ఖాట్మండు : నేపాల్‌లో జనవరి 15న అత్యంత ఘోర విమాన ప్రమాదంలో 72 మంది మృతి చెందిన విషయం విదితమే. కాగా, ఈ 72 మృత దేహాల్లో 68 మృత దేహాలను ఆ ఘటన జరిగిన (ఆదివారం) రోజునే రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. ఆ తర్వాతిరోజు మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. తాజాగా బుధవారం మరో మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. దీంతో మృతదేహాల సంఖ్య 71కి చేరింది. మరో మృతదేహాం కోసం రెస్క్యూ సిబ్బంది ప్రమాదం జరిగిన ప్రాంతాన్నంతా గాలిస్తున్నారని నేపాల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
కాగా, ఆదివారం రోజు యతి ఎయిర్‌లైన్స్ విమానం పోఖారా నగరంలో కొత్తగా తెరిచిన విమానాశ్రయంలో మరో ఐదు నిమిషాల్లో ల్యాండ్ అవబోతుండగా నది లోయలో కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో విమానంలోని రెండు బ్లాక్ బాక్స్‌లను నేపాల్ పౌర విమానయాన సంస్థకి అందజేసినట్లు యతి ఎయిర్‌లైన్స్ ప్రతినిధి సుదర్శన్ బర్తాలా వెల్లడించారు.










