Oct 11,2023 10:21
  • ఎర్రగుంట్లలో రైతుల తిరస్కరణ
  • రెండు లోడ్ల శనగలు పంపిణీ నిలిపివేత
  • అగ్రిల్యాబ్స్‌ పనితీరుపై సందేహాలు

ప్రజాశక్తి - కడప ప్రతినిధి : కడప జిల్లాలో నాసిరకపు శనగల పంపిణీ కలకలం రేపింది. ప్రతి ఏటా రబీలో అత్యధిక విస్తీర్ణంలో బుడ్డశనగను సాగు చేస్తారు. 2023-24 ఖరీఫ్‌ సీజన్‌ కొండెక్కిన నేపథ్యంలో రబీపై రైతులు ఆశలు పెంచుకున్నారు. విత్తన ఏజెన్సీలు రైతుల పెద్దఎత్తున నాసిరకపు నల్లశనగలను అంటకట్టే ప్రయత్నం ఎర్రగుంట్ల మండలంలో వెలుగులోకి వచ్చింది. విత్తనాల్ని, పురుగు మందులను నియోజకవర్గ అగ్రిల్యాబ్‌ల్లో పరీక్షించిన అనంతరం పంపిణీ చేస్తామన్న ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి హామీ పరిహాసానికి గురవుతోంది.
           జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో బుడ్డశనగ సాగవుతోంది. జిల్లాలోని 16 నుంచి 21 మండలాల్లో 1.80 లక్షల నుంచి 2.42 లక్షల ఎకరాల విస్తీర్ణంలో బుడ్డశనగను సాగు చేస్తారు. 2023 -24 ఖరీఫ్‌ సీజన్‌ కొండెక్కిన నేపథ్యంలో రైతాంగం రబీ సీజన్‌ పంటల సాగుపై ఆశలు పెంచుకుంది. ప్రభుత్వం 74.120 క్వింటాళ్లలో బుడ్డశనగ విత్తనాల్ని మంజూరు చేసింది. 40 శాతం సబ్సిడీని వర్తింపజేసింది. జిల్లా వ్యవసాయ శాఖ 432 రైతు భరోసా కేంద్రాల్లో పంపిణీ ఏర్పాట్లు చేసింది. ప్రతి రైతుకూ కనిష్టంగా 20 కిలోల నుంచి గరిష్టంగా 200 కిలోల మేర పంపిణీ చేస్తోంది. మంగళవారం ఎర్రగుంట్ల మండలం కల్లమల, పోట్లదుర్తి ఆర్‌బికెల్లో పంపిణీకి ఏర్పాట్లు చేసింది. రైతులు బస్తాలను విప్పి విత్తనాల్ని పరిశీలించి విస్తుపోయారు. ఇందులో 40 శాతం మేరకు నల్లరకం కలిగిన బుడ్డశనగ విత్తనాలు ఉండటాన్ని గమనించడం ద్వారా నాసిరకపు విత్తన పంపిణీ వ్యవహారం వెలుగులోనికి వచ్చింది. నాసికపు విత్తన పంపిణీ వ్యవహారం వెలుగులోకి రావడంతో పలువురు రైతులు నల్లరకపు బుడ్డశనగ విత్తనాల్ని తీసుకోవడానికి తిరస్కరించడం చర్చనీ యాంశంగా మారింది. మండల వ్యవసాయ శాఖకు రెండు వాహనాల్లో వచ్చిన విత్తనాల్ని వెనక్కి పంపించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన అగ్రిల్యాబ్స్‌ పనితీరుపై సందేహాలు వ్యక్తమ వుతుండడం ఆందోళన కలిగిస్తోంది. విత్తనం నుంచి పురుగు మందుల వరకు ఇన్‌ఫుట్స్‌ అన్నింటినీ పరీక్షించిన అనంతరం రైతులకు అందిస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ పరిహాసానికి గురవుతోంది. మండల వ్యవసాయ శాఖ నల్లబుడ్డగ విత్తనం వచ్చిన మాట వాస్తవమేనని అంగీకరించడం విశేషం. దీనిపై జిల్లా వ్యవసాయశాఖ అధికారిని సంప్రదించగా అందుబాటులోకి రాకపోవడం గమనార్హం.