Nov 09,2023 09:50

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : అసైన్డ్‌ ఇళ్ల స్థలాలపై యాజమాన్య హక్కులు కల్పించడం ద్వారా పేదలకు భారీ లభ్ధి చేకూర్చనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుండగా, దానికి భిన్నంగా మార్గదర్శకాలు విడుదలయ్యాయి. రెవిన్యూ రికార్డు ప్రకారం ఇళ్ల స్థలం జలవనరులు (వాటర్‌ బాడీ) లో ఉంటే యాజమాన్య హక్కు నిరాకరించాలని పేర్కొన్నారు. దీంతో చెరువులు, వాగులు, వంకలు, కాలువ గట్లపై అసైన్డ్‌ పట్టా ద్వారా ఇళ్ల స్థలాలు పొందిన వారికి కొత్తగా ఎటువంటి హక్కు లభించదు. పైగా అదే సాకుతో వారిని ఖాళీ చేయించే అవకాశమూ ప్రభుత్వానికి దక్కనుంది. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో పేదలు కాలువగట్లు, చెరువు, పొరంబోకు స్థలాలో నివాసముంటున్న సంగతి తెలిసిందే. ఏళ్ల తరబడి సాగించిన పోరాటాల తరువాత ఈ తరహా స్థలాల్లో ఉంటున్న పేదలకు అప్పటి ప్రభుత్వాలు అసైన్డ్‌ పట్టాలు ఇచ్చాయి. పది సంవత్సరాల నుండి అసైన్డ్‌ స్థలాల్లో నివాసముండే వారికి వాటిపై యాజమాన్య హక్కులను కల్పిస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఆ పని చేయకుండా ఇళ్లస్థలాల స్వభావాన్ని గుర్తించాలని విఆర్‌ఓలను ఆదేశించింది. రెవిన్యూ రికార్డుల ప్రకారం ఆ స్థలం జలవనరుల కి కిందకు వస్తుందా రాదో పరిశీలించాలని నిర్ధేశించింది. జలవనరుల్లో ఉన్న స్థలాలు మినహామిగిలిన వాటికి యాజమాన్య హక్కులను కల్పించాలని కలెక్టర్లను ఆదేశించింది. దీంతో ప్రభుత్వ చర్యలోని అసలు ఉద్దేశ్యం ఏమిటన్నది ప్రశ్నార్ధకంగా మారింది.
 

                                                                         నిర్ధారణ ఎలా...?

అసైన్డ్‌ స్థల స్వభావాన్ని నిర్ధారించేందుకు విఆర్‌ఓలు నూరుశాతం క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొంది. డికెటి, రిజిస్టర్లు, అసైన్‌మెంట్‌ కమిటీ రికార్డులు, ఇతర రెవిన్యూ రికార్డులను విఆర్‌ఓ క్షుణంగా పరిశీలించాలి. జలవనరుల స్థలాన్ని నివాసాలకు కేటాయించి ఉంటే, ఆ విషయాన్ని స్పష్టంగా పేర్కొంటూ నివేదిక తయారు చేయాలి. ప్రతి ఇంటికి సంబంధించిన పూర్తిస్థాయి రికార్డులను తహసిల్ధార్‌కు అప్పగించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. అదే విధంగా నివాస స్థలాన్ని ఏ సంవత్సరంలో కేటాయించారు? ఎవరికి కేటాయించారు? అసలైన లబ్దిదారులు ఆ స్థలంలో ఉంటున్నారా? ఆయన వారసులు ఉంటున్నారా? అన్న విషయాన్ని కూడా నిర్ధారించుకుని నివేదికలో విఆర్‌ఓలు పేర్కొనాలి. అనంతరం మండల తహసీల్దారు విఆర్‌ఓ తయారు చేసిన జాబితాను పరిశీలించాలి. అర్హత ఉన ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌లోని నిషేదిత ఆస్తుల జాబితా (సెక్షన్‌ 22ఎ) నుండి తొలగిస్తున్నట్లు గ్రామ/ వార్డు సచివాలయంలో నోటీసు బోర్డులో పెట్టాలి. ఏవైనా అభ్యంతరాలుంటే 7 రోజుల్లో తెలపాలని కోరాలి. అనంతరం ఆజాబితాను ఆర్‌డిఓ/ సబ్‌ కలెక్టర్‌కు పంపిస్తారు. ఆర్‌డిఓ కార్యాలయానికి చేరిన ఫైలును పరిశీలించిన అనంతరం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌కు పంపాల్సి ఉంటుంది. జాయింట్‌ కలెక్టర్‌ కూడా ఫైలును పరిశీలించిన అనంతరం డ్రాప్ట్‌ పబ్లికేషన్‌ కోసం జిల్లా కలెక్టర్‌కు నివేదిక పంపుతారు. తుది పరిశీలన అనంతరం జిల్లా గెజిట్‌ను కలెక్టర్‌ విడుదల చేస్తారు.