ప్రజాశక్తి - క్యాంపస్(తిరుపతి) : మానవుడు తన జీవితంలో చిరుధాన్యాలతో తయారుచేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె. రాజారెడ్డి పేర్కొన్నారు. శనివారం అంతర్జాతీయ చిరుధాన్యాల దినోత్సవం సందర్భంగా హోమ్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో పరిపాలన భవనం నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీసీ ముఖ్యఅతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చిరుధాన్యాల ఆవశ్యకతను ప్రాముఖ్యతను ప్రజలలో విస్తృతంగా తీసుకువెళ్లేందుకు ర్యాలీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. చిరుధాన్యాల వినియోగం వలన మానవులు జీవితంలో ఎంతో ఆరోగ్యకరంగా ఉండేందుకు ఆస్కారం ఉందన్నారు. చిరుధాన్యాల ప్రాముఖ్యతను విద్యార్థులు వారి సొంత ఊర్లలో కూడా ప్రజలకి, స్నేహితులకి, బంధువులకి తెలియజేయాలని పిలుపునిచ్చారు. సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ కె.తులసి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల ద్వారానే చిరుధాన్యాల ప్రాముఖ్యత ప్రజల్లోకి తొందరగా చేరుతుందన్నారు. సమాజంలో ప్రజలు ఎలాంటి సుగర్, బీపీ లేని జీవితాన్ని వ్యక్తులు గడపాలంటే చిరుధాన్యాలు తమ జీవితంలో భాగం కావాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ చిరుధాన్యాల దినోత్సవం సందర్భంగా పరిపాలన భవనం నుంచి ప్రారంభించిన ర్యాలీ రెండవ గేటు, విసి బంగ్లా, బాలాజీ కాలనీ, టౌన్ క్లబ్ వరకు వెళ్లి తిరిగి ప్రకాశం భవనం దగ్గరలోని హౌమ్ సైన్స్ విభాగానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో హౌమ్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ కె.వి. సుచరిత, డాక్టర్ కే.అనురాధ, డాక్టర్ బి.స్వరూప రాణి, డాక్టర్ అనిత, డాక్టర్ నీరజ, డాక్టర్ సింధుజ, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.










