ప్రకాశం : ఇప్పటికే నిత్యావసరాల ధరలను అందుకోలేక కుదేలవుతోన్న సామాన్యుల నెత్తిపై మరో 'గ్యాస్'బండ పడింది. డొమెస్టిక్, కమర్షియల్ గ్యాస్ ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అమాంతం పెంచేశాయి. నవంబర్ 1 నుండి గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచుతున్నట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ... పేదవారి చూపులు కట్టెల పొయ్యి వైపే చూస్తున్నాయి..!
కట్టెలతో వంట చేసే గ్రామాల్లో సైతం వంట గ్యాస్ వచ్చేసింది.. కానీ ఇప్పుడు పెరిగిన గ్యాస్ ధరల దెబ్బకు మళ్లీ ఆ గ్రామాలన్నీ కట్టెల పొయ్యిల వైపే మొగ్గు చూపుతున్నాయి. పెరిగిన నిత్యావసర ధరలను తట్టుకోలేక ఇప్పటికే పేదవారు చతికిలపడిపోతున్నారు. ఇప్పుడు వంటింటి గ్యాస్ ధరలు కూడా పెరగడంతో ... వారు కట్టెల పొయ్యే మంచిదంటూ.. మళ్లీ కట్టెల బాటపడుతున్నారు. ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండల కేంద్రంలోని పేద మహిళలంతా కట్టెలు కొట్టుకొని నెత్తిన పెట్టుకొచ్చుకుంటున్నారు. కారణమేంటని అడిగితే... గ్యాస్ బండ ధరలను మోసే శక్తి లేక కట్టెలను మోసుకుంటున్నామని బదులిచ్చారు..! పెంచిన గ్యాస్ బండ ధర భరించలేని పేద మహిళలు పొలంకు వెళ్లి వంట చెరుకు కట్టెలు తెచ్చుకుంటున్న దృశ్యం హనుమంతునిపాడు మండల కేంద్రంలోని పేదల దుస్థితిని తెలియజేస్తుంది.
పెంచిన రేట్లు...
19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరను ఏకంగా రూ. 101.50 పెంచుతున్నట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. ఈ కొత్త గ్యాస్ సిలిండర్ రేట్లు నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని సదరు చమురు మార్కెటింగ్ కంపెనీలు తెలిపాయి. ధరల పెరుగుదల అనంతరం ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ. 1833 గా ఉంది. అలాగే కోల్ కత్తాలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ. 1943 గాను, ముంబై లో రూ. 1785 గాను, అదే బెంగళూరులో రూ. 1914.50 గాను, ఇక చెన్నైలో రూ. 1999.50 గా ఉంది. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, హైదరాబాద్ లో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ. 2059.50 గాను, అలాగే విజయవాడలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ. 1991.50 గా ఉంది.










