Nov 12,2023 11:24

మొదటి నుండి ఆ తాతకు
పుస్తకాలు ఇష్టము !
చదవకుండ పుస్తకాలు
నిదురించుట కష్టము !!
షాపువాళ్ళు పుస్తకాల
స్టాకు వచ్చెనందురు !
తాత వెళ్ళి పుస్తకాలు
తప్పక కొనుచుందురు !!
పాత పుస్తకాలు వున్న
ప్రతి ఇంట్లో అందరు
అడ్డంగా వున్నాయని
అమ్మివేయుచుందురు !!
పాత పుస్తకాల లాగె
తాత గూడ కనబడు !
ఇంటిలోన అడ్డమనుచు
గెంటినాడు మనుమడు !!
తానుకొన్న పుస్తకాలె
తనకు వున్న ఆస్తని
పట్టుకెళ్ళె తాత
వదిలి పెట్టకుండ వాటిని !!
పాత పుస్తకాలె ఇపుడు
తాతకు ఆధారము !
అవి బజారులోన పరచి
అమ్మే వ్యాపారము !!
దారినేగు వారిలోన
దరికి వచ్చి కొందరు
నచ్చినట్టి పుస్తకాలు
పుచ్చుకెళ్ళుచుందురు !!
గ్రంధ కర్తలకు తమతమ
గ్రంధాలే దొరికిన !
సొంతబిడ్డ దొరికినంత
సంతపమగు మనసున !!
ఏ పుస్తకమెపుడెవరికి
ఏ అవసరమగునో!
పాత పుస్తకాలటంచు
పారవేయతగునో!!
విస్తరించ తెలివి పాత
పుస్తకాలె మూలము
పాత పుస్తకాల ఘనత
ప్రస్తుతించజాలము!!
పాత పుస్తకాల వలెనె
తాత అనుభవాలు
నిజ జీవన యాత్రలోన
నిత్యమవసరాలు !!
అక్షరాస్యులందరికీ
నిక్షిప్తపు నిధి ఇది !
నిక్షేపంగ ఎవరికీ
ఆక్షేపణ కాదిది !

'బాలబంధు' అలపర్తి వెంకట సుబ్బారావు
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత
9440805001