Jul 03,2022 10:12

మన్యం పోరాటంలో అల్లూరి సీతారామరాజుకు అండగా నిలిచిన, తుదివరకూ ఉద్యమించిన, ప్రాణాలర్పించిన ఎందరో మన్నెం వీరులు ఉన్నారు. వారిలో గాం గంటందొర, గాం మల్లుదొర, ఎండు పాగాలు, గోకిరి ఎర్రేసు, మోదిగాడు తదితరులు ఉన్నారు. గూడెం తాలూకా మాకవరం ముత్తాలోని బట్టపనుకుల గ్రామానికి చెందిన మహాయోధులు గాం సోదరులు. బట్టు వణుకుల మునసబు గిరీ నుంచి గంటందొరను అప్పటి డిప్యూటీ తహసీల్దార్‌ బాస్టియన్‌ దుర్మార్గంగా తొలగించాడు. గంటందొర, మల్లుదొర సాగు చేస్తున్న భూములను ముఠాదారుని చేత ఇతర రైతులకు ఇప్పించాడు. వారిపై కక్షకట్టి బిచ్చమెత్తుకోవాల్సిన దుస్థితికి బ్యాస్టియన్‌ తీసుకొచ్చాడు. గామ్‌ సోదరుల్లో పెద్దవాడు గంటయ్యదొర ఇలా చెప్పాడు : 'బాస్టియన్‌ చాలా క్రూరంగా వ్యవహరించాడు. ఈ తాలూకా ప్రజల పట్ల అనేక తప్పిదాలు చేశాడు. బ్యాస్టియన్‌ నా భూమిని లాక్కొని, సెమర్ల పెద్దబ్బికి ఇచ్చాడు. నన్ను నాశనం చేయొద్దని ప్రాధేయపడ్డాను. అతడు నన్ను తన బూటుకాలితో తన్నాడు. దాంతో నేను జీవితం పట్ల విరక్తి చెందాను. నా భార్యాబిడ్డలను మా గ్రామం నుంచి పంపేశాను. నేడు రాజు గారి కాళ్ల మీదపడ్డాను. బ్రిటీష్‌ వాళ్ల అంతం చూడాలని గట్టిగా నిర్ణయించుకున్నాను.'
గామ్‌ సోదరులు మాకవరం ముత్తాలో చాలా పలుకుబడి ఉన్న వారు. వారి పట్ల బాస్టియన్‌ దుర్మార్గం ఆ ముత్తా ప్రజల సానుభూతిని కల్పించింది. వారు రాజుకు అనేకమంది అనుచరులను, సానుభూతిపరులను సమకూర్చారు. ఎంతో నమ్మకస్తులైన, స్థానికంగా పూర్తిస్థాయి పరిజ్ఞానం ఉన్న వీరిచ్చిన సమాచారం ఆధారంగానే విప్లవకారులను అల్లూరి ఎంపిక చేసుకున్నాడు. మిగిలిన ప్రధాన అనుచరుల్లో అగ్గిరాజు, ఎండుపడాల్‌ ఉన్నారు. బ్రిటీష్‌ వారిని పారదోలేందుకు సీతారామరాజు 150 మంది గెరిల్లా యోధులను తయారుచేసి, మూడు దళాలు ఏర్పాటు చేశాడు. వాటికి గంటం దొర, మల్లుదొర, ఎండు పడాల్‌లను దళ నాయకులుగా నియమించాడు.
మల్లుదొర బలహీనతలు మద్యపానం, స్త్రీలోలత్వం. వీటికి దూరంగా ఉండాలని సీతారామరాజు తొలి నుంచీ హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఒకసారి తన ఇంటికి వెళ్లి వస్తానని రామరాజు అనుమతి కోరిన మల్లుదొర మధ్యలో ఒక తాటి చెట్టు ఎక్కి, కల్లు తనివితీరా తాగాడు. ఆ మత్తులో ఉన్న మల్లుదొరను చూసిన సిఐడి కూపీ లాగడం మొదలుపెట్టాడు. ఆ సిఐడిని మరొక విప్లవకారుడు కాల్చివేశాడు. మల్లుదొరను సీతారామరాజు ముందు హాజరుపరచగా, ఆయనను బహిష్కరించాడు. అనంతరం మల్లుదొర నడింపల్లి వెళ్లి ఓ మహిళ ఇంట్లో ఉండగా, పోలీసులు పట్టుకున్నారు. అనంతరం ద్వీపాంతర శిక్ష విధించి, అండమాన్‌ దీవులకు పంపించారు. స్వాతంత్య్రానంతరం మల్లుదొర పార్లమెంటు సభ్యుడయ్యాడు. మన్యం విప్లవ నాయకుల్లో స్వాతంత్య్రం వచ్చిన తరువాత జీవించింది ఆయన ఒక్కడే. బ్రిటీషు ప్రభుత్వం పదిమంది వీరులను కాల్చి చంపింది. 50 మందికి ద్వీపాంతరశిక్ష విధించింది. మరో 300 మంది మీద కేసులు పెట్టింది. ఇలామంది వీరులు మన్నెపోరాటం చేసి, తెలుగునాట సంచలనం సృష్టించారు.

- పోతుల మోహన సిద్ధార్థ్‌