఎందుకు పెట్టుకోవాలో ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని కోరారు. విద్యుత్‌కు డిమాండ్‌ వున్న సమయంలో ఎక్కువ చార్జీలను వసూలు చేసేందుకే ఈ స్మార్ట్‌ మీటర్లను కేంద్రం ప్రవేశపెడుతోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనే ఇటీవల యూనిట్‌ విద్యుత్‌కు రూ.17.80 చెల్లించారని, ఆ రేట్‌ను రూ.50లకు తీసుకెళ్లేందుకు వెనుకాడరని అన్నారు. విద్యుత్‌ సంస్కరణలను దొడ్డిదారిన అమలు పరిచే ఈ స్మార్ట్‌ మీటర్లను ఉద్యోగులంతా ప్రతిఘటించాలని కోరారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు, ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేసు మాట్లాడుతూ విద్యుత్‌ రంగంలోని ఉద్యోగుల సమస్యలపట్ల యాజమాన్యాలు, ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నాయన్నారు. విద్యుత్‌ రంగంలో 85వేల మంది ఉద్యోగులు వుండాల్సి వుండగా, కేవలం 50వేల ఉద్యోగులతో పనిచేయించుకుంటున్నారని అన్నారు. పనిభారం పెరిగి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. ఉద్యోగులకు కొత్త పిఆర్‌సిలోనైనా న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్బంగా ఎపి విద్యుత్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ స్ట్రగుల్‌ కమిటి నాయకులు పి సుదర్శన్‌ రెడ్డి, వి సుబ్బారెడ్డి, వి శివయ్య, ఎం బాలకాశి, కట్టానాగరాజులు తదితరులు మాట్లాడారు. ఈ సదస్సులో రాష్ట్రవ్యాప్తంగా ఎపి విద్యుత్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ స్ట్రగుల్‌ కమిటీ చేపట్టిన ఆందోళనా కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరుతూ తీర్మానాలు చేశారు. ఈ నెల 30న ప్రతి జిల్లా కేంద్రంలో ఇతర ఉద్యోగ, కార్మిక సంఘాలతో రౌండ్‌టేబుల్‌ సమావేశాలు, 31న డిమాండ్స్‌ డేగా అన్ని జిల్లాల కలెక్టర్‌లకు వినతి పత్రాలను ఇవ్వాలని తీర్మానించింది. అలాగే ఆగస్ట్‌ 2న అన్ని సర్కిల్‌ కార్యాలయాలు, ఉత్పాదక కేంద్రాల వద్ద, 7న తిరుపతిలోని ఎపిఎస్‌పిడిసిఎల్‌ కార్యాలయం ముందు ధర్నాలు చేయాలని తీర్మానం చేశారు. 17న చలో విద్యుత్‌ సౌధను జయప్రదం చేయాలని కోరింది. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఆగస్టు 10 తర్వాత సమ్మెలోకి వెళ్లేందుకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చింది. సదస్సు అనంతరం ఇందనశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి విజయానంద్‌ను ఎపి విద్యుత్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ స్ట్రగుల్‌ కమిటీ నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు.