
కందుకూరి వీరేశలింగం, గురజాడ, శ్రీశ్రీల తర్వాత తెలుగు సాహిత్యంలో వైతాళికుడిగా స్మరించదగిన వ్యక్తి గుంటూరు శేషేంద్ర. ఆయన్ని కేవలం కవిగానో లేదూ కవిసేన మేనిఫెస్టో రాసిన విమర్శకుడిగానో గుర్తించటానికి అలవాటు పడ్డామే తప్ప, కామోత్సవ్ రాసిన మహా అరుదైన సవలాకారుడిగా మనం చాలా వెనక అడుగులు వేస్తున్నామని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. కామోత్సవ్ నవలా శిల్పం గమనించినప్పుడు ఒక చేయి తిరిగిన నవలాకుడిగా శేషేంద్ర విశ్వరూపం చూపించాడు. ఆయన మాటల్లోనే చెప్తే 'ఈస్తెటిక్ రూపంలో వున్న ఇంటలెక్చువల్ జైంట్'గా శేషేంద్ర మనకి రూపుగడ్తాడు (కామోత్సవ్ నవల పేజి 126). ఎన్నో వేల నవలలు చదివిన రచయితగా కామోత్సవ్ నవల చదివి నేను విస్తుబోయాను. నాకు ప్రీతిపాత్రమైన హెరాల్డ్ రాబిన్స్‌లా ఉన్నత, ఆభిజాత్య వంశాల్లో ఉన్న స్త్రీ, పురుషుల కామ సంబంధాలను ఆయన ఎంతో చాకచక్యంగా దృశ్యమానం చేశాడు. ఇక్కడ కామోత్సవ్ నవలలో ఆయన చూపిన ప్రతిభని కొనియడాటానికే ప్రస్తావన తెస్తున్నానే తప్ప కామోత్సవ్ నవలపైన చర్చించటానికి కాదు.
శేషేంద్ర శైలీశిల్పాలు ఎంతగా విస్మ ృతికి గురిచేయబడ్డాయో మన పరిశోధకులు గమనిస్తారని ఈ మాత్రంగా గుర్తు చేస్తున్నాను. నిత్య స్మరణీయుడైన శేషేంద్ర జ్ఞాపకాలని మనం పదిలపరుచుకో లేకపోతున్నామనే ఒక దుగ్ధ నా చేత ఈ మాటలు పలికిస్తున్నది. ఆ అలవాటు, ఆ సంస్కృతి మన తెలుగునాట లేదు. కనీసం ఒక డాక్యుమెంటరీగా కూడా ఈ రోజుకీ ఆయన సాహిత్య ప్రస్థానాన్ని మనం దాచుకోలేక పోయాము. అందుకు ఎవర్నీ నిందించి లాభం లేదు.
వ్యక్తి పూజ తప్పుగానీ వీర పూజలో ఎంతో ఔచిత్యం ఉంది. ఆ నడవడికకి శేషేంద్ర ఎంతో అనుకూలమైన స్మరణీయుడు, ఆయన రాణివాసం పట్ల కొంత వెగటు వుండవచ్చు కొంతమందికి, కానీ ఆయన ప్రజల మనిషి గానే తన కవిత్వాన్ని ప్రసారం చేశాడు. కమ్యూనిష్టుగా ముద్రవేసి ఆయనని వేధించిన సంగతి ఎంత మందికి తెలుసు. శ్రీశ్రీ 1955 ఎన్నికల్లో నిలబడి మతిస్థిమితం కోల్పోయినప్పుడు శేషేంద్ర అండగా నిలబడి ప్రోత్సాహం చూపిన ధైర్యజీవిగా మనం కొంచం అయినా గుర్తు చేసుకుంటే మనమేమీ కోల్పోము. అమెరికన్ సామ్రాజ్య వాదాన్ని నిరసిస్తా, గల్ఫ్ యుద్ధానికి వ్యతిరేకంగా 'నీతులు చెప్పే అమెరికా - ఇదీ నీ చరిత్ర' అని వ్యాస సంపుటిని ఇది ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదు.
ఆయన రెండో కుమారుడు సాత్యకి కృషి మూలంగా ఎంతో కొంత శేషేంద్ర సాహిత్యం మనకి లభ్యం అవుతున్నది. గానీ ఇంకా శేషేంద్ర సాహిత్యం కొంత వెలుగు చూడాల్సిన సంగతులు మన పరిశోధకులు పట్టించుకోవల్సిన అవసరం ఎంతో ఉంది. శేషేంద్రకి ఎన్ని అనుకూల శక్తులు ఉన్నాయో, అన్ని ప్రతికూల శక్తులూ ఈ నాటికీ తారస పడ్తున్నాయి. పునరపి అనుకోకుండా ఉంటే కామోత్సవ నవల నర్సరావుపేట మున్సిఫ్ కోర్ట్, ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్, సుప్రీం కోర్టుల్లో అశ్లీల కేసు ఎదుర్కొని విజయ ఢంకా మోగించిన సంచలనాత్మక సంగతి ఈరోజు ఎంత మందికి గుర్తు ఉందో లేదో తెలియదు గానీ,.. 'శేషేంద్ర వెలుగు నీడల్లో...' అనే పుస్తకంలో ఆ మహానుభావుడి వ్యక్తిగత జీవితంపై బురద చల్లిన వనమాలి 'నాన్నతో తన అనుభవాలు' ఎంత జుగుప్స కలిగించిందో చెప్పలేము. ఒక మహాకవి జీవితాన్ని బయటికి ఈడ్చి వనమాలి సాధించిన ఆనందమేదో అవగతం కావటం లేదు. నాకు సాహిత్యమే జీవితంగా, జీవితమే సాహిత్య పోరాటంగా నిప్పులు చిమ్మిన శేషేంద్ర కవిత్వంపై ఎంతగా బూడిద చల్లాలని ప్రయత్నించినా అవి విఫల కుట్రలుగానే చతికిలబడి పోతాయి, పోయాయి కూడా.
ఎడ్గార్ ఎలన్ పో మీద కూడా ఆయన వ్యతిరేకులు ఎడ్గార్ చనిపోయాక వారి మీద అవీ ఇవీ కల్పించి, చివరికీ డ్రగ్గిస్ట్‌గా, స్త్రీలోలుడిగా చిత్రీకరించి దుష్ప్రచారం చేశారు. కానీ వాళ్ళంతా కాని వాళ్ళు, కానీ శేషేంద్ర మీద అయిన వాళ్ళే జ్ఞాపకాల పేరిట వారి ప్రతిష్టకి మచ్చ వచ్చేలా రాతలు రాస్తే ఎలా? నిజానికి వ్యక్తిగత విషయాలు సాహిత్యలోకానికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాబోయే 4 యేళ్ళల్లో అంటే అక్టోబర్ 2027లో గుంటూరు శేషేంద్ర శతజయంతి ఉత్సవాలు రాబోతున్నాయి. అందుకు ఇప్పటి నుంచే సన్నాహక కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకొని శేషేంద్ర సమగ్ర సాహిత్యం తేవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆయన అభిమానులు, సాహిత్య సంఘాలు విశ్వ విద్యాలయాలు పూనుకొని ఇప్పటి నుంచే ఒక కార్యక్రమ ప్రణాళిక తయారు చేసుకోవాల్సిన సందర్భం మనముందు ఉందని మనవి చేస్తున్నాను.
నిజానికి ఈ విశాల ప్రపంచమే ఆయన కుటుంబం. ప్రజలే ఆయన బిడ్డలు. ఆయన ప్రజల కోసమే తపించి తన సాహిత్యాన్ని ఆ దారిలో నడిపించాడు. ప్రజల కష్టాలు తీరాలని వగచాడు. ఆయన ఒక షాయరీతో వ్యాసం ముగిస్తాను. ''ఎవడో ఇరవయ్యో శతాబ్దపు భక్తుడు / గుడి గంట మోగించాడు. దూరాన నాకు వినపించింది / ఆ ముసలి దేవాలయం దగ్గుతోంది / రాళ్ళు ఊడి పోయాయి. అక్కడక్కడా దంతాల్లా. / మనిషి కష్టాలు తీర్చే శక్తి ఎవరో / మనిషి ఇంకా వెతుకుతూనే ఉన్నాడు అక్కడే.'' ఇలా శేషేంద్రలా కవిత్వం చెప్పేశక్తి అందరికీ రాదు. అదో అరుదైన గొంతుక.
(అక్టోబర్ 20 : శేషేంద్ర 96వ జయంతి)
- సాగర్ శ్రీరామ కవచం