
భారత్ వెలిగిపోతోందంటూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రముఖ వార్తా సంస్థ పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దేశ ప్రజలకు ఉచితంగా '4-డి' సినిమా చూపించారు. ఈ వారంలో ఢిల్లీలో జరుగుతున్న జి20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఇంటర్వ్యూ చేశారు. మోడీ మాయల మరాఠి అని వేరే చెప్పనవసరం లేదు. తిమ్మిని బమ్మిని చేయగల నేర్పరి అనేది లోకోక్తి. తన తొమ్మిదేళ్ల పాలనలో తిమిరం ఆవహించిన దేశానికి కృత్రిమంగా వెలుగులు అద్దే దుస్సాహసం ఒడిగట్టడంలోనే మోడీ గడుసుదనం కనిపిస్తుంది. రాజుగారి దేవతావస్త్రాలు మాదిరి లేని వెలుగులను ఉన్నట్లు ప్రజలను భ్రమింప చేయడం మోడీకే చెల్లుతుంది. ఇంటర్వ్యూలో ఆయన చేసిన ప్రవచనం 2047 నాటికి దేశంలో కులతత్వం, మతతత్వం ఉండదని, అవినీతి పూర్తిగా అంతమవుతుందనీనూ. కులతత్వం, మతతత్వాలను రెచ్చగొట్టడమే ఎజెండాగా పెట్టుకున్న సంఫ్‌ు పరివారానికి అధికారపక్షాన అన్ని విధాలా అండగా నిలిచిన వ్యక్తే ఇక అటువంటివి ఉండబోవంటే విశ్వసించేదెలా? నాటి గుజరాత్ నరమేధం వేళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేటి మణిపూర్ మారణహోమం సమయాన ప్రధానిగా ఉండి ఎందుకు మత హింసను అణచివేయలేక పోయారు? అంతర్జాతీయ సంస్థలనేకం అదానీ అక్రమాల చిట్టాను బహిర్గతం చేస్తున్నా నోరు మెదపకుండా మద్దతిస్తున్న మనిషే అవినీతి పూర్తిగా అంతమవుతుందనడం ఏ రకమైన నైతికతో మోడీయే విపులీకరిస్తే బాగుంటుంది.
'సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్' నినాదం ప్రపంచ సంక్షేమానికి రోల్ మోడల్ అయిందని గొప్పలు పోయారు ప్రధాని. బిజెపి పాలనలో 'అందరితో కలిసి అందరి అభివృద్ధి' ఏకోశాన కనిపించదు. కార్పొరేట్ల అభివృద్ధే దర్శనమిస్తుంది. మిలియనీర్లు బిలియనీర్లు అవుతుండగా పేదలు నిరుపేదలవుతున్నారని పలు ప్రభుత్వ సర్వే ఏజెన్సీలు, ఫోర్బ్స్ వంటివి ఘోషిస్తున్నాయి. పేదరికం, నిరుద్యోగం గ్రాఫ్ అధ్వానం కాగా ప్రజల మధ్య ఆర్థిక అంతరాలు అగాధాల్లా తయారవుతున్నాయి. మానవాభివృద్ధి భేషుగ్గా ఉందనడం వంచనే. రాబోయే రోజుల్లో విద్య, వైద్యం, సామాజిక రంగాల్లో అత్యుత్తమంగా మన దేశం తయారవుతుందంటున్నారు మోడీ. కేంద్రం ప్రతిపాదించిన నూతన విద్యా విధానం కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ, మతీకరణలతో నిండిపోయింది. పిల్లలను మరింతగా విద్యకు దూరం చేస్తుంది. ఆరోగ్యరంగం కార్పొరేటీకరించబడుతోంది. కరోనా సమయంలో ఆ పర్యవసానాలు ఆచరణాత్మకంగా గోచరించాయి. బిజెపి జమానాలో సామాజిక న్యాయం అందని ద్రాక్షే. సమాజంలో కుల దొంతరలను ప్రతిష్టించిన మనుధర్మాన్ని అమలు చేయాలనే శక్తుల కుదురు నుంచి పుట్టిన బిజెపి పాలనలో సామాజిక అభివృద్ధి అత్యాశే కాగలదు.
నయా-ఉదారవాద విధానాలను మరింతగా ముందుకు నెట్టే 'విజన్'ను మోడీ ఏకరువు పెట్టారు. వాణిజ్యం, మార్కెట్, అందుకు అవసరమైన సాంకేతికాభివృద్ధిపై కేంద్రీకరించారు. ప్రపంచంలో సౌరశక్తి, జీవ ఇంధనం కూటమి, తద్వారా స్థానిక కార్పొరేట్ల లాభాల సాధనపై మాట్లాడారు. జిడిపి కేంద్రీకృత దృక్పథం నుంచి మానవ కేంద్రీకృత దృక్పథం వైపు మారాలన్నారు. జిడిపి గురించి ఎక్కువ మాట్లాడేది ఆయన, ఆయన ప్రభుత్వమే. అదానీ, అంబానీ ఆదాయాలను, చెప్పులు కుట్టుకొని బతికే నిరుపేద ఆదాయాన్ని కలిపి లెక్కించి జిడిపి వృద్ధిని ఆకాశానికెత్తేది వారే. ఆర్థిక క్రమశిక్షణపై రాష్ట్రాలు స్పృహతో మెలగాలని, ఉచితాలు కూడదని నయా-ఉదారవాద బాణీని వినిపించారు. పేదలకు అందుతున్న అరకొర సబ్సిడీలను కూడా ఎత్తేసి కార్పొరేట్లకు మరింతగా దోచిపెట్టాలన్నదే దీని వెనుక ఉన్న ఉద్దేశం. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరిస్తుందన్న మోడీ ఇక్కడా మతతత్వాన్ని లేవదీశారు. పూర్వం అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న మన దేశం ఆక్రమణల మూలంగా దిగజారిందని ముస్లిం రాజుల దండయాత్రలను పథకం ప్రకారం స్ఫురింపజేశారు. డెమోక్రసీ, డెమోగ్రఫీ, డైవర్సిటీ... మూడు 'డి'లు దేశంలో ఉన్నాయి, కొత్తగా డెవలప్‌మెంట్ అనే నాల్గవ 'డి' వచ్చి చేరిందని మొత్తానికి ఫోర్ డి సినిమా చూపించారు. వాజ్‌పేయి సైతం ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్, దేశం వెలిగిపోతోందని ఊదరగొట్టారు. చివరికి ఆయన ప్రభుత్వం ఓడిపోయింది. అబద్ధాలు వండి వార్చే మోడీ ప్రభుత్వానికి అదే గతి పట్టడం ఖాయం.