Aug 09,2023 08:37

వారి అందమైన కలలన్నీ చెదిరిపోయాయి. ఉన్న ఊళ్లు భస్మీపటలం అయ్యాయి. కుటుంబ సభ్యులందరూ చెల్లాచెదురైపోయారు. ద్వేషం విషమై విస్తరించి, వారి బతుకులను అల్లకల్లోలం చేసింది. రాత్రికి రాత్రే వారు తమ సర్వస్వాన్ని అక్కడే వదిలేసి, కేవలం కట్టుబట్టలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని - దొరికిన రైళ్లు, బస్సులూ ఎక్కి, ఎక్కడెక్కడికో చెదిరిపోయారు. అలా రక్షణ లేని తమ సొంత రాష్ట్రం నుంచి కొంతమంది హైదరాబాదుకు తరలివచ్చారు. అవును.. ఇది మణిపూర్‌ ఆదివాసీలు కుకీల కన్నీటి వలస కథ. గుండె చెదిరే బతుకు వ్యథ.

హైద్రాబాద్‌ ఉనౌ ఆదివాసీ ఫోరమ్‌ లెక్కల ప్రకారం మణిపూర్‌ నుంచి 19 కుటుంబాలకు చెందిన 130 మంది సభ్యులు హైద్రాబాద్‌లో తలదాచుకున్నారు. ఇక్కడ ఉన్న బంధువులతో కొంతమంది అనుసంధానమైతే.. మరికొంతమందిని కుకీ స్టూడెంట్‌ ఆర్గనైజేషన్‌, కుకీ వర్షిప్‌ సర్వీస్‌, తెలంగాణ యునైటెడ్‌ క్రిస్టియన్స్‌ అండ్‌ పాస్టర్స్‌ అసోసియేషన్‌, ఇతర స్వచ్ఛంద సంస్థలు అక్కున చేర్చుకున్నాయి.

Lives-with-shattered-dreams


ఖైలాల్‌తంగ్‌ ... 23 ఏళ్ల యువకుడు. మే 4వ తేదీ తెల్లవారు జామున తమ ఊరి మీదికి మూక దాడి జరగబోతుందని తెలిసి, తొలుత సమీప అడవిలోకి పారిపోయాడు. జూన్‌ 14 వరకూ పునరావాస కేంద్రంలో తల దాచుకున్నాడు. పరిస్థితి మెరుగుపడే సూచన కనపడకపోవడంతో- ఇంకెక్కడికైనా వెళ్లి ఉపాధి పొందాలి అనుకున్నాడు. ఏం చేయాలో తోచని స్థితిలో రోడ్డు మీద వేచి చూస్తుంటే- ఓ ట్రక్కు డ్రైవరు జాలిపడి ఉచితంగా మిజోరం వరకూ తీసుకొచ్చాడు. ఖైలాల్‌తంగ్‌ అక్కడి నుంచి బయల్దేరి జులై 3న హైదరాబాదు చేరుకున్నాడు. సొంతూరు నుంచి ప్రాణభయంతో బయల్దేరినప్పుడు ఓ పొట్టి నిక్కరు, టీ షర్టు వేసుకొని ఉన్నాడు. ఆ హడావిడిలోనూ ఆధార్‌ కార్డు, కొన్ని ముఖ్యమైన సర్టిఫికెట్లు తన వెంట తెచ్చుకున్నాడు. మే 4న తమ ఊరిపై జరిగిన మూకదాడి దృశ్యం ఇంకా భయం భయంగా కనిపిస్తూనే ఉంది.
         ''మే 4 తెల్లవారుజాము 3 గంటల సమయంలో మెయితీ గుంపు మా ఊరిపై దాడి చేసింది. ఆ దాడిలో మా ఇల్లు పూర్తిగా కాలిపోయింది. అంతకుముందు రోజు రాత్రే.. మేం హాస్పటల్‌ నుంచి ఇంటికి చేరుకున్నాం. మా అమ్మకు డయాలసిస్‌ చేయించుకుని వచ్చేసరికి రాత్రి 11 అయ్యింది. అప్పటికే గ్రామంలో మెయితీ గుంపు దాడికి తెగబడబోతుందని మాకు సమాచారం వచ్చింది. రాత్రికి రాత్రే గ్రామంలోని మహిళలను, పెద్దవాళ్లను, పిల్లలను కొండల్లోకి పంపించేశాం. 160 కుటుంబాలు ఉన్న మా గ్రామంలో అప్పుడు యువకులు, పురుషులు మాత్రమే మిగిలారు. కర్రలు, ఆయుధాలు చేతబట్టిన గుంపు గ్రామంలోకి ప్రవేశించింది. వాళ్లను అడ్డుకునేందుకు మా దగ్గర ఏ ఆయుధమూ లేదు. జంతువులను, పక్షులను వేటాడే.. వడిసెల మాత్రమే మా ఆయుధం. దాంతో ఎంతవరకు పోరాడుతాం? తరువాత పారిపోవాల్సి వచ్చింది.
           ఊరికి దూరంగా పారిపోయి, అక్కడి నుంచి చూస్తుంటే- ఊరు తగలబడిపోతూ కనిపించింది. కొండల్లో, పొదల్లో దాక్కున్న గ్రామస్తులు కాలిపోతున్న తమ ఇళ్లను చూసి ఏడుస్తూనే ఉన్నారు. ఆ గుంపు గ్రామం వదిలి వెళ్లేదాకా అక్కడే దాక్కున్న మేమంతా ఆ తరువాత మంటల్లో కాలిపోయిన తమ ఇళ్లల్లో మిగిలివున్న వస్తువుల కోసం పరుగులు పెట్టారు. కానీ, గ్రామంలో మాకంటూ ఏమీ మిగల్లేదు. మా ఆనవాళ్లు అన్నీ తుడిచి పెట్టుకుపోయాయి. ఆశ చంపుకోలేక కాలిపోగా మిగిలిన చిన్న చిన్న వస్తువులను సేకరిస్తూ, సాయంత్రం 6 గంటలప్పుడు ఒకచోటకు చేర్చాం.
 

Lives-with-shattered-dreams

                                                                      అప్పుడే ఆ మహిళ వచ్చింది ...

చుట్టుపక్కల కుకీల గ్రామాలన్నీ ఆరోజు అలాంటి దారుణమైన దాడులకే గురయ్యాయి. పట్టుబడ్డ కుకీలను హింసించారు. అలా దాడికి గురైన ఓ మహిళ చిరిగిన బట్టలతో, ఒంటినిండా గాయాలతో ఏడుస్తూ మా గ్రామం వైపు వచ్చింది. ఆమె తీవ్ర అవమానానికి గురైన మహిళల సమీప బంధువని తెలిసింది. తరువాత ఆమెతో పాటు మా ఊరి బాలింతలు, గర్భిణీలు, పిల్లలు, పెద్దలు, అందరం గ్రామం వదిలి అడవిగుండా రెండు రోజులపాటు ప్రయాణించాం. కొండలు, గుట్టలు ఎక్కి దిగుతూ వచ్చిన మాకు మచ్చి బ్లాకులోని 'కుకీ స్టూడెంట్స్‌ ఆర్గనైజేషన్‌' (కెఎస్‌ఒ) రక్షణ ఇచ్చింది. కాంగ్పోక్పి, లంకా జిల్లాలోని పునరావాస కేంద్రాలకు తరలించింది. తరువాత నేను అక్కడి నుంచి మిజోరామ్‌కు, ఆ తరువాత హైద్రాబాద్‌కి చేరుకున్నాను.
          ఇక్కడ ఉదయం నిద్ర లేవగానే రోడ్ల నిండా జనం కనిపిస్తున్నారు. ఎన్నో నిద్రలేని రాత్రులు తరువాత ఇప్పుడు కొంత ప్రశాంతంగా జీవిస్తున్నాను. అక్కడ రోజు కూలీగా పనిచేస్తూ అనారోగ్యంతో ఉన్న అమ్మానాన్నను చూసుకునేవాడ్ని. ఊరు వదిలి బయటకి రావడం ఇదే మొదటిసారి. ఇక్కడ ఓ ఫైనాన్షియల్‌ కంపెనీలో చిన్న ఉద్యోగంలో చేరాను. ఈ జీతంతో అమ్మానాన్నను చూసుకుంటూనే, తమ్ముడిని స్కూలికి పంపిస్తాను.''
        అతడిని విద్వేషంతో ఒక మూక చేసిన గాయం బాధిస్తూనే ఉంది. కానీ, ఆ చేదు జ్ఞాపకాలను దాటుతూ, కుటుంబాన్ని పోషించాలనే తపన అతడిని ఆశతో జీవించేలా చేస్తోంది.

Lives-with-shattered-dreams

                                                                             టీచర్ల వలసబాట

ను చిన్‌చిన్‌, పా లునా కొత్త జంట. హైస్కూల్‌ టీచర్లుగా ఇంగ్లీషు, లెక్కలు బోధిస్తూ భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నారు. కానీ, మణిపూర్‌ కల్లోలంలో బతుకుతెరువు కోసం హైద్రాబాద్‌ చేరాల్సి వచ్చింది. పొదుపు చేసిన సొమ్ము రూ.45 వేలు తమ వెంట తెచ్చుకున్నారు. ప్రయాణ ఖర్చులు, ఇంటిఅద్దె పోను ఇప్పుడు నెలకు రూ.5 అధిక వడ్డీకి రూ.52 వేల అప్పులో ఉన్నారు. చిన్‌చిన్‌ ఓ ఈ కామర్స్‌ సంస్థలో మరో వారం రోజుల్లో ఉద్యోగంలో చేరనుంది. సికింద్రాబాద్‌లో ఓ సర్వీస్‌ సంస్థకు దరఖాస్తు చేసిన లూనాకి ఇంకా ఆఫర్‌ లెటర్‌ రాలేదు.
 

                                                               వీరోచిత సుబేదార్‌ ఇప్పుడు ఓ వలసదారు

అస్సాం రెజిమెంట్‌ కుకీ ఆఫ్‌ బోంగ్బాల్‌ ఖులెన్‌ గ్రామంలో రిటైర్డ్‌ సుబేదార్‌ మేజర్‌ లెత్కోథంగ్స్‌ది ఇప్పుడు ఒక విషాద గాధ. మే 5న తన గ్రామాన్ని రక్షించుకునేందుకు ఆయన చాలా ప్రయత్నం చేశాడు. తన దగ్గరున్న డబుల్‌ బేరల్‌ ఆయుధంతో మరో 30 మంది గ్రామస్తుల తోడ్పాటుతో ... గ్రామంపై దాడికి వచ్చిన గుంపును చెదరగొట్టాడు. తరువాత ఆ గుంపు బలం పెరిగింది. 'ఆర్మీ యూనిఫామ్‌లో 8 జీపుల్లో వచ్చి ఊరి మీద పడ్డారు. అప్పటివరకు పోరాడిన మేము, ఆ క్షణం మా వాళ్లని రక్షించుకునేందుకు పరుగులు పెట్టాం. మహిళలను, పిల్లలను, పెద్దవాళ్లను కొండల్లోకి తరలించాం. అడవిలో రెండు రోజులు గడిపాం' అని చెబుతున్నప్పుడు ఆయన గొంతులో తీవ్ర ఆవేదన ధ్వనించింది.
             ఆయన కుమార్తె హైద్రాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా చేస్తోంది. ఆమె దగ్గరకు ఆయన కుటుంబం చేరుకుంది. సుబేదార్‌ మేజర్‌ తనరిటైర్‌మెంట్‌ డబ్బుతో గ్రామంలో రూ.40 లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. మెయితీ గుంపు దాడిలో అది పూర్తిగా ధ్వంసమైంది. ఇల్లు కూలిపోయిందని బాధ ఉన్నా, గ్రామస్తులను కాపాడానన్న సంతోషం ఆయన కళ్లల్లో కనపడుతోంది.
           ... ఇలా చెల్లాచెదురైపోయిన మణిపూర్‌ బాధితులందరూ సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారన్న ఆశ లేదు. ఎన్ని కుటుంబాలు పూట గడవక పస్తులు ఉంటున్నాయో! ఎంతమంది బిడ్డలు చదువులు ఆగిపోయి రోడ్డున పడ్డారో..! అమ్మానాన్నను వదిలి ఎంతమంది పిల్లలు అనాథలయ్యారో.. !

(ది హిందూ సౌజన్యంతో...)
ఖైలాల్‌తంగ్‌