ముంబయి : మధ్యస్థ కాలానికి భారత్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.63,000కు చేరవచ్చని మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్సీయల్ సర్వీసెస్ ఓ రిపోర్ట్‌లో అంచనా వేసింది. ఇందులో దీర్ఘకాల పెట్టుబడులకు సరైన సమయమని పేర్కొంది. భౌగోళిక ఆందోళనలకు తోడు సెంట్రల్ బ్యాంక్‌ల మానిటరీ పాలసీల కఠినతరంతో బంగారం ధరలు పెరగొచ్చని పేర్కొంది. రష్యాాఉక్రెయిన్ ఉద్రిక్తలకు తోడు తాజాగా ఇజ్రాయిల్-హమాస్ ఆందోళనలు పసిడి ప్రియం కావడానికి దోహదం చేయనున్నాయని విశ్లేషించింది. అంతర్జాతీయంగా ఈ ఏడాది ప్రారంభంలో ఒక్క ఔన్స్ పసిడి 2,070 డాలర్ల గరిష్ట స్థాయికి చేరి.. మరో దశలో 1,800 డాలర్ల కనిష్ట స్థాయి వద్ద నమోదై.. ప్రస్తుతం 2,000 డాలర్లుగా పలుకుతుందని పేర్కొంది. బుధవారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.160 తగ్గి రూ.61,200గా పలికింది.