Nov 06,2023 21:40

7 నుంచి 10 వరకు నిరసనలు

వామపక్షాల పిలుపు
న్యూఢిల్లీ : పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్‌ సాగిస్తున్న దమనకాండను తక్షణమే ఆపాలని వామపక్షాలు కోరాయి. అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నవంబరు 7 నుండి 10 వరకు నిరసనకార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చాయి. భారత రక్షణ, విదేశాంగ మంత్రులతో ముఖాముఖి సమావేశానికి అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌, రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ భారత్‌కు వస్తున్న సమయంలో నిరసనలు, ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించాయి. తక్షణమే కాల్పుల విరమణ జరిగేలా అమెరికా చర్యలు తీసుకోవాలని, ఇజ్రాయిల్‌ రక్షణ బలగాలకు నిధులు అందజేయడం, ఆయుధాలు సమకూర్చడం వంటి చర్యలను ఆపాలని వామపక్ష పార్టీలు డిమాండ్‌ చేశాయి. సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా,ఎఐఎఫ్‌బి నేత జి.దేవరాజన్‌, సిపిఐ(యంఎల్‌)నేత దీపాంకర్‌ భట్టాచార్య, ఆర్‌ఎస్‌పి నేత మనోజ్‌ భట్టాచార్య సోమవారం నాడిక్కడ ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటన విడుదలజేశారు. పాలస్తీనియన్లపై అమెరికా-ఇజ్రాయిల్‌ జరిపే ఊచకోతకు మద్దతునివ్వడం ఆపాలని మోడీ ప్రభుత్వాన్ని కోరాయి. తక్షణమే కాల్పుల విరమణ జరపాలని అంతర్జాతీయ సమాజం ఇస్తున్న పిలుపులో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశాయి. నిరసనలు, ఆందోళనలు చేపట్టే రాష్ట్రాల్లో ఆయా కార్యాచరణ తీరు తెన్నులు, పద్దతులను వామపక్షాల రాష్ట్ర శాఖలు నిర్ణయిస్తాయని ఆ ప్రకటన తెలిపింది.