కర్ణాటకలోని చిక్‌బళ్లాపురం సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మంది వలస కార్మికులు చనిపోవడం దిగ్భ్రాంతికరం. వీరిలో అత్యధికులు శ్రీసత్యసాయి జిల్లాకు చెందినవారే. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావంతో అనేక ప్రాంతాల్లో కరువు నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు లేకపోవడం, ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న దరిమిలా కరువు సీమల నుంచి వలసలు అనివార్యమవుతున్నాయి. పొట్ట చేత పట్టుకొని బతుకుజీవుడా అంటూ పట్టణాలకు వలసపోతున్న అభాగ్యులు ఇలా నడిదారిలో రోడ్డు ప్రమాదాలకో..మరో విపత్తుకో బలైపోతుండటం దయనీయం. కొన్నాళ్ల కిందట ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నఊరిలో పనుల్లేక మరో ప్రాంతానికి వెళ్తూ దారిమధ్యలో విద్యుత్ తీగలు తెగిపడటంతో ఆరుగురు వ్యవసాయ కార్మికులు చనిపోవడం ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో చూశాం. రాష్ట్రంలోనే కాదు.. దేశం నలుమూలలా వివిధ ప్రాంతాలకు, గల్ఫ్ లాంటి దేశాలకు వలస వెళ్తూ దారిమధ్యలో అసువులు బాస్తున్న బడుగుజీవులు ఎందరో! కోవిడ్ సమయంలో దారిలో నేలరాలిన శ్రమజీవులెందరో! గ్రామీణ ప్రాంతాల్లోనే ఉపాధి కల్పించి జీవనోపాధులు మెరగుపరిస్తే ప్రజలు ఉన్నచోటే పదిలంగా పనిచేసుకుంటారు. ఇలాంటి విషాద ఉదంతాలు జరిగేవి కాదు.
దేశ స్థూల జాతీయోత్పత్తిలో 10 శాతం వలస కార్మికుల నుంచి లభిస్తోందని అంతర్జాతీయ కార్మికుల సంస్థ (ఐఎల్‌ఒ) నివేదించింది. జాతి నిర్మాణంలో ఇంత పెద్ద వాటా కలిగిన వలస జీవుల బతుకులు మాత్రం గాల్లో దీపాల్లానే ఉన్నాయి. 2011 జనగణన ప్రకారం దేశంలో 121 కోట్ల మంది జనాభా ఉండగా అందులో 45.6 కోట్ల మంది వలస కార్మికులే. మన రాష్ట్రంలో సమారు 30 లక్షల మంది వరకు వలస కార్మికులున్నట్లు అంచనా. ఐక్యరాజ్యసమితి తాజాగా వెలువరించిన గణాంకాల ప్రకారం దేశ జనాభా 142 కోట్లుగా ఉంటే అందులో సుమారు మూడింట రెండింతలు 35 ఏళ్ల లోపు వయస్సున్నవారే. వీరిలో అత్యధిక మంది గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు, నగరాలకు వలస వచ్చి శివారు ప్రాంతాల్లో నివసిస్తూ డ్రైవర్లు, హెల్పర్లు, దుకాణాలు, ఇళ్లలో దినసరి కూలీలుగా, భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తూ బతుకెళ్లదీస్తున్నవారే. సొంతూరిని, అమ్మనాన్నల అనురాగాన్ని, బంధుగణ ఆత్మీయతను కాదని పరాయిచోటుకి ప్రజలు వలసకట్టడానికి రెండు ప్రధానమైన కారణాలు కనిపిస్తాయి. మొదటిది జీవనోపాధి, మెరుగైన కూలిరేట్లు, వేతనాలు. మరొకటి మెరుగైన బతుకు కోసం. వర్షాలు పడక, తినడానికి తిండి లేక, త్రాగడానికి మంచినీరు కొనలేక, వ్యవసాయ పనులు గగనమై, జీవనాధారం కరువై, ఏదైనా పని చేసుకొని బతుకెళ్లదీయొచ్చున్న ఆశతో పల్లె ప్రజ పనులెత్కుంటూ మరోచోటుకి పయనమవుతోంది. ఉన్నచోటే మెరుగైన వేతనాలతో పనులు దొరికితే, తిండి, నీరు సమృద్ధిగా దక్కితే సొంతూరిని వీడే అవసరమే రాదు. ఉన్నచోటే ఉపాధి కల్పించలేని పాలకులకు కనీసం వలస వెళ్తున్నవారికి గుర్తింపు కార్డులివ్వడం, వైద్య సేవలు, బీమా వంటి కనీస సౌకర్యాలు కల్పించడం వంటి సోయి కూడా లేదు. కేరళ, తమిళనాడు రాష్ట్రాలు ఇందుకు మినహాయింపు. దేశానికే ఆదర్శనీయమైన విధానాలు అమల్జేస్తున్నాయి.
కేరళలోని ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం వలస కార్మికులను అతిథి కార్మికులుగా గౌరవిస్తోంది. రాష్ట్ర పురోభివృద్ధిలో వలస కార్మికుల కృషి ఎంతో ఉందని కొనియాడుతూ తమిళనాడు ప్రభుత్వం అండదండలందిస్తోంది. వలస కార్మికుల కారిడార్లను గుర్తించి ప్రత్యేక వైద్య సదుపాయాలు, వసతి సౌకర్యాలను కల్పించడంతో పాటు కోవిడ్ సమయంలో వలస కార్మికులకు కేరళ అందించిన సహాయాలకు ప్రపంచ నలుమూలాల నుంచి ప్రశంసలు దక్కాయి. కుడుంబ శ్రీ పథకాన్ని అమల్జేస్తున్న కేరళ.. ఉన్నచోటే ఉపాధి కల్పిస్తూ వలసల నివారణకు చర్యలు చేపట్టింది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ సహకరించకపోయినా గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమల్జేయడమేగాక పట్టణ ప్రాంతాల్లోనూ ఉపాధి హామీ పథకాన్ని కేరళ ప్రభుత్వం దిగ్విజయంగా అమల్జేస్తూ ప్రత్యామ్నాయ దివిటిని వెలిగించింది. చిక్‌బళ్లాపురం వంటి విషాదాంతాలు పునరావృతం కాకూడదనుకుంటే కరువు నివారణ చర్యలను తక్షణమే చేపట్టాలి. గ్రామాల్లో జీవనోపాధులు పెంపొందించేలా కుటీర పరిశ్రమలకు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతమివ్వాలి. కేరళ తరహాలో గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పట్టణాలకూ విస్తరింపజేసి కనీసం రూ.600 రోజువారీ వేతనంతో ఏడాదికి 200 పనిదినాలు కల్పించాలి.