Oct 17,2023 10:31

చికాగో : ఇజ్రాయిల్‌-హమాస్‌ యుద్ధానికి ప్రతిస్పందనగా ఆరేళ్ల బాలుడిని పొడిచి చంపి, 32 ఏళ్ల మరో మహిళను తీవ్రంగా గాయపరిచిన వారి ఇంటి యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ''బాధితులు కేవలం ముస్లింలైనందుకే వారిని లక్ష్యంగా చేసుకున్నట్లు'' పోలీసులు నిర్ధారించారని విల్‌ కౌంటీ షరీష్‌ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. చికాగో శివారు ప్రాంతానికి చెందిన ఇంటి యజమాని, 71ఏళ్ల వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పెద్ద మిలటరీ స్టైల్‌ కత్తితో బాలుడిని 26 సార్లు పొడిచాడని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. గాయపడిన మహిళ శరీరంపై 12కిపైగా కత్తిపోట్లు వున్నాయి. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. శనివారం మధ్యాహ్నం వారిద్దరు ఇంట్లో పడివుండగా కనుగొన్నారు. నేరం చేసిన ఆ వృద్ధుడు ఆ ఇంటికి కాస్త దూరంలో కూర్చునివున్నాడని, నుదుటిపై గాయం కూడా వుందని పోలీసులు తెలిపారు. ఆ వృద్ధుడిపై ఫస్ట్‌ డిగ్రీ మర్డర్‌ అభియోగం, హత్యా ప్రయత్నం, విద్వేష నేరాలు వంటి అభియోగాలు మోపారు. అధికారులు మృతుడి పేరు వెల్లడించలేదు. బాధితుల కుటుంబం పత్రికా సమావేశంలో ఆ పాలస్తీనియన్‌ అమెరికన్‌ బాలుడి పేరు వెల్లడించింది.