ప్రజాశక్తి-పాకాల(తిరుపతి) : నిత్య జీవితంలో ప్రతి క్షణం లెక్కలు అవసరం ఉందని పాకాల మండలం దామల చెరువు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ్ మోహన్ రెడ్డెప్ప, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ మోహిద్దీన్ భాష అన్నారు. జాతీయ గణిత దినోత్సవ వేడుకలను పాఠశాలలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రామానుజన్ దేశానికి గణితంలో విశేష సేవలు అందించారని అన్నారు. రామానుజన్ చాలా నిరుపేద కుటుంబంలో పుట్టాడని, చాలా కష్టపడి చదివారని అన్నారు. గణితం అంటే భయపడే అవసరం లేదని, రోజూ ఒక క్రమ పద్ధతిలో సాధన చేస్తే చాలని అన్నారు. అనంతరం విద్యార్థులు గణిత దినోత్సవం గురించి మాట్లాడారు. విద్యార్థులు చేసిన మోడల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. బాగా మాట్లాడిన విద్యార్థులకు, మోడల్స్ చేసిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమేష్ నాయుడు, సుధాకర్, యూసఫ్, చిన్నస్వామి, లక్ష్మీ దేవి, జ్యోతి, సి.ఆర్.పి.శ్రీనివాసులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.










