Nov 05,2023 09:49

పార్వతీపురం బాలికల ఉన్నత పాఠశాలకు తెలుగు ఉపాధ్యాయురాలు శారద బదిలీ మీద వచ్చారు. మొదటి రోజు ఏడవ తరగతి గదికి వచ్చారు. అందరి పేర్లు అడిగి తెలుసుకున్నారు. 'ముందర బెంచీలలో ఖాళీ స్థలం ఉంది. మీరిద్దరూ వెనక బెంచీలో ఎందుకు కూర్చున్నారు?' అని వెనక బెంచీలో కూర్చొన్న సీత, గిరిజలను అడిగారు. 'టీచర్‌! సీత అమ్మానాన్నలు పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు. దాంతో సీతను ఎవరూ ముందు బెంచీలలో కూర్చోన్వివడం లేదు. తను నా స్నేహితురాలు. అందుకే తనకు తోడుగా నేను కూర్చుంటున్నాను' అని చెప్పింది గిరిజ.
       'పిల్లలూ తరగతి గదిలో అందరూ సమానులే. పారిశుధ్య కార్మికులు అయినంత మాత్రాన సీత అంటరానిది అవుతుందా?' అన్నారు శారద టీచర్‌. 'నేనూ అదే చెప్పాను టీచర్‌!' అంది గిరిజ. 'సీత తల్లిదండ్రులు చేసే పని ఎంతో గౌరవప్రదమైనది. కరోనా సమయంలో డాక్టర్లు, నర్సులు, పోలీసులతో పాటు మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికులు ఎంతో బాధ్యతగా వ్యహరించారు. వారి ప్రాణాలను పణంగా పెట్టారు. ఇది మీకు తెలియంది కాదు' అన్నారు టీచర్‌.
        'టీచర్‌! సీత చదువులోనే కాదు వక్తృత్వ పోటీల్లో మన పాఠశాలలోనే కాకుండా ఇతర పాఠశాల వారు నిర్వహించిన వాటిలో కూడా ప్రథమ స్థానంలో ఎన్నో బహుమతులు గెలుచుకుంది' అని మాధవి అంది. 'మరి మన పాఠశాలకు ఇంత మంచి పేరు తెచ్చిన సీత పట్ల మీరు వ్యవహరించే తీరు బాగుందంటారా?' అన్నారు టీచర్‌.
       'తప్పయ్యింది టీచర్‌' అన్నారు పిల్లలంతా. 'పిల్లల భవిష్యత్తు తరగతి గదిలో తీర్చి దిద్దబడు తుంది. ఇక నుండి మీలో ఎవరూ కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, తల్లిదండ్రులు చేసే పనిని బట్టి విడిపోవద్దు. మీరంతా కలసిమెలసి ఉండాలి' అన్నారు టీచర్‌. ముందు బెంచీలో కూర్చున్న సరస్వతి, సీతను, గిరిజను తీసుకువచ్చి తన పక్కన కూర్చోబెట్టుకుంది. అందరూ చప్పట్లు కొట్టారు. పిల్లల్లో వచ్చిన మార్పుకు శారద టీచర్‌ ఎంతో సంతోషించారు. విశ్రాంతి గదిలోకి శారద టీచర్‌ రాగానే మిగతా ఉపాధ్యాయురాళ్లు, ఆమెను మెచ్చు కున్నారు. పిల్లలతో ఏదైనా చెబితే పెద్దలకు కోపం వస్తుందని భయపడి మేము ఈ విషయంలో జోక్యం చేసుకోలేదు. మీరు మాత్రం వారికి అర్థమయ్యేలా చెప్పారు' అన్నారు. 'ఎవరో ఒకరం పిల్లలకు తెలిసేలా చేయాలి. అదే నేను చేశాను' అన్నారు శారద టీచర్‌.
- యు.విజయశేఖర రెడ్డి,
99597 36475.