Sep 03,2023 06:55

           కాళిదాసు 'మాళవికాగ్ని మిత్రము' నాటకంలో-ఇద్దరు అధ్యాపకులుంటారు. సంగీత సాహిత్యాది విషయాలలో వీరిద్దరూ అగ్రగణ్యులు. ఇరువురిలో ఎవరు గొప్ప అనేది తేల్చడం ఎవరివల్లా కాలేదు. చివరికి ఈ అధ్యాపకుల్లో ఎవరు గొప్ప అనేది తేల్చమని రాజుగారు మంత్రికి బాధ్యత అప్పగిస్తాడు. మంత్రిగారు ఆ అధ్యాపకుల ప్రధాన శిష్యులను రప్పించి, పాండిత్యంలో పోటీ నిర్వహిస్తాడు. ఈ పోటీలో గెలిచిన శిష్యుడి గురువును విజేతగా ప్రకటిస్తాడు. ఉపాధ్యాయుడి ఘనత అతని శిష్యులు సాధించే విజయం మీద, నడవడిక మీద ప్రతిబింబిస్తుందని మహాకవి కాళిదాసు చెబుతాడు. 'జీవితం అంటే ఏమిటో బోధించిన నా ఉపాధ్యాయుడు అరిస్టాటిల్‌కి ఎప్పుడూ ఋణపడి వుంటాను. తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే...నా గురువు నాకు జీవితాన్నిచ్చాడు' అంటాడు అలెగ్జాండర్‌. సమాజంలో గురువు పాత్ర ఎప్పుడూ విశిష్టమైనదే. అందుకే 'మాతృ దేవోభవ.. పితృ దేవోభవ... ఆచార్య దేవోభవ...' అని తల్లిదండ్రుల తర్వాతి స్థానాన్ని గురువుకిచ్చారు. ఏ ఉత్తమ గురువు కూడా...ఒక్క పాఠ్యాంశాలను బోధించడంతోనే సరిపెట్టుకోరు. ఉన్నతమైన ఆశయాలను బోధిస్తారు. ఆ ఆశయ సాధన దిశగా దిశానిర్దేశం చేస్తారు. ప్రపంచ గమనాన్ని అవగతం చేస్తారు. సమాజ స్థితిగతులను అధ్యయనం చేసి, నవతరానికి ప్రగతిబాట అవుతారు. తన శిష్యుల ఎదుగుదలకు నిచ్చెన మెట్టవుతారు.
         'యతో హస్త: తతో దృష్టి: / యతో దృష్టి: తతో మన:' అని సాగరసంగమం సినిమాలో కమల్‌హసన్‌ చెబుతాడు. తన శిష్యురాలు తనను ద్వేషిస్తుందని తెలిసినా, ఆ విద్యార్థి ఉన్నత శిఖరాలకు ఎదగాలన్న ఆశయంతో తన గురుత్వాన్ని ప్రదర్శిస్తాడు. చేత్తో రాస్తేనే దృష్టి అక్కడ నిలుస్తుంది. దృష్టి నిలిస్తేనే మనసు నిమగం అవుతుంది అని ఆ శ్లోకం చెబుతుంది. 'చదువు మనిషిని సంపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది, చర్చ సంసిద్ధ మానవుడిగా తీర్చిదిద్దుతుంది, రాత కచ్చితమైన మానవునిగా తీర్చిదిద్దుతుంది' అని 16వ శతాబ్దినాటి బ్రిటిష్‌ రాజనీతిజ్ఞుడు ఫ్రాన్సిస్‌ బేకన్‌ అన్నాడు. నాలుగు గోడల మధ్య ఉన్నత సమాజాన్ని తీర్చిదిద్దే రూపశిల్పి గురువు. రాయని చదువు నిరర్థకం అని, తరగతి గదిలో అభ్యసించే చదువే ఉత్తమమని, తరగతి గదిలో ఉపాధ్యాయుని బోధనకు మరేదీ ప్రత్యామ్నాయం కాదని అనేక సర్వేలు చెబుతున్నాయి. ఆన్‌లైన్‌ చదువులు, సాంకేతిక విజ్ఞానం అవసరమే. సాంకేతికతను స్వాగతించాల్సిందే. కానీ, ఆడియో బుక్‌ వింటే... చదవడం అవుతుందా? ఆన్‌లైన్‌ క్లాసులు చూస్తే... చదివినట్లవుతుందా? ఇప్పటికే కార్పొరేట్లను విద్యారంగంలోకి అనుమతించి విద్యను వ్యాపారమయం చేశారు. 'నూతన విద్యా విధానం' అంటూ ప్రభుత్వాలు రకరకాల విన్యాసాలు చేస్తున్నాయి. వీటికి తోడు... విద్యార్థులు తక్కువగా వున్నారనే పేరుతో పాఠశాలల విలీనం చేయడం, ఉపాధ్యాయులు వేతనాల కోసం ప్రతినెలా ఎదురుచూడాల్సి రావడం, ఉపాధ్యాయులకిచ్చే అరకొర సదుపాయాల్లో సైతం కోత విధించడం వంటి అనేక సమస్యలు అధ్యాపకులకు శిరోభారంగా మారాయి.
          'ఏ దేశ భవిష్యత్‌ అయినా... ఆ దేశ పాఠశాలల తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది' అంటారు విద్యావేత్త కొఠారి. సమాజంలో మనిషి తలరాత మార్చేది చదువు. ఆ చదువుకు బలమైన పునాదులు నిర్మించేది గురువు. అలాంటి ఒక సుహృద్భావ వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. లౌకిక విలువలకు వలువలిప్పి నడివీధిలో నడిపిస్తున్న కౌరవ క్రౌర్యానికి... విలువలను నేర్పాల్సింది ఉపాధ్యాయులే. 'జీవితంలో ఒక్కసారైనా ఒక గొప్ప అధ్యాపకుడి చేతిలో పడితే, ఆ వ్యక్తి గొప్ప నాగరికుడిగా మారే అవకాశం వుంది' అంటాడు బెట్రాండ్‌ రస్సెల్‌. విద్యావ్యవస్థను శరవేగంగా కాషాయీకరిస్తోన్న ప్రస్తుత తరుణంలో ఇలాంటి గొప్ప గురువుల అవసరం సమాజానికి ఎంతో వుంది. 'బండరాతిని శిల్పఖండముగ మలచి/ చెలువమ్ము గూర్చెడు శిల్పి రీతి' అని ఓ కవి అన్నట్టు...తన వ్యక్తిత్వంతో విద్యార్థులను ప్రభావితం చేయగలిగిన ప్రతి గురువూ... విద్యార్థుల మనసుల్లో చిరస్థాయిగా మిగిలిపోతాడు. వేలాది మంది ఉత్తమ నాయకులను ఈ దేశానికి అందించిన గురువులందరికీ 'ఉపాధ్యాయ దినోత్సవం' శుభాకాంక్షలు. మళ్లీ అటువంటి వారసత్వాన్ని నిర్మించేందుకు ఉపాధ్యాయులంతా కంకణం కట్టుకోవాలి.