- సూళ్లూరుపేటకు చేరుకున్న జీపుజాతా
ప్రజాశక్తి - సూళ్లూరుపేట(తిరుపతి) : సిపిఎస్ రద్దు చేయాలని, మున్సిపల్ పారిశుధ్య, ఇంజనీరింగ్ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సిఐటియు) ఆధ్వర్యంలో చేపట్టిన జీపుజాతా మంగళవారం సూళ్ళూరుపేటకు చేరుకుంది. ఈ సందర్బంగా సూళ్ళూరుపేట మున్సిపల్ కార్యాలయం వద్ద జాతాకు నాయకత్వము వహించిన ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్.నాగభూషణం, రాష్ట్ర కార్యదర్శి నాగేంద్ర, జిల్లా నాయకులు గోపి కార్మిక సమస్యలపై జాతా ఆవశ్యకతను వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 40వేల మంది 123 మున్సిపాలీటలు, కార్పొరేషన్స్, నగర పంచాయితీల్లో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులుగా పనిచేస్తున్న ఉద్యోగులను పర్మినెంటు చేయాలన్నారు. ఎలక్షన్‌ల సంధర్భంగా వైసిపి ప్రభుత్వం చేసిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం అమలు చేయాలని, ఎన్‌పిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామన్న మాటలను చేతలలో చూపించాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని పక్షంలో ఆందోళనను ఉధంతం చేస్తామని తెలిపారు. ఈకార్యక్రమంలో స్థానిక సిఐటియు నాయకులు బి.పద్మనాభయ్య, సిహెచ్.సుధాకరావు, అమృత రామయ్య, వెంకటరత్నం,చిన్నయ్య, చంగయ్య తదితరులు పాల్గొన్నారు.










