
రాష్ట్రంలోని ప్రధాన నదులైన గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార, నాగావళి నదుల ద్వారా 1554 టిఎంసీల నీరు మన రాష్ట్రానికి లభ్యమవుతుంది. ఇవి కాకుండా వర్షాధార అదనపు జలాలు 776.715 టిఎంసీలు, భూగర్భ జలంగా మారే నీరు 355.000 టిఎంసీలు అందుబాటులో ఉన్నాయి. ఈ మొత్తం నీటిని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి వినియోగించే పద్ధతిలో సక్రమంగా పంపిణీ చేసి, ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల సామర్ధ్యాన్ని పెంచడానికి, అవసరమైన కొత్త ప్రాజెక్టులను నిర్మించడానికి ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాలి. కాని గత పది సంవత్సరాల అనుభవం చూస్తే ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ పట్ల పాలకులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
అన్నపూర్ణగా కీర్తించబడిన ఆంధ్రప్రదేశ్ నేడు 'అన్నమో రామచంద్రా...' అనే పరిస్థితికి చేరుతున్నది. వర్షాభావం వల్ల ఈ సంవత్సరం రాష్ట్రంలో సుమారు 31 లక్షల ఎకరాల్లో విత్తనం వేయలేదు. సాగునీటి ప్రాజెక్టులు నీటి కళ తప్పి వెలవెల పోతున్నాయి. రాష్ట్రంలోని అనేక ప్రాజెక్టుల కింద ఈ సంవత్సరం సాగు ప్రశ్నార్థకంగా మారింది. వరి లాంటి పంటలు కాకుండా ఆరుతడి పంటలు వేసుకొమ్మని నీటిపారుదల అధికారులు జిల్లాల్లో ప్రకటిస్తున్నారు. ఈ పరిస్థితులకు ప్రకృతి కారణమంటూ పాలకులు చేతులు దులుపుకుంటున్నారు. 'ఇన్నాళ్ళు వానదేవుడు మా వాడు అని చెప్పారు కదా....ఇప్పుడు ఏమయ్యాడ'ంటూ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రజలు వారి జీవన పరిస్థితులు కాకుండా తక్షణం ఎన్నికల్లో గెలవడానికి ఏ విల్లంబులు ఎక్కుపెట్టాలో పాలక, ప్రతిపక్ష పార్టీలు సిద్ధం చేసుకుంటున్నాయి. అత్యధిక మందికి ఉపాధిని చూపే వ్యవసాయం, భవిష్యత్ తరాలకు భద్రతను ఇచ్చే పరిశ్రమల గురించి కాకుండా అవినీతి, జైళ్లు, బెయిళ్ల చుట్టూ రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయి.
పునర్విభజన అనంతరం 13 జిల్లాలు 1,62,970 చ.కి.మీ భౌగోళిక విస్తీర్ణంతో 974 కిలోమీటర్ల పొడవుతో దేశంలోనే రెండవ అతి పెద్ద తీర రేఖ కలిగి దేశంలో 8వ అతి పెద్ద రాష్ట్రంగా మన రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రంలోని ప్రధాన నదులైన గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార, నాగావళి నదుల ద్వారా 1554 టిఎంసీల నీరు మన రాష్ట్రానికి లభ్యమవుతుంది. ఇవి కాకుండా వర్షాధార అదనపు జలాలు 776.715 టిఎంసీలు, భూగర్భ జలంగా మారే నీరు 355.000 టిఎంసీలు అందుబాటులో ఉన్నాయి. ఈ మొత్తం నీటిని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి వినియోగించే పద్ధతిలో సక్రమంగా పంపిణీ చేసి, ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల సామర్ధ్యాన్ని పెంచడానికి, అవసరమైన కొత్త ప్రాజెక్టులను నిర్మించడానికి ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాలి. కాని గత పది సంవత్సరాల అనుభవం చూస్తే ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ పట్ల పాలకులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుత సాగునీటి వనరులు-సాగు విస్తీర్ణం
మన రాష్ట్రంలో గోదావరి 784.000 టిఎంసీలు, కృష్ణా 609.000, పెన్నా 93.000, వంశధార 46.000, నాగవళి ద్వారా 22.000 టిఎంసీల నీరు ఈ 5 ప్రధాన నదుల నుండి మొత్తం 1554 టిఎంసీల నీరు మనకు అందుబాటులో ఉంది. ఈ నీటిలో ఉమ్మడి 13 జిల్లాల్లో కలిపి 1476.109 టిఎంసీల నీటిని నిలుపుకునే సామర్థ్యం కలిగిన ఏర్పాట్లు ఉన్నాయి. ఇంకో 78 టిఎంసీల నికర జలాలను నిల్వ చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకోవాలి. ఇవి కాకుండా వర్షాధార అదనపు జలాలు, భూగర్భ జలాలు ఉన్నాయి. 13 జిల్లాల్లో వినియోగించ వీలున్న వర్షపు జలాలు సుమారు 776.715 టిఎంసీలు అందుబాటులో ఉండగా, ఇప్పటికీ వినియోగిస్తున్నది మాత్రం 278.751 టిఎంసీలు మాత్రమే. అంటే ఇంకా 497.964 టిఎంసీల నీరు వినియోగించుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంది. అలాగే రాష్ట్రంలో 7,76,517 బోరుబావులు ఉన్నాయి. భూగర్భ జలంగా మారే నీరు 355.000 టిఎంసీలు, వినియోగిస్తున్నది మాత్రం 245.000 టిఎంసీలు. అందుబాటులో ఉన్న ఈ నీటి అవకాశాలను సంపూర్తిగా వినియోగించుకునేందుకు చర్యలు చేపట్టడం ద్వారానే రాష్ట్ర సమగ్రావృద్ధి సాధ్యమవుతుంది.
ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయ సాగుకు అనువైన భూమి 2,11,84,787 ఎకరాలు. అందులో ప్రస్తుతం సాగు అవుతున్నది 1,49,44,910 ఎకరాలు. రాష్ట్రంలో పూర్తయిన భారీ ప్రాజెక్టుల ద్వారా 50,76,074 ఎకరాలకు, మధ్యతరహా ప్రాజెక్టుల ద్వారా 6,09,288 ఎకరాలకు, చిన్న తరహా ప్రాజెక్టుల ద్వారా 26,14,250 ఎకరాలకు మొత్తం 82,99,612 ఎకరాలకు సాగు నీరు అందుతుంది. అయితే చిన్న తరహా ప్రాజెక్టులు అనగా చెరువులు, కుంటల కింద సాగు నీరు నికరంగా ఉండదు. అందువల్ల నికర సాగు ప్రభుత్వ లెక్కల కంటే వాస్తవ సాగులో తక్కువగా ఉంటుంది. ఏమైనప్పటికీ అధికారిక లెక్కల ప్రకారం చూసినా రాష్ట్రంలోని మొత్తం సాగు భూమిలో 55.5 శాతం సాగు భూమికి మాత్రమే సాగు నీరు అందుతుంది. ఇందులో రాయలసీమ పరిస్థితి మరింత దారుణంగా ఉంది.
కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార నదుల ద్వారా మన రాష్ట్రం వినియోగించుకోవడానికి వీలున్న నికర జలాలు (75 శాతం ఆధారంగా) 1554 టిఎంసీలు. ఇందులో నిర్మాణం పూర్తయిన భారీ ప్రాజెక్టుల ద్వారా 821.523 టిఎంసీలు, మధ్య తరహా ప్రాజెక్టుల ద్వారా 58.116, చిన్న తరహా ప్రాజెక్టుల ద్వారా 267.280 టిఎంసీలు మొత్తం 1146.871 టిఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకోగలుగుతున్నాము. అనగా ఇంకో 407 టిఎంసీల నికర జలాలను ఏ ఆటంకాలు లేకుండా వినియోగించు కునేందుకు అవకాశం ఉంది. దానికి అవసరమైన కొత్త ప్రాజెక్టుల నిర్మాణం, ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల సామర్ధ్యం పెంచితే అదనంగా కనీసం 40 లక్షల ఎకరాలకు ఆరుతడి పంటలకు సాగునీరు అందించవచ్చు.
పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు
2014-15 నుండి 2018-19 సంవత్సరాల మధ్య కాలంలో 56 సాగునీటి ప్రాజెక్టులకు (పోలవరంతో కలిపి) రూ.80,792 కోట్లు కేటాయించి రూ.56,894 కోట్లు ఖర్చు చేశారు. అయితే వీటిలో ఏ ఒక్క ప్రాజెక్టూ పూర్తికాలేదు. ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులను ఎంపిక చేసుకొని దశలవారీగా పూర్తిచేయాలని చాలా కాలంగా సిపిఎం, అలాగే నీటి రంగ నిపుణులు సూచిస్తున్నారు. అయితే ప్రభుత్వాలు వాటిని ఖాతరు చేయకుండా అన్ని ప్రాజెక్టులను ఆర్భాటంగా ప్రారంభించడం, మొబలైజేషన్ అడ్వాన్స్ పేరుతో కాంట్రాక్టర్లకు వందల కోట్లు ఇవ్వడం, అందులో పాలక పార్టీలు కమీషన్లు తీసుకోవడం జరుగుతున్నది. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నూతనంగా 37 ప్రాజెక్టులను ఒకేసారి ప్రారంభించి 4 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని ప్రకటించింది. వాస్తవంగా గత 56 ప్రాజెక్టులకు, ఇప్పుడు ప్రకటించిన 37 ప్రాజెక్టులకు కలిపి రూ.1,44,262 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. అంత ఖర్చు చేసి ప్రాజెక్టులను ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో పూర్తిచేయడం ఎలా సాధ్యమవుతుంది? అసంపూర్తిగా వున్న లేదా నిర్మాణంలో వున్న ప్రాజెక్టులు పూర్తయితే భారీ ప్రాజెక్టుల ద్వారా 580.692 టిఎంసీల నీటితో 50,95,394 ఎకరాలు, మధ్యతరహా ప్రాజెక్టుల ద్వారా 25.111 టిఎంసీల నీటితో 2,82,238 ఎకరాలు, చిన్నతరహా ప్రాజెక్టుల ద్వారా 3.742 టిఎంసీల నీటితో 58,052 ఎకరాలు మొత్తం 54,35,684 ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలి.
నిర్మాణ ఆలస్యం వల్ల పెరుగుతున్న ఖర్చులు
ప్రకటించిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయకపోవడంవల్ల ప్రారంభ అంచనాలకు నేటికి 409.9 శాతం ఖర్చు పెరిగింది. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 9 ప్రధాన ప్రాజెక్టుల ప్రారంభ అంచనాలు, ఇప్పటి వరకు చేసిన ఖర్చులు, వీటని పూర్తి చేయడానికి అవసరమైన అంచనాల వివరాలు పరిశీలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాజెక్టుల పరిస్థితులపై 31-03-2019న సమీక్షించారు. ఆ సమీక్ష నివేదికల ప్రకారం తెలుగు గంగ, గాలేరు, నగరి, హంద్రీ-నీవా, శ్రీశైలం కుడికాలువ, పూల సుబ్బయ్య వెలిగొండ, గుండ్లకమ్మ, వంశధార-2 (1,2), తోటపల్లి బ్యారేజి, చింతలపూడి లిఫ్ట్‌లకు కలిపి ప్రారంభ అంచనాల మొత్తం రూ.13,614 కోట్లు. 31-03-2019 నాటికి ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి పెరిగిన అంచనా మొత్తం రూ.47,673 కోట్లు. ఇదే తేదీ నాటికి ఖర్చు చేసిన మొత్తం రూ.36,597 కోట్లు. ఈ ప్రాజెక్టులను 2023 చివరి నాటికి పూర్తి చేయడానికి అయ్యే అంచనా ఖర్చు రూ.19,208 కోట్లు. ఈ లెక్కన సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేసివుంటే అదనంగా మరో 30 ప్రాజెక్టులను నిర్మించి వుండవచ్చు.
నిధుల కేటాయింపులు-ఖర్చులు
ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాల అనుభవం చూస్తే ప్రకటనలకు, కేటాయింపులకు, వాస్తవ ఖర్చులకు పొంతన లేదు. 2014 నుండి 2019 వరకు తెలుగుదేశం పార్టీ పాలనా కాలంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రాష్ట్ర బడ్జెట్లో కేటాయించింది రూ.80,792 కోట్లు, ఖర్చు పెట్టింది రూ.56,894 కోట్లు. 2019 నుండి 2023 వరకు వైసిపి పాలనలో కేటాయించింది రూ.61,573.15 కోట్లు, ఖర్చు చేసింది రూ.32,059.61. ఈ లెక్కన ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి కావాలంటే ఎన్ని దశాబ్దాలు పడుతుందో? అందరూ శాఖాహారులే కోడి మాయమైందన్నట్లు పాలక, ప్రతిపక్ష పార్టీలు వెనుకబడిన ప్రాంతాల గురించి, వ్యవసాయాభివృద్ధి గురించి మాట్లాడేవారే కాని... సాగునీటి వనరులు కల్పించకుండా వ్యవసాయం, వెనుకబడిన ప్రాంతాలు ఎలా అభివృద్ధి అవుతాయి ?
/ వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు/
వి. రాంభూపాల్