Sep 15,2023 06:55

( నేడు రోణంకి అప్పలస్వామి 114వ జయంతి )
            చయితగా, బోధకుడిగా, అనువాదకుడిగా, సాహితీ విమర్శకుడిగా, అభ్యుదయవాదిగా ఆచార్య రోణంకి అప్పలస్వామి చేసిన పయనం తరతరాలకు తరగని స్ఫూర్తిని పంచింది. 'రోణంకి' 1909 సెప్టెంబరు 15వ తేదీన శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం సమీపాన ఇజ్జవరం గ్రామంలో జన్మించారు. బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎ(ఆంగ్లం) పట్టా పొంది జీవన పయనంలో భాగంగా విజయనగరం ఎం.ఆర్‌ కళాశాలలో ఆంగ్ల బోధకుడిగా 1934లో కెరీర్‌ ప్రారంభించారు. అధ్యాపకునిగా కొనసాగుతూనే ప్రపంచంలోని పలు భాషలు అధ్యయనం చేసేందుకు ఆసక్తి చూపేవారు. ఫ్రెంచ్‌, స్పానిష్‌, గ్రీకు, హిబ్రూ, ఇటాలియన్‌ వంటి యూరోపియన్‌ భాషలను అధ్యయనం చేయటమేకాక అందులో అనువాదం చేసేటంతటి ప్రావీణ్యాన్ని సంపాదించారు. హిందీ, ఒడియా, కన్నడం, బెంగాలీ వంటి భాషల్లో సైతం అనర్గళంగా మాట్లాడే శక్తి సొంతం చేసుకున్నారు. తెలుగులో పాండిత్యం, ఆంగ్లంలో మంచి ప్రావీణ్యం పొందిన ఆచార్య రోణంకి...వివిధ భాషల్లో ఉత్తమ రచనలను అనువదించి గొప్ప అనువాదకునిగా ఖ్యాతిగాంచారు. అల్లసాని పెద్దన, క్షేత్రయ్య రచనలను ఆంగ్లీకరించారు. మేకియవెల్లి ఇటాలియన్‌ భాషలో రాసిన 'ప్రిన్స్‌' గ్రంథాన్ని, 'రాజనీతి' పేరుతో తెలుగులోకి సరళంగా అనువదించారు. ఈ పుస్తకం భారతీయ భాషలన్నింటిలోకి కేంద్ర సాహిత్య అకాడమీచే అనువాదం కావడం విశేషం. జాతీయ ఉపన్యాకుడిగానూ విశిష్టత పొందారు. 1987 మార్చిలో మరణించారు. ఆచార్య అప్పలస్వామి రచనలు, ప్రసంగాలు నేటి తరానికి తెలియజేసే బాధ్యతను సాహితీ సంస్ధలు, ప్రభుత్వాలు తీసుకోవాలని ఆయన అభిమానుల విజ్ఞప్తి.
 

- డా|| గుంట లీలావరప్రసాదరావు,
అసిస్టెంట్‌ ప్రొ||డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ విశ్వవిద్యాలయం, సెల్‌ : 8309519615