ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : గాజా పై ఇజ్రాయిల్ చేస్తున్న దాడులను వామపక్ష పార్టీల నేతలు తమ్మినేని సూర్యనారాయణ, రంగరాజు ఖండించారు. ప్రపంచ శాంతిని నెలకొల్పాలంటూ ఈ దాడులకు వ్యతిరేకంగా నవంబర్ 10వ తేదీన రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. బుధవారం ఎల్బీజీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ... అమెరికా తన ఆధిపత్యం కోసం, ఆయిల్ చమురు కోసం పాలస్తీనా, ఇజ్రాయిల్ దేశాల మధ్య జాత్యహంకార చిచ్చులు రేపి యుద్ధానికి ఆజ్యం పోసిందన్నారు. చిన్నపిల్లలను, మహిళలను విడిచి పెట్టకుండా శరణార్థ శిబిరాల వద్ద కూడా బాంబుల వర్షం కురిపించి ప్రాణ, ఆస్తి నష్టానికి కారణమైందన్నారు. ఈ దుశ్చర్యలను ప్రపంచ దేశాలు, ఐక్యరాజ్యసమితి ఖండిస్తున్నప్పటికీ అమెరికా మాత్రం యుద్దాన్ని ప్రోత్సహిస్తుందని అన్నారు. ఈ విషయంలో ప్రపంచ దేశాలన్నీ ఖండిస్తుంటే దేశ ప్రధాని మోడీ మాత్రం నోరు విప్పటం లేదని విమర్శించారు. గాజాపై దాడులను ఆపాలని ప్రపంచశాంతి నెలకొల్పాలని కోరుతూ నవంబర్ 10వ తేదీన జరిగే నిరసన కార్యక్రమాల్లో ప్రజలు, ప్రజాతంత్ర వాదులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి.లక్ష్మి, టీవీ రమణ, ఆర్. శంకర్రావు పాల్గొన్నారు.