వాషింగ్టన్ : సోమవారం (జూలై 3) ఎన్నడూలేని విధంగా ప్రపంచవ్యాప్తంగా రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని నేషనల్ ఓషియానిక్ అండ్ అటాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌ఓఎఎ) వెల్లడించిందని వాషింగ్టన్ వార్తాపత్రిక 'ద హిల్' నివేదించింది. జూలై 3వ తేదీ గ్రహం ఉపరితలం నుండి రెండు మీటర్ల ఎత్తులో ఉన్న సగటు ప్రపంచ గాలి ఉష్ణోగ్రత 62.62 డిగ్రీల ఫారెన్ లేదా 17.01 డిగ్రీల సెల్సియస్‌ని తాకిందని మైనే యూనివర్సిటీ విశ్లేషించిన సమాచారం పేర్కొంది. ఇక ఈ ఉష్ణోగ్రతలపై అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త రాబర్డ్ రోడి మంగళవారం ట్వీట్ చేశారు. ఆయన 'ప్రస్తుత వాతావరణానికి సంబంధించిన సమాచారం తెలిపే ఎన్‌సిఇపి (నేషనల్ సెంటర్స ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ప్రిడిక్షన్) ప్రకారం.. సోమవారం భూమి యొక్క సగటు ఉష్ణోగ్రత మానవులను ఎన్నడూ లేనివిధంగా అత్యంత వేడికి గురిచేసింది. గ్లోబల్ వార్మింగ్ పైన ఎల్ నినో కలయిక ద్వారానే అత్యంత అధిక ఉష్ణోగ్రత నమోదైంది. దాదాపు మరో ఆరు వారాల్లో మరికొన్నిరోజులు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది' అని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. గతంలో 2022 ఆగస్టులో 62.46 డిగ్రీలు, 2016లో 61.92 డిగ్రీలుగా రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే సోమవారం 62.62 నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు గత రికార్డులను బద్దలుకొట్టాjయి. ఇదిలా ఉండగా, క్యూబెక్, వాయువ్య కెనడా, పెరూలో జూలై 3, 4 తేదీల్లో నమోదైన ఉష్ణోగ్రతల గత రికార్డులను బ్రేక్ చేశాయని క్లైమేట్ రీఅనలైజర్ ప్రాజెక్ట్‌లోని మైనే విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తెలిపారు. అలాగే అమెరికాలోని మెడ్‌ఫోర్డ్, ఒరెగాన్ నుండి టంపా, ఫ్లోరిడా వంటి నగరాల్లో గరిష్ట స్థాయిలలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని నేషనల్ వెదర్ సర్వీస్‌కు చెందిన వాతావరణ శాస్త్రవేత్త జాక్‌టేలర్ తెలిపారు. ఇక బీజింగ్‌లో గత 9 రోజుల్లో 35 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని 'ది హిల్' నివేదించింది.










