Oct 09,2023 10:25

గగన వీధిలో గువ్వలు గూటికి
చేరే సమయాన
పడమట సూర్యుడు సంధ్య రాగం
పాడే తరుణాన
నీలి మబ్బులు గాలికి అటు నిటు
ఊగుతున్నవోయి
మబ్బుల రాపిడి మధ్యన మెరుపులు
తళుకు మన్నవోయి
చిట పట మంటూ వాన జల్లుగా
జాలువారెనోయి
గంట మ్రోతకై బడి పిల్ల గాళ్ళు
వేచి వున్నరోయి
గణగణ మని బడి గంట మ్రోగేను
పిల్లలందరూ పరుగున సాగెను
ఆకశాన హరివిల్లు విరిసెను
ఆవుల మందలు ఇంటికి నడిచెను
మట్టి వాసనలు గుప్పున ఎగిసెను
జాబిలి అప్పుడే తొంగి చూసేను
చీకటి వెలుగులు కలిసే సమయం
పల్లె అందాలు మెరిసే తరుణం
చూడాలండి ఓ మారు
చూస్తే మరచి పోలేరు

- కూచిమంచి నాగేంద్ర
91821 27880.