May 21,2023 10:11
  • విద్యుత్‌ కోతలతో ఇబ్బందుల్లో రొయ్యల సాగు
  • డీజిల్‌ ఇంజన్లతో ఏరియేటర్లను నడపాల్సిన పరిస్థితి
  • ఉభయ గోదావరి రైతులపై రోజుకు రూ.8 కోట్ల అదనపు భారం

ప్రజాశక్తి - ఏలూరు, రాజమహేంద్రవరం ప్రతినిధులు : కరెంటు కోతలతో ఆక్వా రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంటను కాపాడుకోవాల్సి వస్తుండడంతో పెట్టుబడి వ్యయం పెరుగుతోంది. గత 15 రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని ఆక్వా రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే నిండా మునిగిపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్తు కోతలను నివారించి తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో లక్ష ఎకరాల్లో, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 55 వేల ఎకరాల్లో రొయ్యలు సాగవుతున్నాయి. వేసవిలో ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులతో రొయ్యల సాగు తీవ్ర ఇబ్బందిగా ఉంటుంది. రొయ్యల చెరువుల్లో ఆక్సిజన్‌ లెవెల్స్‌ తగ్గకుండా చూడాలి. ఇందుకోసం ఏరియేటర్లను నిరంతరం ఆన్‌లో ఉంచాలి. ఇవి ఆగిపోతే ఆక్సిజన్‌ లెవెల్స్‌ తగ్గి రొయ్యలు చనిపోతాయి. ప్రస్తుతం ప్రభుత్వం రోజూ సుమారు నాలుగు గంటలపాటు అనధికారికంగా విద్యుత్‌ కోత విధిస్తోంది. దీంతో, విద్యుత్‌ బదులు డీజిల్‌ జనరేటర్ల ద్వారా ఏరియేటర్లను నడపాల్సి వస్తోంది. ఇందుకు ఒక ఎకరాకు గంటకు ఒక లీటరు డీజిల్‌ వినియోగించాల్సి వస్తోంది. ప్రస్తుతం లీటరు డీజిల్‌ ధర రూ.100 ఉంది. దీనితోపాటు నిర్వహణ ఖర్చు రూ.30 కలిపి రూ.130 చొప్పున గంటకు అదనపు ఖర్చవుతోంది. నాలుగు గంటలకు సుమారు రూ.520 అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని ఆక్వా రైతులపై రోజుకు సుమారు రూ.8 కోట్ల భారం పడుతోంది. ఆక్వా మేత ధర పెరగడం, రొయ్యలకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంద కౌంట్‌ ధరను ప్రభుత్వం రూ.245కు కొనుగోలు చేయాలని నిర్ణయించినా ఎక్కడా అమలు కావడం లేదు. రొయ్యల సాగుకు ఎకరాకు రూ.4 లక్షలు పెట్టుబడి అవుతుంది. వంద రోజుల్లో పంట చేతికొస్తుంది. ప్రస్తుతం ఉభయగోదావరి జిల్లాల్లో అత్యధిక పంట 50 నుంచి 60 రోజుల మధ్యలో ఉంది. గతేడాది నవంబరులో అధిక వర్షాలు, డిసెంబర్‌, జనవరిలో విపరీతమైన చలి కారణంగా వైరస్‌లు విజృంభించాయి. వేల ఎకరాల్లో రొయ్యల పంట నష్టాల బాట పట్టింది. ఈ నేపథ్యంలో గంపెడాశలతో రైతులు వేసవి సాగును ప్రారంభించగా విద్యుత్‌ కోత గోరు చుట్టుపై రోకలిపోటులా మారింది. సాగు ఖర్చు పెరుగుతుండడంతో తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు 4 గంటలు విద్యుత్‌ కోత

రోజుకు 4 గంటలు రాత్రి వేళల్లో విద్యుత్తు కోత విధిస్తున్నారు. ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని రొయ్యలు సాగు చేస్తున్నాను. విద్యుత్తు కోత వల్ల రొయ్యలను బతికించుకోవడానికి రోజుకు రూ.2,600 అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేసి రొయ్యల సాగు రైతులను ఆదుకోవాలి.
                 -బి. శ్రీనివాస్‌, తాళ్లరేవు, కాకినాడ జిల్లా

image

                                                            పంటను కాపాడుకోవడం కష్టమవుతోంది

కరెంటు కోతలతో రొయ్యల పంటను కాపాడుకోవడం కత్తిమీదసాములా మారింది. పదెకరాల్లో సాగు చేస్తున్నాను. రొయ్యలకు సరైన ధర లేక ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు అదనంగా డీజిల్‌ ఖర్చుతో పెట్టుబడి వ్యయాన్ని రైతులు భరించలేకుండా ఉన్నారు.
                                                                                                          - అడ్డాల వంశీరాజు,
                                                                                                  కాళ్లకూరు, పశ్చిమ గోదావరి జిల్లా