
బ్రసీలియా : బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డసిల్వా మాట్లాడుతూ, గాజాలో జరుగుతున్నది యుద్ధం కాదు, ఊచకోత అని అన్నారు. యూదు దురహంకార ఇజ్రాయిల్ సాగిస్తున్న క్రూరమైన దాడుల్లో ఇప్పటికే 2,000 మంది పిల్లలతో సహా 7వేల మందికి పైగా అమాయక పాలస్తీనా పౌరులు మరణించారని ఆయన అన్నారు. ఇజ్రాయిల్ చర్యలు ఊచకోతతో సమానమని స్పెయిన్ సామాజిక హక్కుల తాత్కాలిక మంత్రి విమర్శించారు. ఇజ్రాయిల్‌పై యూరప్ దేశాలు వెంటనే తమ దౌత్య సంబంధాలను తెగదెంపులు చేసుకుని, ఆ దేశంపై ఆర్థిక ఆంక్షలు విధించాలని ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు. గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయిల్ జరిపిన దాడిలో అల్ జజీరా గాజా ముఖ్య విలేకరి వయెల్ దాదూ భార్య, కుమారుడు, కుమార్తె చనిపోయినట్లు గాజా టివి న్యూస్ చానెల్ బుధవారం తెలియజేసింది. మరో రెండు గంటల తరువాత దాదూ మనవడు కూడా ఆసుపత్రిలో చనిపోయినట్లు వార్త వచ్చింది. ఇదిలా వుండగా గాజాపై దాడులకు సంబంధించి వార్తల కవరేజిని కుదించుకోమని మీ నిధులతో నడుస్తున్న అల్ జజీరాపై ఒత్తిడి పెంచాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ ఖతార్ ప్రభుత్వాన్ని కోరినట్లు అనధికారిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇజ్రాయిల్‌లోని అల్‌జజీరా కార్యాలయాన్ని మూసేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని ఇజ్రాయిలీ కమ్యూనికేషన్స్ మంత్రి ష్లోమా కర్హి తెలిపారు.