Oct 01,2023 21:42

ప్రజాశక్తి - కాకినాడ :బ్లూ ఏకానమీ అమలైతే మత్స్య సంపదపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులు, మత్స్యకార్మికులు జీవితాలు చిధ్రం అవుతాయని మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లాటి శ్రీనివాస్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం కాకినాడ యుటిఎఫ్‌ భవన్‌లో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా నవంబర్‌లో కాకినాడలో జరిగే జాతీయ సమావేశాల ఏర్పాట్లను సమీక్షించారు. అనంతరం శ్రీనివాస్‌ మాట్లాడారు. విదేశీ బహుళ జాతి కంపెనీలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిలాఖత్‌ అయి సముద్రతీరాన్ని ముక్కలుగా చేసి 100 మీటర్లు లోతులో ఉన్న ఇల్మానైట్‌, మోనోసైట్‌, గార్నెట్‌ సహా 138 మిలియన్‌ రకాల ఖనిజ లోహాలు, సున్నపు రాయి, పగడపు దిబ్బలను వెలికి తీయనున్నాయన్నారు. ఇదే జరిగితే మత్స్యసంపద నాశనమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని తెలిపారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. మన రాష్ట్రంలో కొత్త మోటరైజ్‌డ్‌ బోట్లకు రిజిస్ట్రేషన్‌ చేయడం లేదన్నారు. సముద్రంపై చేపల వేటకు వెళ్లే ప్రతి ఒక్కరికీ వేట నేషధ కాలంలో భృతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పోర్టులు, ఫిషింగ్‌ జెట్టీల పేరుతో మత్స్యకార గ్రామాలను రాష్ట్ర ప్రభుత్వం ఖాళీ చేయిస్తోందని, అందుకు తగ్గ ప్రత్యామ్నాయం చూపించడం లేదన్నారు. సంఘం జాతీయ కమిటీ సభ్యులు సిహెచ్‌.రమణి మాట్లాడుతూ.. మత్స్యకార సొసైటీలకు రుణాలు, ఐస్‌ బాక్సులు, మోటార్‌ సైకిల్‌ రుణాలను ప్రభుత్వం నిలిపేసిందని, వెంటనే వీటిని మంజూరు చేయాలని కోరారు. మత్స్యకారుల సమస్యలపై ఇప్పటికైనా ప్రభుత్వం స్పష్టమైన హామీలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పిఎం విశ్వకర్మ యోజన పథకం కింద 18 రకాల వృత్తుల వారికి రూ.మూడు లక్షలు ఇస్తామని కేంద్రం ప్రకటించిందన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌ను కొద్ది రోజుల్లోనే క్లోజ్‌ చేశారని తెలిపారు. పూర్తి సబ్సిడీతో ప్రతి కుటుంబానికీ రూ. మూడు లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించి మత్స్యకారుల జీవన ప్రమాణాలకు అనుగుణంగా నిర్ణయాలు చేయడానికి జాతీయ సమావేశాల్లో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.