జెరూసలెం : ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం మరింత తీవ్రతరమవుతోన వేళ ... ఉత్తర గాజాలో ఉన్న 11 లక్షలమంది పాలస్తీనా పౌరులు 24 గంటల్లో ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టాలని ఐడిఎఫ్ (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్) ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలపై ఐక్యరాజ్య సమితి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పరిణామాలు దారుణమైన మానవతా సంక్షోభాన్ని సఅష్టిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో గాజాలో ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్ తప్పదనే సంకేతాలు కన్పిస్తున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్‌తోపాటు ఇతర దేశాలకు చెందిన పౌరులు హమాస్ వద్ద బందీలుగా ఉండటంతో వారి ప్రాణాలకు హాని కలగకుండా ఆపరేషన్ చేపట్టడం ఇజ్రాయెల్‌కు సవాలే..! అయినప్పటికీ ఇజ్రాయెల్ సైన్యం గ్రౌండ్ ఆపరేషన్‌కు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
ఐడిఎఫ్ ప్రకటన...
''ఉత్తర గాజాలో ఉన్న పౌరులు తమ వ్యక్తిగత భద్రత కోసం తక్షణమే దక్షిణ ప్రాంతానికి తరలిపోవాలి. 24 గంటల్లో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయండి. మిమ్మల్ని కవచాలుగా వాడుకోవాలని హమాస్ ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారు. వారి నుంచి దూరంగా వెళ్లండి. రాబోయే రోజుల్లో గాజా నగరంలోని హమాస్ నెట్‌వర్క్‌పై ఐడీఎఫ్ దాడులు పెంచనుంది. అమాయక పౌరులకు ఎలాటి నష్టం కలగకూడదని మేం కోరుకుంటున్నాం'' అని ఐడీఎఫ్ తమ ప్రకటనలో వెల్లడించింది.
ఈ ఆదేశాలు వెనక్కి తీసుకోండి : ఐరాస
ఐరాసకు ఇజ్రాయెల్ ఈ సమాచారాన్ని అందించింది. అయితే, ఈ ఆదేశాలపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ''ఇలా రీలకేషన్ జరిగితే అత్యంత దారుణమైన మానవతా సంక్షోభం నెలకొంటుంది. గాజాలో స్కూళ్లు, క్లినిక్‌లు నడుపుతున్న ఐరాస కేంద్రాలు, సిబ్బంది కూడా అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఈ ఆదేశాలను వెనక్కి తీసుకోండి'' అని ఐరాస సూచించింది.