- మిలిటరీ తిరుగుబాటుపై పశ్చిమ దేశాల ఆందోళన
లిబ్రెవిల్లీ : గాబన్‌లో శాంతి, భద్రతల పునరుద్ధరించాలని చైనా పిలుపునివ్వగా, పశ్చిమ దేశాలు గాబన్‌లో మిలిటరీ తిరుగుబాటుపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఆఫ్రికన్ దేశాల్లో సైనిక తిరుగుబాట్లు 'పాశ్చాత్య దేశాల నయా వలసవాదానికి, వాటి ఉదారవాద విధానాలకు గట్టి ఎదురు దెబ్బ అని అంతర్జాతీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇదిలా వుండగా గాబోనీస్ మిలటరీ అధికారుల చేతిలో బందీగా ఉన్న అధ్యక్షుడు గాంబో గాబన్‌లో తన ప్రభుత్వాన్ని పునరుద్ధరించేందుకు సాయపడాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు.గాబన్‌లోని సీనియర్ సైనిక అధికారుల బందం బుధవారం అధికారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు మీడియా నివేదించిన వెంటనే, కొన్ని పాశ్చాత్య దేశాలు సైనిక తిరుగుబాటును ఖండించాయి. నైగర్ ప్రెసిడెంట్ మొహమ్మద్ బజూమ్‌ను ప్రెసిడెన్షియల్ గార్డు దళాలు బందీగా తీసుకున్న ఒక నెల రోజులకే గాబన్‌లో తిరుగుబాటు, ఆఫ్రికాలో పశ్చిమ దేశాల రాజకీయ సంస్కరణలు, పాలనా నమూనాల వైఫల్యాన్ని స్పష్టంగా ఎత్తి చూపిందని కొందరు చైనా నిపుణులు పేర్కొన్నారు. తిరుగుబాటు గురించి పశ్చిమ దేశాల ఆందోళన అంతా గాబన్‌లోని మానవ హక్కుల గురించి కాదు, తమ ప్రయోజనాలకు వ్యతిరేకమైన కొత్త ప్రభుత్వం అధికారం చేజిక్కించుకుందనే భయంతోనే అవి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని నిపుణులు పేర్కొన్నారు.