ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజూ లాభాల్లో సాగాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్ 115 పాయింట్లు లేదా 0.19 శాతం పెరిగి 59,106కు చేరింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 38 పాయింట్లు రాణించి 17,398 వద్ద ముగిసింది. బిఎస్‌ఇలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.36 శాతం, 1.17 శాతం చొప్పున పెరిగాయి. నిఫ్టీలో ఆటో సూచీ 1.5 శాతం పెరగ్గా.. గ్యాస్ రంగం 6 శాతం పడిపోయింది. మూడు రోజుల ఆర్‌బిఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష ఏప్రిల్ 6తో ముగియనుంది. ఈ సమీక్షాలో కీలక వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు ఉన్నాయి. మహవీర్ జయంతి సందర్బంగా మంగళవారం స్టాక్ మార్కెట్లకు సెలవు. మార్కెట్లు రాణించినప్పటికీ అదాని స్టాక్స్ మాత్రం ఒత్తిడిలోనే కొనసాగుతున్నాయి. అదాని ఎంటర్‌ప్రైజెస్ సూచీ 1.85 శాతం తగ్గి 1,718కు పడిపోయింది. అదాని పోర్ట్స్ 0.44 శాతం, అదాని ట్రాన్స్‌మిషన్ 5 శాతం, అదాని పవర్ 0.78 శాతం చొప్పున నష్టపోయాయి.










