ప్రజలకు హాని చేస్తున్న బిజెపిని ఓడిద్దాం : దేశ రక్షణ భేరి ప్రచారంలో సిపిఎం నేతలు
ప్రజాశక్తి-యంత్రాంగం : దేశ రక్షణ భేరి పేరుతో సిపిఎం తలపెట్టిన ప్రచారోద్యమం శనివారమూ కొనసాగింది. బిజెపి నిరంకుశ విధానాలను ప్రజలకు వివరిస్తూ ఆ పార్టీ నేతలు రాష్ట్రంలో పలు చోట్ల బైక్ ర్యాలీలు, పాదయాత్రలు చేస్తూ విస్తృత ప్రచారం చేశారు. బిజెపి నుంచి దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడుకోటానికి ప్రజలందరూ ఐక్యమై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. దేశ రక్షణ భేరి ముగింపు సందర్భంగా నంద్యాలలో ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించారు. ముందుగా పద్మావతి సర్కిల్ నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. అనంతరం మున్సిపల్ కార్యాలయం ఎదుట జరిగిన బహిరంగ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. మోడీ పాలనలో రెండు లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మేస్తున్నారని, ప్రజాధనాన్ని కార్పొరేట్లకు కారు చౌకగా కట్టబెట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేశారని తెలిపారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే బిజెపి నుంచి దేశాన్ని కాపాడుకోవాలని, ప్రజలంతా ఐక్యమై దేశ రక్షణ కోసం బిజెపిని ఓడించాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలంలో శెట్టి బలిజపేట, కేశనకుర్రు, మురమళ్ల గ్రామాల్లో ఆటో ప్రచారం నిర్వహించారు. 26న అమలాపురంలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో ప్రదర్శనగా వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. విశాఖ జిల్లా గాజువాకలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు వారపు సంతలో గిరిజనులకు కరపత్రాలు పంపిణీ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు, పాచిపెంట, సీతానగరం మండలాల్లో జీపు జాతా చేపట్టారు. విజయనగరం జిల్లా వేపాడ, నెల్లిమర్ల, కొమరాడ, పాలకొండ మండలాల్లో ప్రచారం నిర్వహించారు. శ్రీకాకుళంలోని రారునగర్ కాలనీ, లక్ష్మణ కూడలి, లావేరు, మందస, సోంపేట, వజ్రపుకొత్తూరు మండలాల్లో పాదయాత్ర చేశారు. చిత్తూరులో బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రకాశం జిల్లా కొండపి, టంగుటూరు, త్రిపురాంతకం, కంభంలో విస్తృత ప్రచారం చేశారు.










