- సింగపూర్ కంపెనీకి సంబంధాలు
- హిండెన్‌బర్గ్ వెల్లడి
న్యూఢిల్లీ : అదానీ గ్రూపునపై హిండెన్‌బర్గ్ మరో బాంబ్ పేల్చింది. దేశంలో సంచలనం సృష్టించిన రూ.3,600 కోట్ల అగస్టా వెస్ట్‌ల్యాండ్ వివిఐపి హెలిక్యాప్టర్ల కుంభకోణం కేసుతో అదాని గ్రూపునకు సంబంధాలున్నాయని పేర్కొంది. ఈ కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దాఖలు చేసిన మొదటి ఛార్జిషీట్, రెండవ అనుబంధ ఛార్జిషీట్‌లోనూ చేర్చిన సింగపూర్‌కు చెందిన కంపెనీ అదానీ గ్రూప్ సంబంధిత సంస్థ అని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికలో పేర్కొంది. కాగా.. 2018లో ఇడి దాఖలు చేసిన మూడో చార్జిషీట్‌లో అనుహ్యాంగా ఆ పేరును తొలగించారని వెల్లడించింది. సింగపూర్‌లోని అధికారులు పంపిన లేఖ ఆధారంగా ఆ స్కామ్ నుంచి పేరును తొలగించారని సమాచారం.
సింగపూర్ కేంద్రంగా పని చేస్తున్న గుడామి ఇంటర్నేషనల్ పిటిఇ సంస్థ అదాని ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ సంబంధిత సంస్థగా ఉంది. అదాని ఎక్స్‌పోర్ట్స్ కంపెనీనే 2002లో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌గా మార్చుతూ ఆ కంపెనీ బిఎస్‌ఇకి సమాచారం ఇచ్చింది. గుడామి ఇంటర్నేషనల్ కంపెనీలో అదానికి చెందిన డైరెక్టర్ కీలక వాటాదారులుగా ఉన్నారు. గుడాని ఇంటర్నేషనల్ కంపెనీ నిలిచిపోయిందని, పొరపాటున పేరు ఇచ్చామని 2017లో సింగపూర్ అధికారులు లేఖ ఇచ్చారు. దీంతో ఇడి తన ఛార్జ్‌షీట్ నుంచి అదాని సంబంధిత కంపెనీ పేరును తొలగించడం విశేషం.
అగస్టావెస్ట్‌ల్యాండ్ వివిఐపి హెలికాప్టర్ కేసులో 2014లో ఇడి దాఖలు చేసిన తొలి చార్జిషీట్‌లో సింగపూర్‌కు చెందిన కంపెనీ పేరు ఉంది. ప్రధాన నిందితుడు గౌతమ్ ఖైతాన్ కన్సల్టెన్సీ సర్వీసెస్‌తో నకిలీ ఇన్‌వాయిస్‌లను పెంచడం ద్వారా గుడామి వ్యాపారం చేస్తున్నాడని ఛార్జిషీట్ ప్రధానంగా ఆరోపించింది. 2017లో దాఖలు చేసిన రెండవ అనుబంధ ఛార్జిషీట్‌లో కూడా గుడామి ఇంటర్నేషనల్ పిటిఇ లిమిటెడ్‌ను ప్రస్తావించింది. మధ్యవర్తి రాజీవ్ సక్సేనాపై దాఖలు చేసిన ఈ ఛార్జిషీట్‌లోనూ ఆ కంపెనీల గురించి మరోసారి చేర్చింది. ఖైతాన్‌పై 2009లో ఇడి అధికారులు దాడి చేసినప్పుడు ఆ సమయంలో ఆ కంపెనీ ఉద్యోగి నుండి ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకుంది. ఫోరెన్సిక్ పరీక్షలో గుడామితో సహా డొల్ల కంపెనీల ద్వారా నిధులు పొందిన అనేక కంపెనీల పేర్లను గుర్తించారు. అగస్టావెస్ట్‌ల్యాండ్ స్పా 2.43 కోట్ల యూరోలను ట్యునీషియా ఆధారిత కంపెనీ ఐడిఎస్ టాన్సియాకు బదిలీ చేసింది. ఇందులోంచి 1.24 కోట్ల యూరోలను కైతాన్‌కు చెందిన ఇంటెర్‌స్టెల్లర్ టెక్నలాజీస్‌కు బదిలీ చేయబడ్డాయి. ఇంటర్‌స్టెల్లర్ నగదు తీసుకోవడం, చెల్లింపుల ఆధారంగా చేసుకుని ఇడి ఛార్జిషీట్‌లో చేర్చింది.










