
మెరిట్‌తో పనేంటి? మనీ ఉంటే చాలంటోంది కేంద్ర ప్రభుత్వం. దేశంలో వైద్య విద్య పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (ఎన్‌ఇఇటి-నీట్) కటాఫ్ మార్కులను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇటీవల సున్నాకు తగ్గించేసింది. దీనినే జీరో పర్సంటైల్ కటాఫ్ అంటున్నారు. ఇందుకు సంబంధించి మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసిసి) ఈ నెల 20న ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. జీరో పర్సంట్ కటాఫ్ అంటే నీట్ పిజి పరీక్షలో మైనస్ 40 మార్కులు వచ్చిన అభ్యర్థి కూడా ట్యూషన్ ఫీజు చెల్లించి ప్రయివేటు వైద్య కళాశాలలో విద్యార్థిగా చేరిపోయి..వైద్య వృత్తిలోకి ప్రవేశం పొందవచ్చు. ట్యూషన్ ఫీజుగా కోట్ల రూపాయలు కుమ్మరించేవారికే సీటు దక్కుతుంది. అంటే వైద్య విద్యను గంపగుత్తగా కోటీశ్వరులకు రిజర్వ్ చేయడమే. సున్నా మార్కులు వచ్చినా సీటు ఇచ్చేస్తే ప్రవేశ పరీక్షలను, ప్రతిభావంతులైన విద్యార్థులను అవమానించడం కాదా? ఇది వైద్య విద్యను పూర్తిగా వ్యాపారమయం చేయడం కాదా? అంటూ వైద్య విద్యార్థులు, వైద్యులతో పాటు వైద్యారోగ్య రంగానికి సంబంధించిన సమస్త భాగస్వామ్య పక్షాలు సంధిస్తున్న ప్రశ్నాస్త్రాలకు కేంద్రం నుంచి బదులు రావడం లేదు. బడుగు, బలహీన తరగతులకు రిజర్వేషన్లను పటిష్టంగా అమల్జేయాలంటూ ఉద్యమిస్తే.. ఆధిపత్య సామాజిక తరగతులకు చెందిన కొందరు పాలకపక్ష నేతలు, కార్పొరేట్ అనుకూల మేధావులు అక్కసు వెళ్లగక్కేదేమిటి? 'ఉన్నత విద్యల్లో రిజర్వేషన్లు ఏంటండి? మెరికల్లాంటి ప్రతిభావంతులైన విద్యార్థులకే ప్రవేశాలు కల్పించాలి. అప్పుడే మేధో సమాజం తయారవుతుంది' అంటూ గొంతు చించుకునే వాదనలు పదేపదే వింటుంటాం. ఆ అపర మేధావులెవ్వరూ ఇప్పడు నోరు మెదపడం లేదు. మోడీ సర్కార్ నిర్ణయం ఎవరి ప్రయోజనాల కోసమో వీరి మౌనమే తేల్చిపారేస్తోంది.
వైద్య విద్యను వ్యాపారంగా మార్చేసి పేదలను ఉన్నత చదువులకు దూరం చేసే నయవంచక విధానాల పరంపరే మోడీ సర్కార్ తాజా ఎత్తుగడ. ప్రయివేటు వైద్య విద్యా కళాశాలల్లో ప్రవేశాలను ఇష్టారాజ్యం చేసిన కేంద్రం తాజా నిర్ణయంతో మరింత దోపిడికి లాకులు ఎత్తింది. నిర్దిష్ట కటాఫ్ విధించకుండా కౌన్సిలింగ్‌కు అనుమతిస్తే దేశంలో వైద్య విద్య కోటీశ్వరులకే పరిమితమై పేద, మధ్య తరగతి ప్రజలకు పూర్తిగా దూరమైపోవడం ఖాయం. ఇదే జరిగితే దాని ప్రభావం ప్రజారోగ్యంపైనా పడుతుంది. ఆరోగ్య సంరక్షణ రంగంలో నాణ్యతా ప్రమాణాలు పడిపోతాయి. వైద్య విద్య పిజి కోర్సులకు రూ.కోట్లాది సొమ్ము ధారపోస్తే ఆ సొమ్మునంతా తిరిగి ప్రజల నుంచే పిండుకుండారు. దేశ వైద్యారోగ్య రంగాన్ని మోడీ సర్కార్ తీసుకున్న ఇలాంటి వినాశకర విధానాలు నిర్వీర్యం చేస్తాయి.
వైద్య విద్యలో ఎంబిబిఎస్ తర్వాత పిజి కోర్సులకు నీట్ తప్పనిసరి. నీట్‌లో అర్హత సాధించడం ఆషామాషీ కాదు. ప్రత్యేక శిక్షణ కేంద్రాల్లో రూ.లక్షలు ధారపోసి నిద్రాహారాలు మాని అహర్నిశలు అకుంఠిత దీక్షతో ప్రయత్నిస్తే కానీ ఉత్తీర్ణత సాధించడం కష్టం. హిందీ, ఆంగ్ల మాధ్యమాల్లోనే నిర్వహిస్తుండటంతో దక్షిణాది ప్రాంత విద్యార్థులకు అన్యాయం జరుగుతోందంటూ తమిళనాడు తదితర రాష్ట్రాల పోరాటం కూడా ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. మరోవైపు విదేశాల్లో గ్రాడ్యుయేషన్ చేసినవారి కోసం నీట్ తరహాలోనే ఎఫ్‌ఎంజిఇ రాయడం తప్పనిసరి. దేశంలో వైద్య వృత్తిని చేపట్టాలన్నా, పిజి కోర్సుల్లో ప్రవేశించాలన్నా విదేశీ గ్రాడ్యుయేషన్ పొందినవారికి ఎంఎఫ్‌జిఇలో 50 శాతం కటాఫ్ మార్కులు తప్పనిసరి. ప్రతి యేటా ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తున్నవారి సంఖ్య తగ్గిపోతోంది. కేవలం 10 శాతం మాత్రమే గట్టెక్కుతున్నారు. నీట్ కటాఫ్‌ను జీరో పర్సంటైల్ చేయడం అంతే సమానమైన ఎఫ్‌ఎంజిఇకి 50 శాతం కటాఫ్ కొనసాగించడం అక్షరాలా వివక్షాపూరితమనే వాదన కూడా వినిపిస్తోంది. వినాశకర సంస్కరణల విషయంలో మోడీ సర్కార్‌ను అనుసరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా వైద్య విద్య కోర్సుల్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్‌కు సీట్లను రిజర్వు చేసి పేద విద్యార్థుల ఆశలపై నీళ్లు కుమ్మరించింది. వైద్య విద్యా రంగాన్ని పూర్తిగా గందరగోళంలోకి నెట్టేసి కార్పొరేట్ వైద్య విద్యా సంస్థల దోపిడికి ఊడిగం చేసే ఇలాంటి వినాశకర విధానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే వెనక్కి తీసుకోవాలి.