Oct 17,2023 09:51
  • మిజోరం ఎన్నికల ప్రచారంలో రాహుల్‌

ఐజ్వాల్‌ : దేశంలో జరుగుతున్న మణిపూర్‌ హింసాకాండ కంటే ఇజ్రాయిల్‌లోని విషయాలే ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఎక్కువని కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌గాంధీ విమర్శించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికల జరగనున్న మిజోరంలో ఎన్నికల ప్రచారంలో సోమవారం ఆయన పాల్గొన్నారు. 40 అసెంబ్లీ స్థానాలు ఉన్న మిజోరంలో నవంబర్‌ 7న ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మిజోరం రాజధాని ఐజ్వాల్‌లో చన్మారీ నుంచి రాజ్‌ భవన్‌ వరకూ రాహుల్‌ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా రాహల్‌ మాట్లాడుతూ మే 3 నుంచి మణిపూర్‌లో హింసాకాండ జరుగుతున్నా.. మణిపూర్‌లో మోడీ పర్యటించలేదని విమర్శించారు. 'కొన్ని నెలల క్రితం నేను మణిపూర్‌కి వెళ్లాను. అక్కడ నేను చూసినదాన్ని నమ్మకలేకపోయాను. ప్రజల్ని హత్య చేశారు. మహిళల్ని వేధించారు. చివరికి శిశువుల్ని చంపారు. అయినా మన ప్రధానికి అక్కడకు వెళ్లడం ముఖ్యంకాదు' అని రాహుల్‌ విమర్శించారు. ప్రధాని అక్కడకు వెళ్లకపోవడం సిగ్గుపడాల్సిన విషయమని అన్నారు. మణిపూర్‌లో హింసాకాండ దేశంలోని వివిధ ప్రాంతాల్లో మైనార్టీలు, గిరిజనులు, దళితులు ఎదుర్కొంటున్న సమస్య యొక్క లక్షణం మాత్రమే అని అన్నారు. భారతదేశ ప్రజలను బిజెపి అణిచివేస్తోందని రాహుల్‌ ఆరోపించారు. 'మణిపూర్‌లో జరిగింది ప్రజలపై దాడి మాత్రమే కాదు.. ఇది మణిపూర్‌లోని భారతదేశం యొక్క ఆలోచనపై కూడా దాడి. ఈ దేశంలోని ప్రతీ మతాన్ని, సంస్కృతిని, భాషను, సంప్రదాయాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్క భారతీయుడి కర్తవ్యం' అని రాహుల్‌ స్పష్టం చేశారు. బిజెపితో పొత్తు పెట్టుకున్న మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (ఎంఎన్‌ఎఫ్‌)పైనా రాహుల్‌ విమర్శలు గుప్పించారు. ప్రస్తుత ప్రభుత్వం గత ఐదేళ్లలో ఏమి చేసిందో పరిశీలించాలని ప్రజలకు రాహుల్‌ విజ్ఞప్తి చేశారు. యువత డ్రగ్స్‌ మత్తులో చిక్కుకుందని, మౌలిక సదుపాయాలు, రోడ్లు శిథిలావస్థలో ఉన్నాయని రాహుల్‌ విమర్శించారు.