Nov 19,2023 12:08

ప్రతి విషయాన్నీ పెద్దలం కదా.. అన్నీ మనకే తెలుసు అనుకుంటాం.. పిల్లల సమస్యలు కూడా వాళ్లు చెప్పకుండానే మనమే కనిపెట్టగల వాస్కోడీగామాలమని మనకు మనమే సర్టిఫై చేసేసుకుంటాం. కానీ ఎప్పుడైనా పిల్లలతో మనసు విప్పి మాట్లాడారా.. వాళ్లు ఏం చెప్పదలచుకున్నారో.. ఏం చెప్పాలనుకుంటున్నారో.. చెప్పనిచ్చారా? అంటే లేదనేదే ఎక్కువమంది నుంచి వచ్చే జవాబు. అందుకే పిల్లలు చెప్పేదీ విందాం.. అని చెప్తున్నారు నిపుణులు.
పిల్లలు ఒకసారి మనం చేసి పెట్టిన పదార్థం నచ్చి ఇష్టంగా తింటే.. ఇక వాడికదే ఇష్టమని మనం ఫిక్స్‌ అయిపోతాం. కానీ పిల్లలు పెరిగే క్రమంలో విభిన్న రుచులను ఆస్వాదిస్తారు. వాళ్ల ఇష్టాయిష్టాలు మారుతూ ఉంటాయి. అది తెలుసుకోకుండా.. వాళ్లెప్పుడో ఇష్టంగా తిన్నారు కదా అని పదే పదే అదే చేసిపెడితే.. వాళ్లకి నిజంగా ఇష్టమున్నా మొహంమొత్తి, దాని జోలికే పోరు. అసలు వాళ్ల ఇష్టాయిష్టాలు ఏమిటో ఒకసారి మాట్లాడాలి కదా.. వాళ్లను చెప్పనివ్వాలి కదా.. అప్పుడు వాళ్లకిష్టమైనవి ఏమిటో తెలుసుకోగలుగుతాం. ఇంకొంతమంది అయితే అలా చేయడం ఏదో వాళ్లకి కావాల్సినవి డిమాండ్‌ చేసేలా తయారుచేస్తున్నాం అనుకుంటారు. 'ఏంటి వాళ్ల బోడిష్టం.. అలా అడిగితే మనమే అలుసైపోతాం. కూసింతోళ్లు కూడా రుచులు కోరుతూ ఉంటే ఇక మన పరిస్థితి ఏమిటి? ఏది చేస్తే అది తినాలిగానీ.. ఇలా ఇష్టాలు అంటూ గారాబం చేసి, మనం చెడగొట్టడమే!' అంటారు. వాస్తవానికి పిల్లలు వాళ్లని సంప్రదించి చేయడం వల్ల.. మన పట్ల వాళ్లకి బోలెడంత ప్రేమను పెంచేలా చేస్తుంది. అనుబంధాలు కూడా బలపడతాయి. మనల్ని కూడా వాళ్లు అలాగే అప్రోచ్‌ అవ్వాలనే విషయం తెలుసుకుంటారు.

  • మార్కుల విషయంలో..

చదువు విషయంలో వాళ్లకు మార్కులు ఎక్కువ వస్తే.. ఉబ్బితబ్బిబ్బు కావడం.. చాక్లెట్స్‌, వాడు అడిగినప్పుడు కొననివి కొనిపెట్టడం చేస్తుంటారు. అదే మార్కులు సరిగా రాక, క్లాసులో వెనకబడిపోతే మాత్రం.. 'నువ్వొక మొద్దువి. నీకు ఎంతేసి ఫీజులు కడుతున్నామో.. నీ మొహానికి అక్షరం ముక్క రాదు.. ఆ పక్కింటి పిల్ల చూడు.. ఎదురింటి అబ్బాయి ఫస్ట్‌ వచ్చాడు' ఇలా మాటల దాడి చేసేస్తాం. ఇవి రెండూ సరైనవి కాదు. వాళ్లకు మార్కులు వచ్చినప్పుడు, రానప్పుడు పూర్వాపరాలు పరిశీలించుకోవాలి. చదువు విషయంలో వాళ్లు క్లాసులో ఎలా ఉంటున్నారు? ఇంటికి వచ్చాక చదువుకునేటప్పుడు ఎలా చదువుతున్నారు? క్లాసులో టీచర్‌ చెప్పేది ఫాలో అవుతున్నారా? లేదా? పాఠం అర్థం అవుతుందా? లేదా? బోర్డుపై రాసినవి కనిపిస్తున్నాయా? లేదా? ఇలాంటి విషయాలన్నీ పిల్లలతో పేరెంట్స్‌ మాట్లాడితేనే తెలిసేది. ఆ విధమైన ఇంటరాక్షన్‌ పేరెంట్స్‌కూ, పిల్లలకూ మధ్య ఉండాలి. అప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయి.

  • పేచీలు పెడుతుంటే..

పిల్లలు పేచీలు పెడుతుంటే.. విసుక్కోవడం తక్షణం పెద్దలు నుంచి వచ్చే రియాక్షన్‌. కానీ పేచీలకు కారణమేమిటో.. చూసిందల్లా కొనిపెట్టమని ఎందుకు డిమాండ్‌ చేస్తున్నారో.. పేరెంట్స్‌ ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? వాళ్ల పట్ల మీ శ్రద్ధ తగ్గిందా? తమ్ముడో, చెల్లో వచ్చాక వాళ్లతోనే ఎక్కువసేపు గడుపుతున్నారనే ఫీలింగ్‌ వాళ్లల్లో కలుగుతుందా? కారణాలు ఏమిటో తెలుసుకోవాలి. అంతేగానీ పిల్లల్ని కసిరేసుకోవడం, ఇంకొందరైతే చెయ్యి కూడా చేసుకుంటారు. అది ఎంతమాత్రం తగని పని.

  • కథలు.. కబుర్లు..

పిల్లలకి తప్పనిసరిగా రోజూ ఒక కథ చెప్పేలా ప్రణాళిక ఉండాలి. మీకు సమయం లేదని తప్పించుకోవద్దు. కుటుంబంలో ఎవరికి వీలయితే వాళ్లు చెప్పేలా అయినా ఉండాలి. కథలు పుస్తకాలు కొనడం ఒక మంచి అలవాటు. అది మీరు చేస్తుంటే.. తర్వాత వాళ్లే కొనిపెట్టమని అడుగుతారు. వాళ్లతో కూడా కథలు చెప్పించుకోండి. అలా వింటుంటే మీకు ఉన్న ఒత్తిడి హుష్‌కాకి అవుతుంది. పిల్లలు కూడా ఎంత సంబరపడిపోతారో.. కాసేపు వాళ్లతో కబుర్లు చెప్పండి.. వాళ్లు చెప్పే మాటలు మీరు వింటుంటే ఉత్సాహంగా భలే భలే గమ్మత్తయిన విషయాలు మనతో పంచుకుంటారు. వాళ్ల ఆనందం ఆకాశాన్ని తాకుతుందంటే అతిశయోక్తి కాదు.
పిల్లల కోసం కొంత సమయం కేటాయించండి. వారితో మీరూ కలిసి ఆడినా.. పాడినా.. చదివినా.. చెప్పినా.. వాళ్లకు దగ్గరగా ఉన్నట్లు .. మీతో ఏ విషయాన్నయినా పంచుకోవడానికి అవకాశం ఇవ్వాలి. అలాంటి అవకాశం మీరు వాళ్లతో గడిపే దాన్నిబట్టి ఉంటుంది. అలాంటి వాతావరణం కల్పించాల్సిన బాధ్యత తల్లితండ్రులదే అంటున్నారు నిపుణులు. మరి ఈ రోజు నుంచే మీ పిల్లలతో మీరు ఎంచక్కా కొంత సమయం గడుపుతారు కదూ..!