Oct 16,2023 11:15

అమెరికా : గాజాలో ఇజ్రాయెల్‌ బలగాలు సుదీర్ఘకాలం ఉంటే అది పెద్ద పొరపాటుగా మారుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అభిప్రాయపడ్డారు. హమాస్‌-ఇజ్రాయెల్‌ భీకర పోరు నేపథ్యంలో ... ఇజ్రాయెల్‌ సైనిక దళాలు గాజాను చుట్టుముట్టాయి. ఈ సందర్భంగా సీబీఎస్‌ న్యూస్‌ సంస్థతో మాట్లాడుతూ బైడెన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

గాజాను సుదీర్ఘకాలం పాటు ఇజ్రాయెల్‌ తన ఆధీనంలో ఉంచుకొంటుందని తాను భావించడంలేదన్నారు. అంతకంటే పాలస్తీనీయుల ఆధ్వర్యంలో అక్కడి పాలన నిర్వహించాలని కోరారు. ఒక వేళ సుదర్ఘీకాలం గాజాలోనే ఇజ్రాయెల్‌ దళాలు ఉంటే అది పెద్ద పొరబాటుగా మారుతుందన్నారు. '' ప్రస్తుతం గాజా పరిస్థితి చూడండి.. అక్కడ ఉన్న అతివాద హమాస్‌ శక్తులు మొత్తం పాలస్తీనా ప్రజలకు ప్రాతినిధ్యం వహించవు '' అని చెప్పారు. యుద్ధాల్లో పాటించాల్సిన నిబంధనలను ఇజ్రాయెల్‌ అమలు చేస్తుందని తాము నమ్ముతున్నట్లు చెప్పారు. అమాయక పౌరులకు నీరు, ఆహారం, ఔషధాలు అందేట్లు చూడాలని బైడెన్‌ సూచించారు.

బైడెన్‌ ఇజ్రాయెల్‌ను సందర్శిస్తారన్న ప్రచారంపై శ్వేతసౌధం నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ ప్రతినిధి మాట్లాడుతూ ... '' మీకు చెప్పేందుకు ఇప్పటివరకు అలాంటి ప్రతిపాదన ఏమీ లేదు '' అని తెలిపారు. ఈ దిశగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఆదివారం కూడా జోబైడెన్‌ ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూతో ఫోన్‌లో మాట్లాడారు. హమాస్‌ దాడుల తర్వాత ఆయన ఇజ్రాయెల్‌ ప్రధానితో మాట్లాడటం ఇది ఐదోసారి.