సీతాపురం అనే గ్రామంలో ఆకాష్, అశ్విని అనే దంపతులు ఉన్నారు. పెళ్ళైన చాలా సంవత్సరాల వరకు వారికి సంతానం కలగలేదు. హాస్పిటల్స్ చుట్టూ తిరిగిన చాలా రోజులకు ఒక పాప జన్మించింది. ఆ పాప పేరు నవ్య. నవ్యను చిన్నప్పటి నుండి అతి గారాబంగా పెంచారు. ఆమె ఏది అడిగినా వెంటనే కాదనకుండా ఇచ్చేవారు. తల్లిదండ్రులు అతి ప్రేమ చేయడంతో నవ్యలో పెంకితనం ఎక్కువైంది.
ఇంట్లో బాగా అల్లరి చేసేది. స్కూల్‌లో కూడా అల్లరి చేయడంతో పాటు, అందరినీ ఎగతాళి చేసేది. టీచర్లు పాఠాలు చెప్పేటప్పుడు సరిగా వినేది కాదు. పక్క వారితో ముచ్చటించేది. చదవడం తప్ప మిగతా అల్లరి పనులు అన్నీ చేసేది. తోటి విద్యార్థులతో కావాలని గొడవ పడేది. టీచర్లు ఎన్నోసార్లు నచ్చజెప్పి చూశారు. నవ్య వారి మాటలు లెక్కచేయలేదు.
ఒక రోజు నవ్య తరగతిలో రామరాజు అనే టీచర్ బోర్డ్‌పై రాస్తుండగా బిగ్గరగా నవ్వింది. ఆమెను చూసి మిగతా విద్యార్థులు నవ్వారు. తరగతిలో గోల మొదలైంది. ఎందుకు నవ్వావని టీచరు నవ్యను అడిగారు.
'నవ్వు వచ్చింది, నవ్వాను!' అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది నవ్య.
రామరాజు టీచరు కోపం వచ్చి బెత్తంతో నవ్య చేతిపై రెండు దెబ్బలు వేశారు. అంతే, నవ్య తరగతి గది నుండి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళి, తల్లిదండ్రులకు చెప్పింది. కూతురి ఏడ్పు చూడగానే వారు కంగారుపడ్డారు. విషయం తెలుసుకుని వెంటనే పాఠశాలకు వచ్చి ప్రధానోపాధ్యా యులకు రామరాజు టీచర్‌పై ఫిర్యాదు చేశారు. రామరాజు టీచర్ నవ్యని ఎందుకు కొట్టవలసి వచ్చిందో వివరణ ఇచ్చారు. టీచర్లు అందరూ నవ్య ప్రవర్తన మార్చుకోవాలని సూచించారు. మార్చుకోకపోతే మున్ముందు చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పారు.
ఒక్కగానొక్క కూతురిపై ఉన్న అతి ప్రేమతో నవ్య తల్లిదండ్రులు టీచర్లు చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోలేదు. పైగా 'మా అమ్మాయిపై ఇక నుండి ఒక్క దెబ్బ పడవద్దు!' అని చెప్పి వెళ్ళారు.
ఈ విషయాన్ని గమనించిన నవ్యకు మరింత అలుసు పెరిగింది. తరగతిలో వెనుక బెంచీలో కూర్చుని, ఉపాధ్యాయులను వెక్కిరించడం, అనవసరంగా నవ్వడము, గోల చేయడం చేసేది. నవ్య ప్రవర్తన ఉపాధ్యాయులను, తోటి విద్యార్థులను బాధించేది. చాలాసార్లు విసుగు, కోపం తెప్పించినా ఎవరూ ఏమి అనే వారు కాదు.
ఒకరోజు ప్రార్థన సమయంలో ప్రధానోపాధ్యాయులు
'రేపు ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో ఉపన్యాసం ఇచ్చే విద్యార్థులు పేర్లు ఇవ్వాలి' అన్నారు.
ఇది విన్న నవ్య వ్యంగ్యంగా 'వీరికి ఉపాధ్యాయ దినోత్సవం కూడానా?' అంది.
మరుసటి రోజు విమల అనే అమ్మాయి ఉపాధ్యాయ దినోత్సవం గురించి ఉపన్యాసం ప్రారంభించింది. 'అందరికి శుభ మధ్యాహ్నం. ఉపాధ్యాయులు అంటే గుడిలో దేవుళ్లు. తల్లిదండ్రులు మనకు జన్మను మాత్రమే ఇస్తారు. వీరు మనకు మంచి జీవితాన్ని ఇస్తారు. మనలను సొంత బిడ్డల్లా చూస్తారు. మనం మన కుటుంబంతో కంటే ఉపాధ్యాయులతోనే ఎక్కువ సమయం గడుపుతాము. మనం ఎంత అల్లరి చేసినా, వారిని ఎంత విసిగించినా, ఇబ్బంది పెట్టినా మనకు తెలియదని, చిన్న పిల్లలమని పెద్ద మనసుతో క్షమించి, మన గురించే ఆలోచిస్తారు. మనము కామెంట్ చేసినా మనకు చదువు నేర్పడానికే వారు ముందుకు వస్తారు.
వారు చెప్పేది మనం శ్రద్ధగా వింటే ఎంతో సంతోషిస్తారు. మనం మంచి స్థాయిలో ఉండాలని, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేయాలని కోరుకుంటారు. కానీ కొంతమంది విద్యార్థులు ఉపాధ్యాయులను అర్థం చేసుకోకుండా, వారు చెప్పినట్లు వినకపోవడం, వారినే వెక్కిరించడం చేస్తుంటారు. ఇది క్షమించరాని తప్పు. అయినా అలాంటివారిని మన ఉపాధ్యాయులు క్షమించి, వారి బాగు కోసమే కష్టపడతారు. అదే ఉపాధ్యాయుల గొప్పతనం' అని పూర్తిచేసింది.
విమల ఉపన్యాసం విన్న నవ్యకు తను చేసిన తప్పు అర్థమైంది. ఉపాధ్యాయుల మంచితనం తెలిసి వచ్చింది. తలొంచుకుని బాధపడింది. మీటింగ్ ముగిసిన తర్వాత ఉపాధ్యాయుల దగ్గరకు వెళ్ళి, క్షమించుమని వేడుకుంది.
'ఇక నుండి నేను మీరు చెప్పినట్లు వింటాను. మంచిగా చదువుతాను. మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టను. నన్ను క్షమించండి, నేను పూర్తిగా మారిపోయాను!' అని ఏడ్చింది.
నవ్యలో వచ్చిన మార్పు చూసి, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు సంతోషించారు.
కొంపల్లి విశిష్ట,
తొమ్మిదవ తరగతి,
జక్కాపూర్ ఉన్నత పాఠశాల,
సిద్ధిపేట జిల్లా -502276,
తెలంగాణ, సెల్ :9959007914