
6 నుంచి 12 తరగతులకు సిలబస్ రూపకల్పన
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :విద్యను కాషాయీకరించే చర్యలను మోడీ ప్రభుత్వం మరింత ముమ్మరం చేసింది. 6వ తరగతి నుంచి 12 వ తరగతి వరకు సామాజిక శాస్త్రాల సిలబస్‌పై అది దృష్టి సారించింది. తాను నిర్దేశించిన విధంగా సిలబస్‌లో మార్పులు చేర్పులు చేసేందుకు జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సిఇఆర్‌టి) ద్వారా 35 మందితో ఒక కమిటీని బుధవారం ఏర్పాటు చేసింది. ఇప్పటికే పాఠ్యపుస్తకాల్లో ఇండియా పేరుకు బదులు భారత్ అని మాత్రమే ఉపయోగించాలని ఎన్‌సిఇఆర్‌టి ఆదేశించింది.. చరిత్ర, భూగోళశాస్త్రం, రాజకీయ శాస్త్రం, సామాజిక శాస్త్రం, మనస్తత్వశాస్త్రం సిలబస్, టీచింగ్-లెర్నింగ్ మెటీరియల్‌ను అభివృద్ధి చేయడానికి 19 మందితో మరో కమిటీని ఏర్పాటు చేసింది. నేషనల్ సిలబస్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కమిటీ (ఎన్‌ఎస్‌టిసి) పేరుతో ఏర్పడిన ఈ కమిటీ జాతీయ విద్యా విధానం (ఎన్‌ఇపి) -2020కి అనుగుణంగా తగు చర్యలు తీసుకుంటుంది. ఈ రెండు కమిటీలకు కొనసాగింపుగా ఐఐటి గాంధీనగర్ విజిటింగ్ ప్రొఫెసర్ మిచెల్ డానినో అధ్యక్షతన కరిక్యులర్ ఏరియా గ్రూప్ (సిఎజి)నొకదానిని ఏర్పాటు చేసింది. ఎన్‌ఎస్‌టిసి వివిధ సబ్జెక్ట్ డొమైన్‌లలో కనీసం 11 సిఎజిలను ఏర్పాటు చేయాలని భావించింది. ఈ మేరకు ఎన్‌సిఇఆర్‌టి ఒక నోటిఫికేషన్ జారీ చేసింది.
కమిటీలోని ఇతర సభ్యుల్లో భారత ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్, అస్సాంలోని కోక్రాఝర్ ప్రభుత్వ కళాశాల చరిత్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ బనబీన బ్రహ్మ, చెన్నైలోని సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ ఛైర్మన్ ఎమ్‌డి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. 'ఎన్‌ఎస్‌టిసి, ఎన్‌సిఇఆర్‌టికి ఉపాధ్యాయుల కోసం హ్యాండ్‌బుక్‌లను వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నాటికల్లా తయారు చేయాలని ఆదేశించింది.