
భారీ వర్షాలు, వరదలు హిమాచల్ ప్రదేశ్‌ను వణికిస్తున్నాయి. కొండ చరియలు ఎక్కడికక్కడ విరిగి పడుతున్నాయి. ఇళ్లు పేక మేడల్లా కూలిపోతున్నాయి. ఈ ఏడాది వర్షాకాలంలో 150 మంది ప్రాణలు కోల్పోగా ఈ వారంలోనే సుమారు 60 మంది మరణించారు. ఆచూకి తెలియని వారింకెందరో ! లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. నదులు, వాగులు పొంగుతుండటంతో పలు ప్రాంతాల్లో రైల్వే లైన్లు కొట్టుకుపోయాయి. ఈ వర్షా కాలం ప్రారంభమైన తరువాత ఇప్పటివరకు 9,600 ఇళ్లు పాక్షికంగా లేదా పూర్తిగా ధ్వంసం కాగా పది వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. 170 వరకూ కొండచరియలు విరిగిపడిన, పిడుగులు పడిన ఘటనలు జరిగినట్లు, రాజధానికి పోయే ప్రధాన రహదారితో పాటు 621 రోడ్లు దెబ్బతిన్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా 752 రోడ్లను మూసివేసినట్లు అధికారులు తెలిపారు. వాస్తవంలో నష్టాలు అధికారిక లెక్కలకన్నా అధికంగా ఉంటాయన్నది జగమెరిగిన సత్యం. కష్టాలు, కన్నీళ్ల నడుమ కొట్టుమిట్టాడుతున్న హిమాచల్ ప్రజానీకాన్ని ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సకల చర్యలూ చేపట్టడం ఎంతో అవసరం. ప్రాణాలరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్న బాధితులకు భరోసా కల్పించడం పరిపాలకుల బాధ్యత. ఇందుకు రాజకీయ విభేదాలు అడ్డు కారాదు.
అభివృద్ధి పేరిట విచక్షణా రహితంగా భారీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల ఏర్పాటు, బహుళ అంతస్తుల భవనాలు నిర్మించడం, అందుకోసం కొండలను తొలిచేయడమే ఇంతటి విధ్వంసం జరగడానికి ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు ఘంటాపథంగా చెబుతున్నారు. ఇదేదో ఇప్పటికిప్పుడు అంటున్న మాట కాదు. దశాబ్దాల కిందటనే పలు పరిశోధనలు గావించిన భూగర్భ, భూభౌతిక శాస్త్రవేత్తలు నిర్ద్వంద్వంగా నిగ్గు తేల్చారు. ఆ మాటకొస్తే కేవలం హిమాచల్ ప్రదేశ్‌కు మాత్రమేగాక హిమాలయ సాణువుల్లోని ఇతర రాష్ట్రాలకూ ఈ ప్రమాదముందని వారు హెచ్చరించారు. అయినా అభివృద్ధి పేరిట ఆకాశ హర్మ్యాల నిర్మాణానికి ప్రభుత్వాలు అనుమతులిచ్చాయి. జల విద్యుత్ ప్రాజెక్టుల కోసం ఒకవైపున కొండలను తొలిచేయడం, మరోవైపు నిర్మాణ వ్యర్ధాలను ఆ నదుల్లోనే కలిపేసి ప్రవాహాలకు ఆటంకాలు కల్పించడం యథేచ్ఛగా సాగిపోతోంది. ఈ అంశాలపై హిమాచల్ హైకోర్టు గత ఏడాది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తలంటింది కూడా! హిమాలయాల్లో ఇప్పటికి 168 జల విద్యుత్ కేంద్రాలుండగా 2030 నాటికి 1,088 కేంద్రాలు రానున్నాయని ఏలినవారు గొప్పగా చెబుతుండడం వారి నిర్లక్ష్య ధోరణికి పరాకాష్ట.
హఠాత్తుగా భారీ వర్షాలు, ఫలితంగా ఆకస్మిక వరదలు సంభవించడానికి పర్యావరణ మార్పులు ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. వాతావరణ పర్యవసానాల మూలంగా హిమాలయాలు, భారత కోస్తా ప్రాంతాలకు గట్టి దెబ్బ తగుల్తుందని ఐపిసిసి 6వ నివేదిక స్పష్టం చేసింది. ఈ ఏడాది అసాధారణంగా కురుస్తున్న వర్షాలు అది నిజమని నిర్ధారించాయి. పర్యావరణ మార్పులు ఇంత తీవ్రంగా జరగడానికి అభివృద్ధి పేరిట విచక్షణా రహితంగా ప్రకృతిపై దాడి చేయడమే కారణం. భౌగోళిక పరిస్థితులకు, స్థానిక ప్రజల అవసరాలకు తగిన రీతిలోనే అభివృద్ధి ప్రణాళికలుండాలి తప్ప కార్పొరేట్ల లాభాపేక్ష కోసం పర్యాటక ప్రాజెక్టులు, భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులను చేపట్టడం వినాశనానికే దారి తీస్తుంది. వేల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన నాలుగు లైన్ల మనాలి హైవేలో 40 శాతం కేవలం రెండు రోజుల్లోనే ధ్వంసమైన తీరు చూసిన తరువాతయినా పాలకులు కళ్లు తెరవాలి. హిమాలయ పర్వత ప్రాంతాలు, వాటి సాణువుల్లో ఎలాంటి నిర్మాణాలైనా పర్యావరణ పరిరక్షణకు హితమైన రీతిలో మాత్రమే జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు ఇకనైనా చేపట్టాలి. మల్టీ డిసిప్లినరీ నిపుణుల బృందాలు చర్చించి శాస్త్రీయంగా అటువంటి విధానాన్ని రూపొందించాలి. ప్రజల ప్రయోజనం కాపాడడం, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఉండాలి. ప్రభుత్వాల ఆలోచనా సరళి, విధాన రూపకల్పనకు అవే పరమావధి కావాలి.