Oct 03,2023 08:54

కరోనా రక్కసి సృష్టించిన బీభత్సం ఇప్పుడప్పుడే మరిచిపోలేం. భారీ సంఖ్యలో చోటుచేసుకుంటున్న మరణాలతో ప్రపంచం వణికిపోతున్న రోజులవి! ఆ భయానక రోజుల్లోనే కరోనాకు వ్యాక్సిన్‌ సిద్ధమౌతోందంటూ వచ్చిన వార్తలు కూడా అంతే కలకలం రేపాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజానీకంలో ఎన్నో అనుమానాలు! అందరిలోనూ 'ఇంత త్వరగా వ్యాక్సినా... ఎలా తయారైంది?' అన్న ప్రశ్నే! దానికి సమాధానమే తాజా నోబెల్‌ బహుమానం అందుకుంటున్న కాటలిన్‌ కరికో! మరోశాస్త్రవేత్త డ్రూ వెయిస్‌మన్‌తో కలిసి ఎంఆర్‌ఎన్‌ఎ వ్యాక్సిన్స అభివృద్ధికి, వైద్య శాస్త్రంలో విశేష కృషి చేసినందుకు ఆమె 2023వ సంవత్సరపు నోబెల్‌ బహుమతిని అందుకుంటున్నారు. 68 సంవత్సరాల కాటలిన్‌ కరికో వైద్య రంగంలో నోబెల్‌ బహుమతిని అందుకుంటున్న 13వ మహిళ! 2020 సంవత్సరం చివర్లోనే అందుబాటులోకి వచ్చిన ఫైజర్‌-మోడెర్నా వ్యాక్సిన్‌ కరోనా పై మానవాళి చేసిన పోరాటంలో గేమ్‌ ఛేంజర్‌గా ఖ్యాతి పొందడం వెనుక కాటలిన్‌ కరికో ఏళ్ల తరబడి సాగించిన కృషి ఉంది.

              వైద్య శాస్త్రంలో కాటలిస్‌ చేసింది మాములు కృషి కాదు. ప్రపంచమంతా ఒకవైపు నడుస్తుంటే , దానికి భిన్నమైన మరో దారిని ఎంచుకోవాలంటే ఎంత ధైర్యం కావాలి! ఆ పనే ఆమె చేసింది. 1980వ దశకం ఆరంభంలో ప్రపంచ వ్యాప్తంగా వైద్యరంగ నిపుణులు డిఎన్‌ఎల వైపు దృష్టి సారించారు. డిఎన్‌ఏల పై పరిశోధన ద్వారా అద్భుతాలను సాధించవచ్చని వైద్యశాస్త్రం నమ్ముత్న్ను రోజులవి! ఆ సమయంలో కాటలిన్‌ ఆర్‌ఎన్‌ఎల వైపే అడుగులు వేశారు. సహోద్యోగులు, మిత్రులు అందరూ ఆ పరిశోధనలను వదిలి డిఎన్‌ఎలవైపు వచ్చేయాలని ఎంతగానో ఒత్తిడి చేశారు. 'ప్రపంచమంతా డిఎన్‌ఎ వైపు వెడుతుంటే ఆర్‌ఎన్‌ఎలో ఏం సాధిస్తావు?' అంటూ ప్రశ్నించిన వాళ్లు ఉన్నారు. ఈ ఒత్తిడి తట్టుకుంటూ ఏళ్ల తరబడి నిరంతరాయంగా పరిశోధనలు సాగించడమంటే మాటలా? అయినా ఆమె అనుకున్నది సాధించారు. హంగేరిలోని అత్యంత నిరుపేద కుటంబంలో కాటలిన్‌ జన్మించింది. ఆమె తండ్రి మాంసం విక్రేత. ఆమె తల్లి కూడా పుస్తకాల షాపులో పనిచేస్తేనే జీవనం సాగేది. రేడియో, టివిల వంటివి కాదుగదా, కడుపునిండా తనడానికి కూడా లేని దుర్భర పరిస్థితుల్లో తన బాల్యం సాగినట్లు కాటలిన్‌ చెప్పారు. అయినా, ప్రాధమిక విద్యలో సైన్స్‌లో ముఖ్యంగా జీవశాస్త్రంలో ఆమె చిన్నప్పటి నుండి రాణించారు. పిహెచ్‌డి చేసిన తరువాత 1985లో ఆమె హంగేరిని వీడి అమెరికాకు చేరుకున్నారు.
 

                                                                      ఆర్‌ఎన్‌ఏలపై దృష్టి ఇలా...

1988-89 మధ్య కాలంలో ఆమె ఎయిడ్స్‌ రోగులకు నిర్వహించిన క్లినికల్‌ ట్రయల్స్‌లో పాల్గొన్నారు. తీవ్ర స్థాయిలో బాధ పడుతున్న వారికి కూడా డబుల్‌ స్టాండర్డ్‌ ఆర్‌ఎన్‌ఎ (డిఎస్‌ ఆర్‌ఎన్‌ఎ)తో చేసిన చికిత్స ఉపశమనం కలిగించడం ఆమె గమనించారు. ఈ విధానం గురించి అప్పట్లో పూర్తిస్థాయి అవగాహన లేకపొయినప్పటికీ ఎయిడ్స్‌ చికిత్సలో కీలక అడుగుగా శాస్త్ర సమాజం భావించింది. అప్పటినుండి ఆర్‌ఎన్‌ఏలపై ఆమె పూర్తిస్థాయి దృష్టి సారించింది. ఎయిడ్స్‌పై జరిగిన పరిశోధనలకు భిన్నంగా స్వతసిద్దంగా ఆర్‌ఎన్‌ఏనే రోగ నిరోధక శక్తి పెంచుకునేలా ఎందుకు చేయకూడదు? అని ఆమె ప్రశ్నించుకున్నారు. ఎయిడ్స్‌ చికిత్సలో ఆర్‌ఎన్‌ఎకు బయటనుండి ఆ శక్తిని అందించేవారు. దానికి భిన్నంగా రోగి శరీరంలోని ఆర్‌ఎన్‌ఏనే ఆ శక్తిని తయారుచేసుకునేలా (ఎంఆర్‌ఎన్‌ఎ)లా మార్చడమే ఈ పరిశోధనల సారాంశం, ఈ దిశలో రూపొందించిన పరిశోధన పత్రాలను ప్రచురించడానికి నేచర్‌, సైన్స్‌ వంటి ప్రఖ్యాత సైన్స్‌ జర్నల్స్‌ తిరస్క రించాయి. అయితే, 2005లో ఇమ్యూనిటి అనే సైన్స్‌ జర్నల్‌ ఈ పరిశోధనను ప్రచురించింది గానీ, శాస్త్ర సమాజంలో పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే, కరోనా విజృంభణ తరువాత ఈ పరిస్థితి మారింది. 2020 చివరల్లో ఎంఆరఎన్‌ఎ సాంకేతికతతో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లకు ప్రభుత్వాల నుండి ఆమోదం లభించింది.
 

                                                                             కమ్యూనిస్టు వ్యతిరేకి...?

కమ్యూనిస్టుల వ్యతిరేకులకి నోబెల్‌ కమిటీ పెద్ద పీట వేస్తుందన్న విమర్శ ఉన్న సంగతి తెలిసిందే. కాటలిన్‌ కూడా ఆ కోవకు చెందిన వ్యక్తే! 1980వ దశకంలో హంగేరిలో ఉన్న కమ్యూనిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె పనిచేశారు. హంగేరియన్‌ పోలీసులు ఈ విషయాన్ని గుర్తించారు. పోలీసులు చర్యలు తీసుకుంటారన్న భయంతో ఆమె తన రెండు సంవత్సరాల కూతురు, భర్తతో కలిసి హంగేరిని వదిలి అమెరికాకు చేరుకున్నారు. 'మాకున్న ఒక కారును అమ్మి, వచ్చిన 900 డాలర్లను టెడ్డిబేర్‌లో దాచి అమెరికాకు చేరుకున్నాం' అని ఆమె ఓ సందర్భంలో చెప్పారు.

                                                                             డిఎన్‌ఎ అంటే...

డిఎన్‌ఎ అంటే డీ ఆక్సీరైడో న్యూక్లిక్‌ ఆసిడ్‌ . ఇది శరీరంలోని ఒక అణువు వంటిది. ఒక జీవి అభివృద్ధి చెందడానికి, జీవించడానికి, పునరుత్పత్తి చేయడానికి అవసరమైన సంకేతాలను కలిగిఉంటుంది.
 

                                                                          ఆర్‌ఎన్‌ఎ అంటే...

రిబో న్యూక్లియిక్‌ యాసిడ్‌ (ఆర్‌ఎన్‌ఎ) జీవులతో పాటు అత్యధిక వైరస్‌లలో ఉండే అణువు. డిఎన్‌ఏ వంటి ప్రాధమిక నిర్మాణ యూనిట్లను ఏర్పాటుచేసే న్యూక్లియోటైడ్‌లను ఇవికలిగిఉండి, నత్రజని.ఫాస్పేట్‌ సమూహాలతో జత చేయబడి ఉంటాయి.
 

                                                                           ఎంఆర్‌ఎన్‌ఎ అంటే...

మెసెంజర్‌ రిబో న్యూక్లియిక్‌ యాసిడ్‌ (ఎంఆర్‌ఎన్‌ఎ) జన్యువు యొక్క జన్యు శ్రేణికి అనుగుణంగా ఉండే ఆర్‌ ఆర్‌ఎన్‌ఎ యొక్క సింగిల్‌ స్టాండ్‌ అణువు.

                                                                        కృషి కొనసాగుతుంది....

పరిశోధన రంగంలో తన కృషి భవిష్యత్తులోనూ కొనసాగుతుందని కాటలిన్‌ కరికో చెప్పారు. నోబెల్‌ ప్రైజ్‌కు ఆమె పేరును ప్రతిపాదించిన సమయంలో ప్రముఖ పరిశోధనా జర్నల్‌ 'సైన్స్‌'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అనేక అంశాలను ప్రస్తావించారు. క్లుప్తంగా వాటి వివరాలు

ప్ర: చాలా సంవత్సరాలు గుర్తింపు లేకుండా పరిశోధనలు చేశారు. ఇప్పుడు ఎక్కడ చూసినా మీ పేరు వినిపిస్తోంది. దీనిని ఎలా భావిస్తున్నారు?
జ: ఇది పనిలో భాగం. సంక్లిష్టమైన విషయాలను కనుగొని కొత్త తరానికి స్ఫూర్తినివ్వాలి. ప్రజలను చైతన్య పరచాలి. ఇదే మా లక్ష్యం. గుర్తింపు గురించి, బహుమతుల గురించి నేను ఆలోచించను. అయితే, నేను వాటిని గౌరవిస్తాను. సైన్స్‌ను అభివృద్ధి చేయడం, ఆ దిశలో ప్రజలను చైతన్యం చేయడమే నాకు ముఖ్యం.

ప్ర: కొవిడ్‌ వ్యాక్సిన్లు విజయవంతమైనాయి. తరువాత ఏమి జరగబోతోంది ?
జ: కోవిడ్‌కు ముందు నుండే మోడెర్నా, బయోఎన్‌టిక్‌లు మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఎ ఇన్‌ప్లుయెంజా వ్యాక్సిన్‌పై పనిచేస్తున్నాయి. నిపాను నివారించే టీకా మీద కూడా కృషి చేస్తున్నాం. ఆసియాలో ఇది కీలక పాత్ర పోషించనుంది. ఇంకొన్ని వ్యాధులపై కూడా వ్యాక్సిన్‌లు రానున్నాయి. చౌకగా ఉండటం వ్యాక్సిన్‌ల ద్వారా లభించే ప్రయోజనం.

ప్ర: ఆర్‌ఎన్‌ఎ వ్యాక్సిన్‌లు వైరస్‌లమీదనే పనిచేస్తాయా ?
జ : బాక్టీరియా ద్వారా వచ్చే ఇన్‌ఫెక్షన్లమీద కూడా ఇవి సమర్ధవంతంగా పనిచేసే అవకాశం ఉంది. ఈ దిశలో పరిశోధనలు సాగుతున్నాయి. ప్రస్తుతం జంతువుల మీద ప్రయోగాలు జరుగుతున్నాయి. త్వరలోనే సానుకూల ఫలితాలు వస్తాయని భావిస్తున్నాం. మలేరియాను నియంత్రించడానికి ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌ ఉంది.

ప్ర: క్యాన్సర్‌పై పోరాటంలో ఆర్‌ఎన్‌ఎ వ్యాక్సిన్‌ల ప్రభావం ఎలా ఉంటుంది?
జ: పరిశోధనలు జరుగుతున్నాయి. బయోఎన్‌టెక్‌ చేసిన పరిశోధన ప్రకారం ట్యూమర్‌ ఆపరేషన్‌ చేసి తొలగించడానికి వీలుగా ఉన్న సందర్భంలో వ్యాక్సిన్‌ ప్రభావం చూపుతున్నట్లు తేలింది. ట్యూమర్‌ సైజు ఎక్కువ ఉన్న వారిలో పెద్దగా ప్రభావం చూపించలేదు. మరింతగా పరిశోధనలు జరగాల్సిఉంది. ఒక్కో ట్యూమర్‌ ఒకో రకమైన స్వభావాన్ని కలిగిఉంటుంది. రోగనిరోధక శక్తిపై ఇవి రకరకాల స్థాయిల్లో ప్రభావాన్ని చూపుతాయి. పరిశోధనల పూర్తి ఫలితం వస్తేకాని కచ్చితంగా చెప్పలేం. అయితే, ఇప్పుడు ఎంఆర్‌ఎన్‌ఎ పరిశోధనలకు పెద్ద ఎత్తున నిధులు అందుతున్నాయి. సానుకూల ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాను.