Oct 21,2023 19:25

'లియో' సినిమా వసూళ్ల విషయంలో తాము ఎంతో సంతోషంగా ఉన్నామని ఆ చిత్ర నిర్మాత లలిత్‌కుమార్‌ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా తమ చిత్రానికి మంచి ఆదరణ వస్తోందన్నారు. తమ చిత్రం రూ.1000 కోట్ల క్లబ్‌లోకి వెళ్తుందని తాము అనుకోవడం లేదన్నారు. తమిళనాడులో ఉదయం నాలుగు గంటలకు షోలు వేయకపోవడంతో దాదాపు రెండు లక్షల మంది వేరే రాష్ట్రాలకు వెళ్లి సినిమా చూశారన్నారు. 'లియో'కు వస్తోన్న రెస్పాన్స్‌ పట్ల నాకెంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే హిందీ మార్కెట్‌ నుంచి భారీ కలెక్షన్స్‌ ఆశించడం లేదు. అభిమానులను దృష్టిలో ఉంచుకుని బెనిఫిట్‌ షోల కోసం ఎంతో ప్రయత్నించాం. కోర్టుకు కూడా వెళ్లాం. అయితే, ఈ విషయంలో విజయ్ అస్సలు జోక్యం చేసుకోలేదు. 'కోర్టుకు ఎందుకు వెళ్లారు. అంత అవసరం ఏముంది?' అని ప్రశ్నించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో సినిమా రిలీజ్‌ కావాలని ఆయన కోరుకున్నారు. 'మాస్టర్‌' టైమ్‌లోనే విజయ్ కు ఏదైనా గిఫ్ట్‌ ఇవ్వాలనుకున్నా. కాకపోతే ఆయన అంగీకరించలేదు. 'నాకు జీతం ఇస్తున్నారు కదా. అది చాలు. ప్రత్యేకంగా గిఫ్ట్‌లు ఏమీ అవసరం లేదు' అన్నారు. మా సినిమా చూసి రజనీకాంత్‌ నాకు ఫోన్‌ చేశారు. సినిమా తనకెంతో నచ్చిందని.. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయని మెచ్చుకున్నారు' అని లలిత్‌ కుమార్‌ తెలిపారు.