
- ఎన్నికల వేళ సోదాలు, అరెస్టులు, వేధింపులు
కేంద్ర దర్యాప్తు సంస్థల స్వామిభక్తి ఎన్నికలు జరుగుతున్న మధ్యప్రదేశ్‌లో ఆ రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి మహేంద్ర సింగ్ సిసోడియా ఇటీవల ' బిజెపిలో చేరండి... లేకుంటే బుల్డోజర్ దాడికి సిద్ధంగా ఉండండి' అంటూ కాంగ్రెస్ నేతలకు హెచ్చరిక జారీ చేశారు. తెలంగాణలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న కర్నాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌ను తీహార్‌జైలుకు వెళ్లేందుకు సిద్దంగా ఉండాలంటూ ఆ రాష్ట్రానికే చెందిన ఎన్‌డిఎ భాగస్వామి హెచ్‌డి కుమారస్వామి హెచ్చరించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ త్వరలోనే జైలుకు వెళ్తారంటూ బిజెపి నేతలు బాహాటంగానే చెబుతున్నారు! కేంద్ర దర్యాప్తు సంస్థలైన సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టకరేట్ (ఇడి), ఆదాయపన్నుశాఖ (ఐటి)లు ఎలా వ్యవహరిస్తున్నాయో చెప్పడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే! న్యూఢిల్లీ : ఓ వైపు రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో నిమగమైఉంటే, మరోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇదే అదునుగా దాడులను ముమ్మరం చేస్తున్నాయి. దీనికోసం ప్రతిపక్ష నేతల వద్ద గతంలో పనిచేసిన వారిని నయానో, భయోనో ఒప్పించి వారిచేత తప్పుడు సాక్ష్యం చెప్పిస్తున్నారన్న ఆరోపణలూ వస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌పై చేసిన అవినీతి ఆరోపణ ఈ తరహాకు చెందినదే. బఘేల్‌కు రూ.508 కోట్లు ఇచ్చానంటూ ఓ వ్యక్తి చెప్పడంతో ఆయనపై దర్యాప్తు ప్రారంభమైంది. ప్రధానితో సహా బిజెపి నాయకులం దరూ దీనికి ఎన్నికల అంశంగా మార్చేశారు. గతంలో ఢిల్లీతో పాటు అనేక రాష్ట్రాల్లో ఈ తరహా సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో నే ఎన్నికలకు ఐదు రోజుల ముందు ఇడి ఐదు కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకుంది. బెట్టింగ్ యాప్ ద్వారా ఓ రాజకీయ పార్టీకి ఈ డబ్బు అందిందని ఆరోపించింది. తెలంగాణలో ఈ నెల 2న కాంగ్రెస్, బిఆర్‌ఎస్ నేతల ఇళ్లపై దాడులు చేశారు. ఎంత సొమ్ము స్వాధీనం చేసుకున్నదీ వెల్లడించలేదు. రాజస్థాన్‌లో జల జీవన్ మిషన్‌కు చెందిన 25 ప్రదేశాలపై ఈ నెల 3న ఇడి దాడి చేసింది. ఆ రాష్ట్రంలో ఒకే రోజు పిసిసి అధ్యక్షుడుతో పాటు ఇతర కాంగ్రెస్ నేతల నివాసాలపై ఇడి దాడులు చేసింది. వేర్వేరుకేసులను దీనికి కారణంగా చూపించింది. రాజస్థాన్ మంత్రి రాజేంద్ర యాదవ్‌పై మధ్యాహ్న భోజన పథకం కుంభకోణం కేసు పెట్టారు. ఆ రాష్ట్రంలో మొత్తంమీద తొమ్మిది మంది నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థల కేసులు నడుస్తున్నాయి. వారిలో ముఖ్యమంత్రి గెహ్లాట్ కుమారుడు, సోదరుడు, మంత్రులు, సీనియర్ కాంగ్రెస్ నేతలు ఉన్నారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ కుమారుడు రతుల్ పురీని ఇడి అధికారులు ప్రశ్నించారు. ప్రతిపక్ష ఇండియా వేదికలోని అన్ని పార్టీల నేతలు, మంత్రులు జైళ్లలోనో లేదా ఈడీ నిఘాలోనే ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వానికి చెందిన ముగ్గురు మంత్రులు జైలులో కాలం గడుపుతున్నారు. ఇప్పుడు నాలుగో మంత్రిపై దాడులు మొదలయ్యాయి.
బిజెపి నేతల జోలికి పోరా ?
ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుంటున్న కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటి వరకు ఒక్క బిజెపి నాయకుడినిగాని, ఎన్‌డిఎ భాగస్వామ్య పక్ష నాయకుడి జోలికి గాని వెళ్లకపోవడం గమనార్హం. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ 'ఇడి మీద నాకు కేవలం ఒకే ఒక రోజు పెత్తనం ఇవ్వండి. బిజెపి సీనియర్ నాయకులందరూ జైలులో ఉంటారు'. అని అన్నారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 'లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకుల ఇళ్లపై దాడులు చేయించి కుట్రలు పన్నడమే మీ ఉద్దేశ్యమా' అని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నించారు. తమిళనాడు మాజీ మంత్రి సెంథిల్ బాలాజీని ఇటీవల విచారించిన ఇడి అధికారులు ఆయన్ను బిజెపిలో చేరాలని, లేని పక్షంలో దర్యాప్తును ఎదుర్కొవాలని బెదిరించారు.