
- పాలకుల చెప్పుచేతల్లో ఎన్నికల కమిషన్
- సంస్థ స్వతంత్రతను దెబ్బతీస్తున్న మోడీ ప్రభుత్వం
- సుప్రీం ఆదేశాలూ బేఖాతరు
న్యూఢిల్లీ : దేశంలో స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించడంలో కీలకపాత్ర పోషించాల్సిన ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసి, తన అదుపాజ్ఞల్లో ఉంచుకునేందుకు నరేంద్రమోడీ ప్రభుత్వం చేయని ప్రయత్నమంటూ లేదు. తాజాగా ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర అధికారుల నియామకాలు, వారి సర్వీసు నిబంధనల విషయంలో పార్లమెంటులో మోడీ ప్రభుత్వం ప్రతిపాదించిన మార్పులు ప్రజాస్వామ్యవాదులందరికీ ఆందోళన కలిగిస్తున్నాయి. ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ను తప్పించడంపై ప్రతిపక్షాలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి. గతంలో నియామక కమిటీలో ప్రధాన న్యాయమూర్తి, ప్రధాని, ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉండేవారు. ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తిని తొలగించగా ఏర్పడిన ఖాళీని ప్రధాని నామినేట్ చేసే కేంద్ర మంత్రితో భర్తీ చేస్తారు. అంటే త్రిసభ్య కమిటీలో ప్రతిపక్ష నాయకుడు కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమవుతాడు.
ఎన్నికల కమిషన్‌లో ఒక కమిషనర్ పదవి ఫిబ్రవరిలో ఖాళీ అవుతుంది. ఆ స్థానంలో ప్రభుత్వం తనకు ఇష్టుడైన వ్యక్తిని నియమించుకునే అవకాశం ఇప్పుడు ఏర్పడింది. గతంలో అనూప్ బరన్వాల్, కేంద్రం మధ్య నెలకొన్న వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని చేర్చారు. ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయం సుప్రీం తీర్పును కాలరాస్తోంది. అసలు ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర కమిషనర్ల నియామకంపై రాజ్యాంగం, న్యాయస్థానాలు ఏం చెబుతున్నాయి ?
పారదర్శకత కోసం పిటిషన్లు
రాజ్యాంగంలోని 324(2) అధికరణ ప్రకారం పార్లమెంట్ చట్టాలకు అనుగుణంగా ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమిస్తారు. ఇప్పటి వరకూ వీరి నియామకాలపై ఎలాంటి చట్టాలు చేయలేదు. ఎన్నికల కమిషనర్ల నియామకం మరింత పారదర్శకంగా ఉండేలా చూడాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై గతంలో సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం కొలీజియం వ్యవస్థ లేదా కమిటీని ఏర్పాటు చేయాలని, ప్రత్యేక సచివాలయాన్ని ఏర్పాటు చేసి సుప్రీంకోర్టు తరహాలో అధికారాలు కల్పించాలని పిటిషనర్లు కోరారు. ఎన్నికల కమిషనర్ల నియామకంలో ప్రభుత్వ పాత్ర ఉండరాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కమిషనర్ల నియామకం విషయంలో విధివిధానాలను రూపొందిస్తూ పార్లమెంట్ చట్టం చేయాలని సూచించింది. ఆ పని ఇప్పటి వరకూ జరగలేదు.
శేషన్, లింగ్డోల హయాంలో...
టిఎన్ శేషన్ హయాంలో ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించింది. ప్రజాస్వామ్య పరిరక్షణకు పలు చర్యలు తీసుకుంది. ఓటర్లకు గుర్తింపు కార్డులు జారీ చేయకపోతే 1995 జనవరి తర్వాత ఎన్నికలు నిర్వహించే ప్రసక్తే లేదని ఆయన తెగేసి చెప్పడంతో ప్రభుత్వం ఒత్తిడికి గురైంది. చివరికి సుప్రీంకోర్టు జోక్యంతో ప్రతిష్టంభన తొలగింది. ఎన్నికల పరిశీలకుల నియామకం కూడా ఆయన హయాంలోనే జరిగింది. ఆ విధంగా శేషన్ ఎన్నో ఎన్నికల సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత వచ్చిన జెఎం లింగ్డో శేషన్ దారిలోనే పయనించినప్పటికీ అనేక అవరోధాలు ఎదురయ్యాయి.
తాబేదార్లతో నింపుతారా ?
ఇప్పుడు శేషన్, లింగ్డో వంటి నిష్పాక్షిక ఎన్నికల అధికారులు మోడీ ప్రభుత్వానికి అవసరం లేదు. లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడేందుకు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించే వారిని పాలకులు భరించలేకపోతున్నారు. తాము చెప్పినట్లు నడుచుకుంటూ, తాబేదార్లుగా వ్యవహరించే వారితో ఎన్నికల కమిషన్‌ను నింపేయాలని చూస్తున్నారు. అందుకే కమిషన్ స్వతంత్రతను నీరుకార్చే ప్రయత్నాలు సాగిస్తున్నారు. కమిషనర్ల నియామక ప్రక్రియలో మాత్రమే కాదు... వారి సర్వీసు నిబంధనల్లో కూడా ప్రభుత్వం మార్పులు చేస్తోంది. ఎన్నికల కమిషనర్లకు ఇంతకుముందు సుప్రీంకోర్టు న్యాయమూర్తి హోదా ఉండేది. ఇప్పుడది క్యాబినెట్ కార్యదర్శి స్థాయికి పడిపోయింది.