Mar 05,2023 09:54
  •  కంపెనీ సీడ్స్‌తో తీవ్రంగా నష్టపోతున్న రైతులు
  •  నాణ్యత లేని సీడ్స్‌తో రెండు టన్నులూ రాని దిగుబడి
  •  సీడ్‌ కంపెనీలపై కొరవడిన ప్రభుత్వ పర్యవేక్షణ

ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి : 'నూజివీడు మండలం పోలసానిపల్లికి చెందిన రైతు వేముల వెంకట్రావు ఏడెకరాల్లో ఓ ప్రముఖ కంపెనీ ఇచ్చిన మొక్కజొన్న సీడ్స్‌ సాగు చేశాడు. ఎకరాకు నాలుగు నుంచి ఆరు టన్నుల దిగుబడి వస్తుందని కంపెనీ ప్రతినిధులు చెప్పి సీడ్స్‌ ఇచ్చారు. తీరా పంట చేతికొచ్చే సమయానికి ఎకరాకు రెండు టన్నులు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన రైతు వెంకట్రావు గుళికలు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు'.
'మొక్కజొన్స సీడ్స్‌కు చెందిన ఓ కంపెనీ ఇచ్చిన విత్తనాలను నూజివీడు మండలం గొల్ల పల్లి పరిసర ప్రాంత రైతులు సాగు చేశారు. నాలుగు టన్నులకుపైగా రావాల్సిన దిగుబడి కాస్తా టన్ను రావడమే గగనంగా మారడంతో రైతులు రోడ్డెక్కి 14 గంటలపాటు ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో నిరవధిక ధర్నా నిర్వహించారు.'
పైన పేర్కొన్న రెండు ఘటనలే కాదు.. కంపెనీలకు సంబంధించి సీడ్స్‌ సాగు చేసి నష్టపోయిన ఎంతోమంది రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. మొక్కజొన్న సీడ్స్‌ కంపెనీలపై ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడంతో వారు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లు పరిస్థితి తయారైంది. ఏలూరు జిల్లాలో దాదాపు లక్షల ఎకరాల్లో మొక్కజొన్నను రైతులు సాగు చేశారు. దీనిలో దాదాపు 65 వేల ఎకరాల్లో కంపెనీలు ఇచ్చిన సీడ్స్‌నే రైతులు సాగు చేశారు. సీడ్స్‌ ఇచ్చేటప్పుడు ఎకరాకు నాలుగు నుంచి ఆరు టన్నుల దిగుబడి వస్తుందని కంపెనీ ప్రతినిధులు రైతులకు చెప్పి అంటగడుతున్నారు. మూడు నెలల తర్వాత పంట చేతికొచ్చే సమయానికి రెండు టన్నులు కూడా రావడం లేదు. నిబంధనల ప్రకారం సీడ్స్‌ సాగు చేసిన రైతు నష్టపోతే విత్తనాలు ఇచ్చిన కంపెనీలే రైతులను ఆదుకోవాలి. ఎక్కడా అటువంటి పరిస్థితి లేకుండాపోయింది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వమేనని చెప్పొచ్చు. కంపెనీలు రైతులకు సీడ్స్‌ ఇచ్చేటప్పుడు అధికారులు జోక్యం చేసుకుని అగ్రిమెంట్లు రాయించే విధంగా చర్యలు తీసుకోవాలి. సీడ్స్‌ కంపెనీలపై అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. ప్రతియేటా రైతులు తీవ్రంగా నష్టపోతున్న సీడ్స్‌ కంపెనీలు తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నాయి. ఎంఎల్‌ఎలు, ఎంపీలు సైతం రైతుల గురించి పట్టించుకోకపోవడం సీడ్స్‌ కంపెనీల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. రైతు సంఘాలు జోక్యం చేసుకుని ఆందోళనలు చేస్తే తప్ప రైతులకు ఎంతోకొంత న్యాయం జరగని పరిస్థితి ఉంది. ప్రభుత్వ అధికారులు నష్టపోయిన రైతుల గురించి ఏమాత్రం పట్టించుకోని దుస్థితి నెలకొంది. నష్టపోయిన రైతులు కొన్నిచోట్ల ఆందోళనలకు దిగుతుండగా, మరికొన్నిచోట్ల సీడ్స్‌ కంపెనీల దురాగతాలను రైతులు మౌనంగా భరిస్తున్నారు. నూజివీడు మండలంలో జరిగిన ఘటనల్లో ఎపి రైతుసంఘం నాయకులు జోక్యం చేసుకుని రైతులకు ఎంతోకొంత న్యాయం జరిగేలా చేశారు. ఇప్పటికైనా రైతులతో అగ్రిమెంట్లు చేసే విధంగా సీడ్స్‌ కంపెనీలకు నిబంధనలు అమలు చేయకపోతే మొక్కజొన్న రైతుల పరిస్థితి మరింత దారుణంగా తయారు కానుంది. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని మొక్కజొన్న రైతులకు న్యాయం చేయాలని అంతా కోరుతున్నారు.

  • కమర్షియల్‌ పంట ధర ఆశాజనకం

జిల్లాలో దాదాపు 35 వేల ఎకరాల్లో మొక్కజొన్న కమర్షియల్‌ సీడ్‌ను రైతులు సాగు చేశారు. కొద్దిరోజుల్లో పంట చేతికిరానుంది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర మొక్కజొన్న కమర్షియల్‌ పంటకు క్వింటాకు రూ.1962 ఉండగా ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో క్వింటా రూ.2300 నుంచి రూ.2500 వరకూ పలుకుతోంది. పంట చేతికొచ్చే సమయంలో వ్యాపారులు ధర తగ్గించేస్తారేమోననే భయం రైతులను వెంటాడుతోంది. దీంతో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలనే అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. ప్రభుత్వ మద్దతు ధరకంటే బహిరంగ మార్కెట్లో ధర తక్కువగా ఉంటే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ఆలోచన చేసే పరిస్థితి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ ఇబ్బంది లేకపోయినా మున్ముందు ఇబ్బంది రాకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.