
దునియాని మార్చేదానికి
దేవుడెందుకబ్బా..!
ఒక్క మనిషినివ్వండి చాలు
మానవత్వం మినహా
మరే క్వాలిఫికేషన్ ఉండటానికి వీల్లేదు
బతుకు తరగతి గదులు
ఒక్కొక్కటీ దాటుకొస్తున్నా
స్వార్థం సిలబస్ తెలియని
ఒక్క మనిషి చాలు
పురాణాలు జీవ నదులైతే ఏంటి
పురుగుల తట్టయితే ఏంటి
పులుకడిగిన ముత్యంలాంటి
మనిషొకడు కావాలిప్పుడు !
పొరుగువాణ్ణి ప్రేమించడానికి
ఇతిహాసాల్ని ఎత్తుకు తిరగాలా!?
స్పందించాలే గానీ
మనసే మందిరమని చూపగలిగేవాడు
గాలికీ కాలానికీ ముడివేసి
ఒకే కొమ్మకి నవ్వులూ పువ్వులూ
పూయించగలిగేవాడు
తల్లడిల్లే మనసుకీ
చెమ్మగిల్లే కంటికీ
ఓదార్పునిచ్చే గుణం గలవాడు
ఎవడైనా పర్లేదు
ఒక్క మనిషినివ్వండి చాలు !
దేవుడి గురించి
గొప్పగా చెప్పుకోటానికేముంది
మహా అయితే మనిషి చేసినవాడు
అసలు దేవుడితో పనిలేదు
మనిషి కావాలిప్పుడు
లోకం ఒట్టిపోయిన లొట్టిపిట్టలా వుంది
యుగాలుగా అదే నడక
ఒక్క నవ్వుతో వెయ్యి యుగాలు
దాటించగలవాడు
ఆడబిడ్డని ఒంటిసబ్బులా కాక
కంటిపాపలా చూడగలవాడు
అవసరమైతే నిన్నూ నన్నే కాదు
తనను తాను కడిగి ఆరెయ్యగలిగేవాడు
ఒక్కడు చాలు !
- బంగార్రాజు కంఠ
85003 50464