
ఇప్పుడు ఏ సరుకు కొన్నా దాని చుట్టూ ఓ ప్యాకింగు ఉంటుంది. షాపు నుంచి ఇంటికి చేరేవరకే దాని అవసరం ఉంటుంది. ఆ తరువాత అది నిరుపయోగ వస్తువుగా చెత్తబుట్టలోకి చేరుతుంది. ఇలాంటి చెత్త ఏ ఊరిలో చూసినా అంతకంతకు పెరిగిపోయి, పర్యావరణానికి అనేక రూపాల్లో నష్టం తెస్తోంది. మరి అలాంటి వ్యర్థ పదార్థాల్లోంచి ఉపయోగ వస్తువులను తయారు చేసి, పర్యావరణానికి హితం చేకూరుస్తోంది పార్వతీపురం మన్యం జిల్లాలోని పునర్వ్ స్వచ్ఛంద సేవాసంస్థ.

సరిగ్గా పాతికేళ్ల క్రితం వెనిగండ్ల పద్మజ గ్రూప్-1 ఉద్యోగి. ప్రజాసేవపై మక్కువతో ఉద్యోగాన్ని వదిలేసి, అప్పటికే నడుస్తున్న జట్టు సంస్థలో చేరారు. గిరిజన అనాథ పిల్లల ఆశ్రమం నిర్వహిస్తున్న స్వచ్చంద సేవకుడు డొల్లు పారినాయుడు నుంచి నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. అనాథ పిల్లలను సంరక్షించటం, చదివించటమే కాకుండా మంచి పౌరులుగా తీర్చిదిద్దే విధంగా అనేక చర్యలు చేపట్టారు. ప్రతి నెలా దాతల నుంచి వచ్చే ఆర్థిక సహాయం కోసం ఎదురు చూడకుండా ఆశ్రమానికి స్వయం సమృద్ధిగా ఆదాయం పెంచుకోవాలనే దిశగా ఆలోచించారు. మిత్రురాలు రజనీ దంపతుల సహకారంతో ఆశ్రమంలోని బాలబాలికలకు సాధారణ విద్యతోపాటు భారతీయ నాట్య రీతుల్లో శిక్షణ ఇప్పించారు. ఇంకా సంగీతం, చిత్రలేఖనం, కర్రసాము, మార్షల్ ఆర్ట్స్ నేర్పించి వారి చేత రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల్లో ప్రదర్శనలు ఇప్పించారు. దేశ విదేశాల్లో ప్రఖ్యాతి గాంచిన నాట్య కళాకారులను జట్టు ఆశ్రమానికి ఆహ్వానించి వారిచే ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఇలా ఇక్కడ ఆశ్రయం పొందిన పలువురు బాలల నేడు వివిధ వృత్తులు, ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. వారంతా కూడా పద్మజకు అండగా ఉంటున్నారు. ఈ క్రమంలో పర్యావరణవేత్త శరవరణ్ రాజగోపాలన్ సహకారంతో రూపుదిద్దుకున్న సంస్థే 'పునర్వ్'.
ఆర్గానిక్ పంటలతో ఆదాయం
అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని సేంద్రియ పద్ధతుల్లో కూరగాయలు, పండ్లు సాగుచేశారు. అమ్మ పచ్చళ్లు పేరిట తయారీ యూనిట్‌ను స్థాపించి రసాయనాలు లేని, నిల్వవుండే తాజా పచ్చళ్లు అమ్మకాలు ప్రారంభించారు. ఈ విధంగా ఆశ్రమానికి ఆర్థిక వనరులు మెరుగుపర్చారు. ''పర్యావరణ పరిరక్షణకు చెట్లను నాటడంతోనే సరిపోదు. రైతులు రసాయనాలు ఉపయోగించుకోకుండా వ్యవసాయం చేయాలి. తద్వారా సాగు ఖర్చులు తగ్గించుకోవొచ్చు. భూసారాన్ని పరిరక్షించుకోవచ్చు. జీవం ఉన్న పంటలు పండించుకోవచ్చు.'' ఇలా పార్వతీపురం పరిసర ప్రాంతాల్లోని రైతులకు అవగాహన కల్పించారు. పార్వతీపురం మండలంలోని తాళ్ళబురిడి, ములగ; కొమరాడ మండలంలోని కుమ్మరిగుంట గ్రామాల్లో పలువురు రైతులు ఎరువులు, పురుగుమందులు వాడకుండా పశువుల పెంట, పంట వ్యర్థాలతో ఎరువులను తయారు చేయిస్తూ సహజ సిద్ధమైన వ్యవసాయం చేయిస్తున్నారు. వారి ఉత్పత్తులకు మంచి డిమాండు లభిస్తోంది.

వ్యర్థాలకు సరికొత్తగా అర్థాలు
నేడు అన్నిచోట్లా విపరీతమైన చెత్త పేరుకుపోయి, ఎక్కడ చూసినా కలుషిత వాతావరణం ఏర్పడుతోంది. ఈ పరిస్థితిని అధిగమించాలంటే పరిసరాల్లో ఉన్న వ్యర్థాలను తడి- పొడిచెత్తగా సేకరించి వాటిని ఉపయోగించుకోవటం ద్వారా ఎరువులు, రీ సైక్లింగ్ ముడిసరుకుగా మార్చుకోవచ్చని పద్మజ భావించారు. చెత్తను విభజించి, పునరుత్పాదక పదార్థాలుగా మార్చి వాటికి ఒక అర్థం కల్పిస్తున్నారు. చెత్త నుంచి సంపద ఉపయోగించుకోవటం తెలియాలి గానీ ప్రపంచంలో వ్యర్థ పదార్థం అనేదే లేదంటూ ఇక్కడి చెత్త నుంచి సంపద కేంద్రం నిరూపిస్తోంది. కొద్దిపాటి యంత్రాలను ఉపయోగించి వ్యర్థాలతో కొత్త ఉత్పత్తులకు సరికొత్త రూపాన్ని సృష్టిస్తున్నారు. పార్వతీపురం పట్టణంతోపాటు పలు గ్రామాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తమ ఆశ్రమానికి అందించిన వ్యర్థ పదార్థాలతో గాజు పెంకులు, అద్దం ముక్కలు, వాడేసిన గాజుసీసాలను గ్రైండింగ్ చేసి, ముదుగు అద్దాలను తయారు చేసి పరిశ్రమలకు ముడి సరుకుగా అందిస్తున్నారు.
వాడిపారేసిన ప్లాస్టిక్ కవర్లను, పేపర్లను సేకరించి వాటిని బేళ్లుగా తయారుచేసి రీ సైక్లింగ్ చేసే ప్లాస్టిక్ పరిశ్రమలకు అందజేస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలకు కాస్త సిమెంట్ జత చేసి ప్లోరింగ్‌లకు ఉపయోగించే ఇటుకలను తయారు చేస్తున్నారు. వాటితోనే పూలకుండీలను తయారుచేసి అందులో వివిధ మొక్కలను పెంచుతున్నారు. వాటిని చెత్తను తీసుకొచ్చి ఆశ్రమానికి అందిస్తున్న దాతలకు బహుమతులుగా అందిస్తున్నారు. ఇలా వ్యర్థ పదార్థాలను అర్థవంతంగా మార్చి, చెత్త సముదాయాల్లోంచి అందాన్ని, ఆదాయాన్ని సృష్టిస్తున్నారు పద్మజ. ఆమె కృషి అభినందనీయం.
- నాగు కాకిముక్కల
ప్రజాశక్తి, పార్వతీపురం రూరల్
94400 81649

మరింత సహాయం కావాలి
పునర్వ్ సంస్థ ద్వారా పర్యావరణ పరిరక్షణకు మా వంతుగా శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నాం. ఈ ప్రయత్నానికి ప్రభుత్వం నుంచి, దాతల నుంచి సహాయం కోరుతున్నాం. పార్వతీపురం పట్టణంలో గుట్టలుగా పడి ఉన్న చెత్త సమస్యను మేము అవలీలగా పరిష్కరించగలమనే నమ్మకం నాకుంది. ఇప్పటికే చెత్తను నిర్మూలించే కృషిని పెద్దఎత్తున చేపట్టాం. మరింత సహాయం అందితే ఆ కృషిని మరింత విస్తృతంగా, మరింత వేగంగా చేయగలం.
- వెనిగండ్ల పద్మజ
పునర్వ్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకురాలు