Oct 27,2023 09:21

తమిళనాడు రాష్ట్రంలో
కుంభకోణం పట్టణంలో
విఖ్యాత శాస్త్రవేత్త
స్వామినాథన్‌ జనియించె!

పువ్వు పుట్టగానే అది
పరిమళించు రీతిగా!
చిన్ననాటి నుండియే
ప్రతిభనతను చూపించే!

యువకుడుగా నున్నపుడే
బెంగాల్‌ క్షామం చూసి
ఆకలి బాధను తీర్చే
శాస్త్రవేత్తగా మారే!

అది మొదలుగ జీవితంలో
ప్రతి క్షణం కృషి చేసెను!
నూతన అధ్యయనానికి
వినూత్నంగా తెరతీసెను!

ఎక్కువ దిగుబడులిచ్చే
వంగడాలు కనుగొనెను!
హరిత విప్లవానికతను
ఆద్యుడుగా పేరొందెను! వరి, గోధుమ దిగుబడులు
గణనీయంగా పెరిగెను!
ఆహారవృద్ధిన మనం
సమృద్ధిని సాధించెను!
ఎన్నెన్నో పదవులంది
పదవులకే వన్నెతెచ్చె!
ఎన్నో అవార్డుల నొంది
చిర యశస్సును పొందే!

రైతు సంక్షేమమతని
జీవిత లక్ష్యం ఆయెను!
సేద్యరంగ అభివృద్ధి
ఆయన ఊపిరి ఆయెను!

మట్టి వాసన తెలిసిన
నేలతల్లి బిడ్డడతను!
అన్నదాత బతుకుల్లో
వెలుగులు పూయించెనతను!

జాతి గర్వించదగ్గ
గొప్ప పరిశోధకుడు!
యువతకు స్ఫూర్తినిచ్చే
నిత్య కృషీవలుడు!
అతని బాట ఆదర్శం
అతని లక్ష్యం సేద్యం
అతని ధ్యేయం సంక్షేమం
అతని జీవితమే సందేశం!
 

- రావిపల్లి వాసుదేవరావు,
విజయనగరం,
94417 13136.