- అజేయంగా 177 బాదిన మిచెల్ మార్ష్
- బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం
- గ్రూప్ దశలో ఏడో విజయంతో సెమీస్‌కు
- ఐసీసీ 2023 ప్రపంచకప్
పుణె : ప్రపంచకప్ గ్రూప్ దశను ఆస్ట్రేలియా అద్భుతంగా ముగించింది. పుణెలో శనివారం జరిగిన గ్రూప్ దశ చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 8 వికెట్ల తేడాతో అదిరే విజయం సాధించింది. 307 పరుగుల లక్ష్యాన్ని 44.4 ఓవర్లలో మరో 32 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. గ్రూప్ దశలో ఏడు విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్-3లో నిలిచింది. ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాతో సెమీఫైనల్ పోరుకు రంగం సిద్ధం చేసుకుంది. ఛేదనలో టాప్ ఆర్డర్ బ్యాటర్ మిచెల్ మార్ష్ (177 నాటౌట్, 132 బంతుల్లో 17 ఫోర్లు, 9 సిక్స్‌లు) అజేయ శతకంతో చెలరేగాడు. స్టీవ్ స్మిత్ (63 నాటౌట్, 64 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), డెవిడ్ వార్నర్ (53, 61 బంతుల్లో 6 ఫోర్లు) అర్థ సెంచరీలతో కదం తొక్కారు. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 306 పరుగులు చేసింది. తౌహిద్ హృదరు (74, 79 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), నజ్ముల్ శాంటో (45, 57 బంతుల్లో 6 ఫోర్లు) రాణించారు. గ్రూప్ దశలో ఏడో పరాజయంతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచిన బంగ్లాదేశ్ సెమీఫైనల్స్‌కు దూరమైనా.. ఐసీసీ 2025 చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించనుంది. ఆసీస్ బ్యాటర్ మిచెల్ మార్ష్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.
మార్ష్ ధనాధన్ : అఫ్గనిస్థాన్‌పై అసమాన విజయం ఉత్సాహంలో ఉన్న ఆస్ట్రేలియా.. బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించింది. సెమీస్ బెర్త్ ఖాయం కావటంతో గ్రూప్ దశ చివరి మ్యాచ్‌లో మోత మోగించింది. ధనాధన్ ఓపెనర్ ట్రావిశ్ హెడ్ (10) నిరాశపరిచినా.. డ్యాషింగ్ ఓపెనర్ డెవిడ్ వార్నర్ (53)తో కలిసి మిచెల్ మార్ష్ (177 నాటౌట్) అదరగొట్టాడు. వార్నర్, మార్ష్ జోడీ రెండో వికెట్‌కు 120 పరుగులు జోడించింది. ఆరు ఫోర్లతో వార్నర్ 52 బంతుల్లో అర్థ సెంచరీ సాధించగా.. మిచెల్ మార్ష్ ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో 37 బంతుల్లోనే ఫిఫ్టీ మార్క్ చేరుకున్నాడు. డెవిడ్ వార్నర్ నిష్క్రమించినా.. స్టీవ్ స్మిత్ (63 నాటౌట్) జతగా పని ముగించాడు. 11 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 87 బంతుల్లోనే సెంచరీ బాదిన మార్ష్.. 150 మార్క్‌ను 16 ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 117 బంతుల్లోనే అందుకున్నాడు. మరోవైపు స్మిత్ సైతం మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 55 బంతుల్లో అర్థ సెంచరీ నమోదు చేశాడు. మూడో వికెట్‌కు స్మిత్, మార్ష్ జోడీ అజేయంగా 175 పరుగులు జోడించారు. మిచెల్ మార్ష్ దెబ్బకు బంగ్లాదేశ్ బౌలర్లు బెంబేలెత్తారు. టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్‌లు చెరో వికెట్ పడగొట్టారు.
హృదయ్ మెరువగా : టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన బంగ్లాదేశ్ మంచి స్కోరు సాధించింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు అందరూ సమిష్టిగా పరుగులు జోడించారు. ఓపెనర్లు హసన్ (36), లిటన్ దాస్ (36) సహా నజ్ముల్ (45), మహ్మదుల్లా (32) మెరిశారు. తౌహిద్ హృదరు (74) అర్థ సెంచరీతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. టాప్-5 బ్యాటర్లు మెరిసినా.. లోయర్ ఆర్డర్‌లో ఆశించిన ప్రదర్శన రాలేదు. ముష్ఫీకర్ (21), మెహిది మిరాజ్ (29) వేగంగా ఆడలేకపోయారు. 330-340 పరుగులు చేసేలా కనిపించిన బంగ్లాదేశ్ చివరి పది ఓవర్లలో కాస్త నెమ్మదించింది. 306 పరుగులతో సరిపెట్టుకుంది. ఆసీస్ బౌలర్లలో సీన్ అబాట్, ఆడం జంపా చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. మార్కస్ స్టోయినిస్ ఓ వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. మార్నస్ లబుషేన్ రెండు మెరుపు రనౌట్లతో బంగ్లాదేశ్ టాప్ ఆర్డర్ దూకుడుకు బ్రేక్ వేయగా.. అబాట్ సైతం ఓ రనౌట్‌లో భాగం పంచుకున్నాడు.